ఆ బాబా ఇక జీవితాంతం జైల్లోనే!

అత్యాచారాల బాబాగా గుర్తింపు పొందిన డేరా బాబా ఆలియాస్ గుర్మీత్ రామ్ ర‌హీమ్ ఇక జీవితాంతం జైల్లోనే గ‌డ‌ప‌నున్నారు. జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య కేసులో పంచ్‌కులలోని సీబీఐ న్యాయ‌స్థానం ఆయ‌న‌ను దోషిగా తేల్చింది. యావ‌జ్జీవ కారాగార శిక్ష‌ను విధించింది. ఈ కేసులో గుర్మీత్‌తో పాటు కుల్దీప్‌ సింగ్‌, నిర్మల్‌ సింగ్‌, కిష‌న్‌ లాల్‌కు కూడా జీవితఖైదు విధిస్తున్నట్లు స్పెషల్ కోర్టు తీర్పు వెలువరించింది.

దోషులందరికీ జైలుశిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధించింది. హ‌ర్యానాలోని సిర్సాలో గ‌ల‌ డేరా స‌చ్ఛా సౌధ ఆశ్ర‌మంలో మహిళలపై గుర్మీత్ సాగించిన అకృత్యాలను రామచంద్ర ఛత్రపతి బయటపెట్టారు. పూరా సచ్ పత్రికలో కథనాలు రాశారు. 2002 అక్టోబరులో రామచంద్ర దారుణ హత్యకు గురయ్యాడు.

గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు జ‌రిపిన కాల్పుల్లో గాయ‌ప‌డ్డ ఆయ‌న ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు. అత్యాచారాల కేసులో ఇప్ప‌టికే జైలులో ఉన్న గుర్మీత్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీబీఐ న్యాయ‌స్థానం విచారించింది. ఆయ‌న‌ను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు ఇచ్చింది.