సర్జరీ పేరుతో దారుణానికి పాల్పడిన డాక్టర్లు… శరీరంలో అవయవాలు మాయం…?

ప్రస్తుత కాలంలో వైద్యం కూడా వ్యాపారంలా మారిపోయింది. గౌరవప్రదమైన డాక్టర్ వృత్తిలో ఉంటూ డబ్బుల కోసం ఆశపడి కొంతమంది డాక్టర్లు దారుణాలకు పాల్పడుతున్నారు. వైద్యం చేసి అధిక మొత్తంలో డబ్బులు దండుకోవడమే కాకుండా సర్జరీ ల పేరుతో పేషంట్లను మోసం చేస్తున్నారు. తాజాగా
ఇటువంటి సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. సర్జరీ పేరుతో డాక్టర్లు చేసిన మోసానికి 15 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయిందని ఆ తల్లిదండ్రులు రోదిస్తున్నారు. బాలిక మృతదేహాన్ని అప్పగించిన తర్వాత అంత్యక్రియలు జరుపుతున్న సమయంలో బాలిక శరీరం మొత్తం సర్జరీ చేసినట్లు కుట్లు కనిపించటమే కాకుండా అందులో నుండి ప్లాస్టిక్ కవర్లు కనిపిస్తున్నాయని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివరాలలోకి వెళ్తే… ఢిల్లీకి చెందిన 15 ఏళ్ల బాలిక గత కొంతకాలంగా అపెండిసైటిస్‌ నొప్పితో బాధపడుతోంది. దీంతో బాలిక తల్లిదండ్రులు జనవరి 21న ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. ఈ క్రమంలో 24వ తేదీన బాలికకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు.. 26వ తేదీన బాలిక మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో బాలిక మృతదేహాన్ని తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా.. బాలిక శరీరాన్ని పలుచోట్ల ఆపరేషన్ చేసిన గాయాలను కుటుంబ సభ్యులు గమనించారు. అంతే కాకుండా వాటిలో పాలిథిన్ బ్యాగులు కనిపించడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

శాస్త్ర చికిత్స పేరుతో తమని మోసం చేసి తమ కూతురు అవయవాలను కాజేసీ శరీరంలో పాలిథిన్ కవర్లు పెట్టి కూతురి శరీరాన్ని అప్పగించారని బాధితురాలు తల్లిదండ్రులు ఆసుపత్రి యాజమాన్యంపై కేసు పెట్టారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాట్లాడుతూ..బాలిక మృతదేహాన్ని జనవరి 31న పోస్ట్ మార్టం జరిపించామని.. పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి ఆసుపత్రి యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.