కొత్తగా ఇంకెలాంటి తీర్పు వస్తుందని దేశంలోని 130 కోట్ల మంది ప్రజానీకం ఊహించి వుంటారు.? 2018 నాటి వ్యవహారం.! ఇప్పుడు తీర్పు వచ్చిందంతే. జరగాల్సిన నష్టమైతే జరిగిపోయింది దేశానికి. రాజకీయాల్లో అవినీతి తగ్గలేదు. పెట్రోల్, డీజిల్ ధరలూ తగ్గలేదు. తీవ్రవాదం సంగతి సరే సరి. డ్రగ్స్ గురించీ కొత్తగా చెప్పేదేముంది.? అంతిమంగా పెద్ద నోట్ల రద్దు నిజానికి ఓ ఫెయిల్యూర్ నిర్ణయం.
కానీ, అంతా సక్రమమేనని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ‘పద్ధతి ప్రకారం వ్యవహరించారాలా.? లేదా.?’ అన్నదానిపైనే సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది.. ఏ పద్ధతిలో నిర్ణయాలు తీసుకున్నరో, ప్రభుత్వ పెద్దలు తాము చెప్పాలనుకున్నది న్యాయస్థానానికి చెప్పేశారు. ఖేల్ ఖతం.. దుకాణ్ బంద్.!
సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు గురించి దేశ ప్రజలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఆ తీర్పు గురించి కాదిక్కడ చర్చ. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశానికి, దేశ ప్రజలకు ఏం ప్రయోజనం ఒనగూడిందన్నదే చర్చ. చాలా బతుకులు నాశనమైపోయాయ్ పెద్ద నోట్ల రద్దు వల్ల.
పెద్దనోట్లను రద్దు చేయడం ద్వారా ఎన్నికల సమయంలో పార్టీలు పంచే డబ్బుల వ్యవహారానికి ముగింపు పడ్డట్టేనన్నారు. కానీ, ఓటుకు రేటు 10 వేలు ఆ పైన పెరిగింది. ఎన్నికల్లో పంచడానికి 2 వేల నోటు చాలా తేలిగ్గా వుంటోంది రాజకీయ పార్టీలు నాయకులకి.
తమ డబ్బు కోసం బ్యాంకుల చుట్టూ, ఏటీఎంల చుట్టూ పనులు మానుకుని మరీ తిరిగి, కొందరు చచ్చిపోయారు కూడా.! ఆ చావులపై కనీసపాటి సంతాపం కూడా ప్రభుత్వ పెద్దలు తెలపలేకపోయారు. పోయిన ప్రాణాలు, నాశనమైన జీవితాలు.. నష్టపోయిన కుటుంబాలకే తెలుసు, పెద్ద నోట్ల రద్దు ఎంత భయంకరమైన విపత్తు అన్నది.!