వేల కోట్లు కాదు, లక్షల కోట్ల నష్టం వాటిల్లింది కరోనా కారణంగా.. అంటూ ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ సంగతి ఇది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలూ ప్రజలకు వాస్తవాలు చెప్పడంలేదు.. ఆర్థికంగా కుదేలైపోతున్న ప్రజల్ని ఆదుకునే ప్రయత్నమూ చేయడంలేదు.
కొన్నాళ్ళ క్రితం.. అంటే కరోనా తొలివేవ్ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ‘హెలికాప్టర్ మనీ’ అనే అంశాన్ని ప్రస్తావించారు.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, అప్పట్లో కేసీఆర్ వాదనకి దేశంలో ఏ ఇతర రాష్ట్రమూ మద్దతు పలకలేదు.
హెలికాప్టర్ మనీ అనేది రిస్కీ అటెంప్ట్.. వర్కవుట్ అయితే మంచిదే. లేకపోతే, నష్టం చాలా తీవ్రంగా వుంటుంది. కానీ, కరోనా వైరస్ ప్రభావంతో పోల్చితే.. హెలికాప్టర్ మనీ వల్ల వచ్చే నష్టం పెద్దదేమీ కాదు. కరోనా మొదటి వేవ్ పూర్తిగా ముగియకుండానే రెండో వేవ్ వచ్చేసింది.
రెండో వేవ్ నడుస్తుండగానే మూడో వేవ్ భయాలు వెంటాడుతున్నాయి. ఇంకెన్ని వేవ్స్ వుంటాయో తెలియని పరిస్థితి. వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నా… అంతకన్నా వేగంగా కొత్త వేరియంట్లు (వైరస్ మ్యుటేషన్లు) దూసుకొచ్చేస్తున్నాయి.
దాంతో, ముందు ముందు మరింత భయానకమైన పరిస్థితుల్లోనే ఎదుర్కోబోతున్నామన్నది నిర్వివాదాంశం. అయినా, ఇప్పటికీ కేంద్రం బాధ్యతాయుతంగా వ్యవహరించడంలేదు.
రాష్ట్రాలు మాత్రం ఏం చేయగలుగుతాయి.? నష్టం.. నష్టం.. ఎటు చూసినా నష్టమే. కేవలం వైద్య రంగం మాత్రమే లాభాల్లో నడుస్తోంది. అదీ ప్రైవేటు వైద్య రంగం. నిలువునా ప్రజల్ని దోచేస్తున్నాయ్ ప్రైవేటు ఆసుపత్రులు. మరోపక్క, మందుల తయారీ సంస్థలూ పండగ చేసుకుంటున్నాయి.
మిగతా రంగాలన్నీ దాదాపుగా కుదేలైపోయాయి. ఈ నష్టం వందల కోట్లలో కాదు.. వేల కోట్లలో కాదు, లక్షల కోట్లలో వుంటాయన్నది ఆర్థిక రంగ నిపుణుల వాదన. అయినా, కేంద్రం మాత్రం ఆల్ ఈజ్ వెల్.. అంటోంది. ఎవర్ని మభ్యపెట్టడానికి ఇదంతా.?