Sukesh – Elon Musk: జైలు నుంచే సుకేశ్ బిజినెస్ డీల్స్.. ఈసారి ఎలాన్ మస్క్‌కి లేఖ

ఆర్థిక మోసాలకు పాల్పడి జైలు జీవితం గడుపుతున్న సుకేశ్ చంద్రశేఖర్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఈసారి అతని లేఖ సామాన్యమైనది కాదు, ఏకంగా టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కి రాశాడు. మస్క్‌కు తాను 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానంటూ అతను లేఖలో పేర్కొన్నాడు. మస్క్‌కి తన ఆఫర్‌ను అంగీకరించాలని, ఈ పెట్టుబడి ‘ఎక్స్’ (ట్విట్టర్) అభివృద్ధికి ఉపయోగపడుతుందని వివరించాడు.

ప్రస్తుతం ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న సుకేశ్, తనకు ఎక్స్ ఎంతో ఇష్టమైన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అని తెలిపాడు. అంతేకాకుండా, మస్క్‌ను ‘నా మనిషి’ అంటూ సంబోధించడం విశేషం. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (DOGE)కి మస్క్ నాయకత్వం వహించినందుకు అభినందనలు తెలిపాడు. అంతేకాదు, తన కంపెనీ ఎల్ఎస్ హోల్డింగ్స్ ఇప్పటికే టెస్లా స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టిందని, భారీ లాభాలు కూడా పొందిందని వెల్లడించాడు.

ఇదే మొదటిసారి కాదు, సుకేశ్ జైలు నుంచి లేఖలు రాయడం అలవాటే. ఇటీవ‌ల తన ప్రియురాలు, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ పుట్టినరోజుకు కూడా ప్రత్యేకంగా లేఖ రాశాడు. ఆమె ఇష్టపడే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ కూడా ‘ఎక్స్’నే అని తాజాగా మస్క్‌కి రాసిన లేఖలో ప్రస్తావించాడు.

మొత్తానికి జైల్లో ఉన్నా కూడా సుకేశ్ తన హవాను కొనసాగిస్తూనే ఉన్నాడు. కోట్ల రూపాయల మోసాలకు పాల్పడి, రాజకీయ నేతలతోనూ డీలింగ్ చేసిన సుకేశ్.. ఇప్పుడు ప్రపంచంలోని అగ్రశ్రేణి వ్యాపారవేత్తలతో సంబంధాలను చర్చలోకి తెచ్చేలా లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. మస్క్ దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలి!

Public Reaction On Pawan Kalyan Comments Over Ys Jagan Walkout from Assembly || Ap Public Talk || TR