`మీ టూ`: భ‌ర‌త‌మాత‌ను కూడా వ‌దల్లేదు!

వివిధ రంగాల్లో మ‌హిళ‌లు లైంగిక వేధింపుల‌కు గురైన నేప‌థ్యానికి సంబంధించిన `మీ టూ` బాధితుల్లో చివ‌రికి భ‌ర‌త‌మాత‌ను కూడా లాగారు. భ‌ర‌త‌మాత కూడా మీటూ బాధితురాలే అనే అర్థం వ‌చ్చేలా ఓ పెయింట్ వేసి, ఎగ్జిబిష‌న్‌లో ప్ర‌ద‌ర్శించారు. చెన్నైలోని ల‌యోలా క‌ళాశాల యాజ‌మాన్యం ఆదివారం క్యాంప‌స్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిష‌న్‌లో ఈ పెయింటింగ్ క‌నిపించింది.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ, బీజేపీ, రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన పెయింటింగ్‌లు కూడా ఇందులో ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచారు. సంజీవ ప‌ర్వ‌తాన్ని తీసుకెళ్తున్న హ‌నుమంతునిగా న‌రేంద్ర‌మోడీ పెయింట్ వేశారు. ఆయ‌న చుట్టూ స్కామ్‌లు ముసురుకున్న‌ట్లు చూపించారు. సంఘ్ ప‌రివార్ కార్య‌క‌ర్త‌లు మ‌హిళ‌ల‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డుతున్నార‌నే అర్థం వ‌చ్చేలా ప‌లు పెయింటింగ్‌ల‌ను వేశారు.

రాఫెల్‌ డీల్‌ అనే శీర్షికతో బీజేపీ ఎన్నిక‌ల గుర్తు తామర పువ్వు రేకులకు బదులుగా ఎలుకలను చిత్రీకరించారు. హిందుత్వాన్ని కించ‌ప‌రిచేలా పెయింటింగ్‌లు వేశారంటూ ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తలు లయోలా కాలేజీ ఆవరణలో దాడికి దిగారు. ఆందోళ‌న చేశారు. సంఘ్ ప‌రివార్ కార్య‌క‌ర్త‌ల‌కు స్థానిక పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న మ‌రుస‌టి రోజు..క‌ళాశాల యాజ‌మాన్యం బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పింది.