ఫేస్ టు ఫేస్‌: సీబీఐ అధికారుల‌ను నిర్బంధించిన పోలీసులు!

మ‌న‌దేశంలో అత్యున్న‌త ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ. ఏ రాష్ట్రంలోనైనా, ఎవ‌ర్న‌యినా, ఎలాంటి కేసుల్లోనైనా త‌మ ప‌రిధిలోకి వ‌స్తే విడిచి పెట్ట‌దు. దాని అంతు తేలుస్తుంది. ఆనుపానులు బ‌య‌ట పెడుతుంది. అస‌లు సిస‌లు నిందితుల‌ను వెలికి తీస్తుంది. దాని చ‌రిత్ర‌ను వెలుగులోకి తీసుకొస్తుంది. అలాంటి సంస్థ ప్ర‌తిష్ఠ మ‌స‌కబారుతోంది.

ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆస్తుల కేసు వ్య‌వ‌హారంలో సీబీఐ ఇప్ప‌టికే అనేక మొట్టికాయ‌లు తిన్న‌ది. ఇదో త‌ప్పుడు కేసు అని సామాన్యులు కూడా నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. జ‌గ‌న్‌పై న‌మోదు చేసిన 11 ఛార్జిషీట్ల‌లో ఇప్ప‌టికే 10ని న్యాయ‌స్థానాలు కొట్టివేశాయి కూడా.

ముడుపుల కేసులో అనేక కుదుపుల‌ను ఎదుర్కొన్న సీబీఐకి తాజాగా మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. విచార‌ణ‌కు వ‌చ్చిన సీబీఐ అధికారుల‌ను పోలీసులు అడ్డుకున్నారు. సీబీఐ అధికారుల‌ను కారు కూడా దిగ‌నివ్వ‌లేదు. వ‌చ్చిన వారిని వ‌చ్చిన‌ట్టే పోలీసు జీపు ఎక్కించి, పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

కోల్‌క‌త‌లో ఆదివారం సాయంత్రం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప‌శ్చిమ బెంగాల్‌లో ప్ర‌కంప‌న‌లు రేపిన చిట్‌ఫండ్ కుంభ‌కోణం కేసులో కోల్‌క‌త క‌మిష‌న‌ర్ రాజీవ్ కుమార్‌ను విచారించ‌డానికి సీబీఐ అధికారులు ఆయ‌న ఇంటికి చేరుకోగా.. పోలీసులు అడ్డుకున్నారు. రోజ్‌వ్యాలీ, శార‌దా పోంజీ కుంభ‌కోణాల్లో రాజీవ్‌కుమార్‌ను విచారించ‌డానికి కేంద్రం సీబీఐకి అనుమ‌తి ఇచ్చింది.

ఈ నేప‌థ్యంలో సీబీఐ అధికారులు కోల్‌క‌త సాల్ట్‌లేక్ ప్రాంతంలో ఉన్న రాజీవ్ కుమార్ ఇంటికి చేరుకోవ‌డానికి ప్ర‌య‌త్నించారు. ఈ సంద‌ర్భంగా సీబీఐ అధికారులు, స్థానిక పోలీసుల మ‌ధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. సీబీఐ అధికారుల‌ను పోలీసులు రాజీవ్‌కుమార్ ఇంట్లో అడుగు పెట్ట‌నివ్వ‌లేదు.

ఆయ‌న ఇంటికి 200 మీట‌ర్ల దూరంలో బ్యారికేడ్ల‌ను ఏర్పాటు చేసి, మ‌రీ వారిని చుట్టుముట్టారు. త‌మ జీపు ఎక్కించారు. బిధాన్ న‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న అనంత‌రం ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ స్వ‌యంగా రాజీవ్ కుమార్ ఇంటికి చేరుకున్నారు. ఆయ‌న‌కు అండ‌గా నిలిచారు.

1989 బ్యాచ్‌, ప‌శ్చిమ బెంగాల్ క్యాడ‌ర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి రాజీవ్ కుమార్‌. ఇటీవ‌లే ఎన్నిక‌ల క‌మిష‌న్ నిర్వ‌హించిన స‌మావేశానికి ఆయ‌న హాజ‌రు కాలేదు. తాను రాలేక‌పోతున్నాన‌ని, క్ష‌మాప‌ణ‌లు చెబుతూ ఓ ఎస్ఎంఎస్‌ను ఆయ‌న ఆ అధికారుల‌కు పంపించారు.

https://twitter.com/ANI/status/1092052253572136960