సుప్రీంకోర్టుకు చేరిన “కొత్త పార్లమెంట్” వ్యవహారం!

కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. ఈ క్రమంలో మరో పరిణామం చోటుచేసుకుంది. దీంతో… కొత్త పార్లమెంట్ పంచాయితీ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. దేశ సర్వోన్నత న్యాయస్థానంలో దీనికి సంబంధించి ఓ పిల్ దాఖలైంది. ప్రధాన మంత్రితో కాకుండా.. రాష్ట్రపతి చేత పార్లమెంట్‌ ను ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్‌ లో పేర్కొన్నారు!

తెలిసి చేశారో తెలియక చేశారో తెలియదు కానీ… కొత్త పార్లమెంటు భవనాన్ని తానే ప్రారంభించాలని, తన చేతులమీదుగానే రిబ్బన్ కటింగ్ కార్యక్రమం జరగాలని ప్రధాని నరేంద్ర మోడీ భావించారు. అయితే ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్దం అని అంటున్నాయి విపక్షాలు. రాజ్యాంగాధినేత అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కాకుండా.. ప్రధాని చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభించడం ప్రజాస్వామ్యంపైనే దాడిగా అభివర్ణించాయి. ఇలా చేయడమంటే రాష్ట్రపతిని అవమానించినట్లేనని విపక్ష నేతలు మండిపడుతున్నారు.

దీంతో… 28న జరగనున్న పార్లమెంట్‌ ప్రారంభోత్సవాన్ని తాము బహిష్కరిస్తున్నట్లు పేర్కొంటూ కాంగ్రెస్‌ సహా 19 పార్టీలు ఉమ్మడి ప్రకటన జారీ చేశాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 79 ప్రకారం పార్లమెంట్‌ అంటే రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్‌ సభ అని అర్థమని.. రాష్ట్రపతి దేశాధినేత మాత్రమే కాక పార్లమెంట్‌ లో సమగ్రభాగమని ప్రతిపక్షాలు తమ సంయుక్త ప్రకటనలో గుర్తుచేశాయి. ఈ నేపథ్యంలో… సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పార్లమెంట్‌ ను ప్రారంభించాల్సింది రాజ్యాంగానికి అధినేతగా ఉన్న రాష్ట్రపతే తప్ప… ప్రధాని కాదు అంటూ పిల్‌ లో పేర్కొన్నారు.

అయితే ఈ పిల్ పై విచారణ జరిపిన అనంతరం… రాష్ట్రపతి తోనే పార్లమెంట్ ఓపెనింగ్ జరగాలని సుప్రీం పేర్కొంటే మాత్రం నరేంద్ర మోడీకి అది అతిపెద్ద దెబ్బ అవ్వబోతోంది. అప్పుడు ప్రతిపక్షాలు చేసే విమర్శలు తట్టుకోవడం మోడీ & కో లకు తలకుమించిన భారం అవుతుందనడంలో సందేహం ఉండకపోవచ్చు!