రాహుల్ ను వదలనంటున్న బిజెపి, వయనాడ్ నుంచీ స్మతి ఇరానీ పోటీ ?

రాహుల్ గాంధీ అమేధీ పాటు కేరళలోని వయనాడ్ నియోజకర్గం నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అమెధీ లోనే కాదు, కేరళలో కూడా రాహుల్ ను ఓడించాల్సిందే నంటున్నది బిజెపి.

దీనికి సరైన అభ్యర్థి ఎవరు? బిజెపి యుద్ధ ప్రాతిపదికన రెండు హై ప్రొఫైల్ పేర్లను పరిశీలిస్తున్నది.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్ వదలి ఎక్కడో దిగువన ఉన్నకేరళకు ఎందుకు వస్తున్నారనే దాని మీద ఎవరి వాదనలు వారికున్నాయి. రాహుల్ భయపడి పారిపోయారని బిజెపి, కాదు, దక్షిణాది ప్రజల ఆహ్వానం మేరకే వెళుతున్నారని కాంగ్రెస్ చెబుతున్నాయి.

  రాహుల్  మీద అమేధీలో పోటీచేస్తున్నది కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. 2014 లో కూడా పోటీ చేశారు గాని ఓడిపోయారు. ఈ సారి ఎలాగైనా రాహుల్ ను ఓడించాలని బిజెపి మళ్లీ ఆమెనే రంగంలోకి దించింది. ఈ అయిదేళ్ల కాలంలో ఆమె కేంద్రమంత్రిగా అమేధీలో బాగా పర్యటించారు. అక్కడ యువకులకు ఉపాధినిచ్చే కార్యక్రమాలను చేప్టారు. తుపాకుల తయారీ కర్మాగారం కూడా తెచ్చారు.

ఆంధ్రప్రదేశ్ స్వయంఉపాధి మహిళ (డ్వాక్రా) సంఘాలు బాగా విజయవంతమయిన సంగతి తెలుసుకదా? ఈ విధానం ద్వారా ఆయన అమేధీ మహిళలలో చైతన్యం తీసుకురావాలనుకున్నారు రాహల్ గాంధీ. అమేధీలో ఆంధ్రా మోడల్ డ్వాక్రా సంఘాల ఏర్పాటుచేసిస పొదుపు ఉద్యమం తీసుకువచ్చేందుకు ఆయన అప్పటి ఐఎఎస్ అధికారి కొప్పుల రాజు సాయం తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ కుచెందిన వందలాది మంది మహిళలు అక్కడికి వెళ్లి సంఘాలను ఏర్పాటుచేసి వచ్చారు. ఆ రాజుయే ఇపుడు రాహుల్ గాంధీ పొలిటికల్ సెక్రెటరీ.

ఇలా రాహుల్ గాంధీ అట్టడుగు స్థాయి మహిళలను ఆకట్టుకుంటూ ఉంటే బిజెపి కేంద్ర నిధులతో కార్యక్రమాలను చేపట్టి పార్టీ ఉనికి పటిష్టపరుచుకుంది. ఇది అయిదేళ్ల కార్యక్రమంగా ముందుచూపుతో అమలు చేసింది. అందుకే అపుడపుడు స్మృతి ఇరానీ అక్కడి పంపి ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకోమని చెప్పింది.

ఈ పథకం సక్సెస్ అయిందని, ఈ సారి స్మృతి చేతిలో రాహుల్  ఓటమి తప్పదని బిజెపి ప్రచారం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఆయన వయనాడ్ ను రెండో లోక్ సభ నియోజకవర్గంగా ఎంపిక చేసుకున్నారు.

అయతే, బిజెపి రాహుల్ గాంధీని వదిలేది లేదని చెబుతూ ఉంది.రాహుల్ ను ఓడిస్తే, భారత రాజకీయల్లో కాంగ్రెస్ ఫామిలీ చరిత్ర ముగింపుకొస్తుందని బిజెపి భావిస్తున్నది.

1952 నుంచి ఇప్పటిదాకా ఒకటి రెండుసార్లు తప్ప నెహ్రూ-గాంధీ ఫామిలీ నుంచి ఎవరో ఒకరు లోక్ సభ లో ఉంటున్నారు. అయితే, ఎమర్జన్సీ ఎత్తేశాక జరిగిన ఎన్నికల్లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఓడిపోయారు. అపుడు ఆమె  కుటుంబలో ఎవరూ రాజకీయాల్లో లేరు కాబట్టి కుటుంబ ప్రతినిధి ఎవరూ చట్టసభల్లో లేకుండా పోయారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ చనిపోయాక, సోనియా గాంధీ రాజకీయాల్లోకి వచ్చే దాకా మధ్యలో కూడా గ్యాప్ వచ్చింది.

అయితే, సోనియా గాంధీ రాజకీయాల్లో ఉన్నా రాహుల్ గాంధీని ఓడిస్తేచాలు, కాంగ్రెస్ పనయిపోతుందని బిజెపి భావిస్తున్నది. అందుకే రాహుల్ గాంధీ వయనాడ్ కు ‘పారిపోయినా’ వదలకుండా స్మృతి ఇరానీని కూడా అక్కడి నుంచి ఆయన మీద పోటీ చేయించాలని బిజెపి భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.దీని మీద సోమవారం రాత్రి కల్లా నిర్ణయం వస్తుందని పార్టీవర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది.

ఇపుడు సీట్ల సర్దుబాటులో భాగంగా వయనాడ్ సీటును భారతీయ జనతా పార్టీ తన మిత్రపక్షమయిన భారత్ ధర్మ జన సేన (బిడిజెఎస్ ) కేటాయించింది. పైలి వతియాట్టు అనే వ్యక్తి బిడిజెఎస్ అభ్యర్థిగా ప్రకటించింది.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో ఇపుడు బిజెపి వయనాడ్ సీటు విషయంలో తర్జనభర్జనల్లో ఉంది.బిజెడిఎస్ నుంచి ఆ సీటును వెనక్కి తీసుకుని మరొక సీటు  కేటయించి వయనాడ్ నుంచి మాంచి నేషనల్ ఫిగర్ ను ఫోటీలో పెడితే ఎలా ఉంటుందనే విషయాన్ని పార్టీ అత్యసవరంగా చర్చిస్తూ ఉందని తెలిసింది.

ఇక్కడే మళ్లీ స్మృతి ఇరానీ పేరు కూడా  వినపడుతూ ఉంది.

రాహుల్ మీద పోటీ పెట్టేందుకు బిజెపి రెండు పేర్లను పరిశీలిస్తున్నదని విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో ఒక పేరు కేరళ బిజెపి అధ్యక్షుడు పిఎస్ శ్రీధరన్ పిళ్లై దయితే, రెండో పేరు స్మతి ఇరానీ.

సోమవారం రాత్రిలోపు తుది నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నారు.