బీజేపీ ఖాతాలో అయోద్య ఓటు బ్యాంకు.!

2024 సార్వత్రిక ఎన్నికల ముందర అయోద్య రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట వెనుక రాజకీయం లేదని ఎలా అనుకోగలం.? నిజానికి, దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొందంటే, అది బీజేపీ వల్ల కాదు.. రాముడి మీద ప్రజలకున్న భక్తితోనే.! కానీ, బీజేపీ మాత్రం ఈ వ్యవహారాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన టీమ్.. తెరవెనుక రాజకీయం చక్కబెట్టేస్తున్నారు. బీజేపీ శ్రేణులు కింది స్థాయిలో ‘జై శ్రీరామ్’ అంటూనే, ‘జై బీజేపీ’ అనే నినాదాల్ని జనంలోకి బలంగా తీసుకెళ్ళగలుగుతున్నారు.

‘బీజేపీ అధికారంలో వుంది కాబట్టే, రామ మందిర నిర్మాణం అయోధ్యలో సాధ్యమయ్యింది.. రామజన్మభూమిలో రాములోరి విగ్రహం తిరిగి ప్రతిష్టించబడుతోంది.. ప్రపంచ ప్రఖ్యాత ఆధ్మాత్మిక కేంద్రంగా అయోద్య మారబోతోంది..’ అని బీజేపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి.

‘ఇదీ నిజమే కదా..’ అన్న భావన చాలామంది హిందువుల్లో కలుగుతోంది. మైనార్టీ ఓటు బ్యాంకు విషయమై బీజేపీ ఆలోచనలు ఎప్పుడూ ఒకేలా వుంటాయి. అది ఓపెన్ సీక్రెట్.!

ఊరూ వాడా కాషాయ జెండాలు ఎగురుతోంటే, అది హిందుత్వకి గుర్తింపు మాత్రమే కాదు, బీజేపీ ఉనికి కూడా.! జెండాల్ని ఉచితంగా పంచడంతోపాటు, ఊరేగింపుల కోసం బీజేపీ నాయకులు చేస్తున్న ఖర్చు అంతా ఇంతా కాదు.

గతంలోనూ ఇలాంటివి దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ జరిగాయి, జరుగుతూనే వుంటాయి. కానీ, రామజన్మభూమి అయోద్యలో రాములోరి దేవాలయం, అందులో విగ్రహ ప్రతిష్ట.. ఈ కార్యక్రమాలకు అనుసంధానంగా ఒకేసారి ఇంత పెద్ద సంబరం.. ఇంతకు ముందెన్నడూ జరగలేదు.

గంపగుత్తగా హిందువుల ఓట్లన్నీ బీజేపీకే పడతాయన్న భావన కమలనాథుల్లో బలపడుతోందంటే, అది అతిశయోక్తి కాదు.!