భారత దేశం యోగా గురు బాబా రామ్ దేవ్ ప్రధాని మోదీకి షాకిచ్చారు. 2019 ఎన్నికల్లో ప్రధానిగా ఆయన మోదీని సపోర్టు చేయడం లేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఈ రోజు మధురై లో ప్రకటించేశారు.
ఇది ప్రధాని మోదీ కే కాదు , బిజెపి కి దిగ్భ్రాంతి కలిగించే ప్రకటన. ఎందుకంటే ఆయన 2014 ఎన్నికల్లో చాలా బహిరంగంగా బిజెపి ప్రధాని అభ్యర్థి గా నరేంద్రమోదీని సమర్థించారు. క్యాంపెయిన్ చేశారు. అంతేకాదు, 2014 ఎన్నికల్లో 300 సీట్లు గెల్చుకుని మోదీ ప్రధాని అవుతారని కూడా ప్రకటించారు.
దీనికి ప్రతిఫలంగా ప్రధాని అయ్యాక మోదీ యోగాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. బాబా రామ్ దేవ్ కు ఎనలేని ప్రాముఖ్యం ఇచ్చారు.
యోగాను ఐక్యరాజ్యసమితి అధికారిక కార్యక్రమంగా మార్చారు. ప్రపంపదేశాలన్నింట ా యోగా మొదలయింది. దీనితో బిజెపి మిత్రపక్షాలు కూడా ఆయన బాగా గుర్తింపు నిచ్చాయి. ఆయన పరిశ్రమలను స్థాపించేందుకు భూములిస్తామని ప్రకటించాయి. ఇయన కటాక్షం కోసం ఎదురు చూశాయి. ఆయన జీన్స్ పాంట్స్ యూనిట్ పెట్టాలని ఆంధ్రప్రదేశ్, ఆయన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలని తెలంగాణలు పోటీపడ్డాయి. అదప్పటి మాట.
మరి ఇపుడేమయిందో ఏమో బాబా రామ్ దేవ్ ప్రధాని అభ్యర్థిగా తాను ఎవరినీ సమర్థించడం గాని వ్యతిరేకించడం గాని చేయనని చెప్పారు.
మంగళవారం నాడు మధురై విమనాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ సారి ఎన్నికల మీద దృష్టిపెట్టడం లేదని చెప్పారు. ‘2019 ఎన్నికల్లో ఎవరకి మద్దతీయను, ఎవరినీ వ్యతిరేకించను,’ అని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పి బిజెపికి షాకిచ్చారు.అంతేకాదు, 2019 ఎన్నికల తర్వాత ఎవరు ప్రధాని అవుతారో కూడా చెప్పలేనని అన్నారు.
‘నాకు రాజకీయ అజండా గాని మత తత్వ అజండా గాని లేదు. నా లక్ష్యమంతా భారతదేశాన్ని, ప్రపంచాన్ని అధ్యాత్మికం చేయడమే. హిందూ ఇండియా, మతతత్వ ఇండియా చేయడం నా అభీష్టం కాదు,’ అన్నారు. ఇది కచ్చితంగా బిజెపి తో ఆయన దూరం జరిగారనేందుకు నిదర్శనమే.
రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీష్ గడ్ లలో బిజెపికి ఎదురు దెబ్బ తగలడం, ఆ రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడినతర్వాత బాబాలో వచ్చిన పరివర్తనే ఇదా?
రామేశ్వరంలో జరిగిన భారత్ స్వాభిమాన్ కార్యక్రమంలో ప్రసంగించేందుకు ఆయన మధురై వచ్చారు.