ఉత్తరప్రదేశ్‌ లో దారుణం.. చిన్నారి ప్రాణం తీసిన డాక్టర్..?

డాక్టర్లను ప్రజలు దైవంతో సమానం భావించి గౌరవిస్తారు. అయితే ప్రస్తుత కాలంలో ప్రజలు ప్రాణాలు కాపాడే డాక్టర్లు డబ్బులకి ఆశ పడి దారుణాలకు పాల్పడుతున్నారు. అంతే కాకుండా కొంతమంది డబ్బు సంపాదించడానికి ఎలాంటి విద్యార్హతలు లేకుండా, డాక్టర్ అవతారమెత్తి ప్రజలను మోసం చేస్తున్నారు. నకిలీ సర్టిఫికెట్లతో డాక్టర్ అవతారం ఎత్చి హాస్పిటల్స్, క్లినిక్స్ ప్రారంభించి అనారోగ్యంతో వచ్చిన ప్రజలకు వచ్చీ రాని వైద్యం చేసి ప్రాణాలు తీసుస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఎన్నో సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో అటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాలలోకి వెళితే…ఉత్తరప్రదేశ్‌ లోని అట్టా జిల్లాలోని అలీగంజ్ ప్రాంతంలో ఒక నకిలీ డాక్టర్ చేసిన చికిత్స వల్ల చిన్నారి ప్రాణం కోల్పోయాడు.అలీగంజ్ ప్రాంతానికి చెందిన హరిశంకర్ తన రెండున్నర నెలల చిన్నారి ఆనారోగ్యంతో బాధపడుతుంటే వైద్యం కోసం తిలక్ సింగ్ ఆసుపత్రికి వచ్చాడు. దీంతో తిలక్ సింగ్ చిన్నారిని పరీక్షించి అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయాలంటూ తల్లిదండ్రుల అనుమతితో శస్త్ర చికిత్స మొదలు పెట్టాడు. అయితే చిన్నారికి ఆపరేషన్ చేసిన తర్వాత తీవ్ర రక్తస్రావం కావడంతో బుధవారం మృతి చెందింది.

అయితే చిన్నారి మరణించడంతో భయపడిన తిలక్ సింగ్ చిన్నారి మరణించిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పకుండా అక్కడి నుండి పారిపోయాడు. ఆ తర్వాత చిన్నారి మరణించిన విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే తిలక్ సింగ్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారి తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అంతేకాకుండా ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఉమేష్ చంద్ర త్రిపాఠి తెలిపారు. చిన్నారి మరణానికి కారణమైన డాక్టర్ ని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.