దేశంలోని ప్రధాన, కీలక సంస్థలు నియంత్రణ కోల్పోయాయా? కొద్దిరోజుల కిందట రిజర్వుబ్యాంక్ గవర్నర్ ఊర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. దేశ ప్రధాన దర్యాప్తు సంస్థ సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ అర్ధంతరంగా తన పదవీ కాలాన్ని ముగించారు. తాజాగా- నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఛైర్మన్ అశోక్ చావ్లా కూడా గుడ్‌బై చెప్పారు. శుక్రవారం రాత్రి ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో అయిదుమందిని విచారించడానికి కేంద్రం అనుమతి ఇచ్చిందంటూ సీబీఐ ఢిల్లీ హైకోర్టుకు వెల్లడించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ అయిదుమందిలో అశోక్ చావ్లాతో పాటు కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం, ఆయన కుమారుడు కార్తి ఉన్నారు. మరో ఇద్దరి వివరాలు తెలియరావాల్సి ఉంది. ఊర్జిత్ పటేల్‌తో మొదలైన ఈ రాజీనామాల పర్వం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వరకూ పాకింది.