హాట్ న్యూస్ : పతనంలో పోటీ పడుతున్న మోడీ, రూపాయి విలువ 

(ఎం. కోటేశ్వర రావు)

‘ 48 సంవత్సరాలలో కాంగ్రెస్‌ చేయలేని దానిని నరేంద్రమోడీ 48నెలల్లో చేసి చూపించారు అన్నది తాజాగా ఆయన వీర భక్తులు చేస్తున్న భజనలలో ఒకటి. త్వరలో కొద్ది వారాల్లోనే లోక్‌సభ మధ్యంతర ఎన్నికల ప్రకటన రాబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మోడీ భక్తుల భజన రాతావళిలో రూపాయి విలువ గురించి కూడా చేర్చారు. పురుషలందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లు జర్నలిస్టులలో నిజమైన జర్నలిస్టులు వేరయా అనుకుంటే సిగ్గుమాలిన జర్నలిస్టుల ప్రతినిధిగా చెప్పాలంటే చాలా మంది వున్నారు. వారెవరో అందరికీ బాగా తెలుసు. మోడీ బృందంలో ఆర్నాబ్‌ గోస్వామి అనే ఒక పేరు మోసిన జర్నలిస్టు వున్నాడు. వెధవాయను నేను అంటే నీ కంటే పెద్ద వెధవాయను నేను అంటూ ఒక పాత సినిమాలో పాట వుంది. ఆర్నాబ్‌ గోస్వామి మోడీ భజన చేస్తుంటే ‘మా హీరో ఆర్నాబ్‌ గోస్వామి, మేము ఎల్లవేళలా అతనికి మద్దతు ఇస్తాము అంటూ ఫేస్‌బుక్‌లో ఒక పేజీని సృష్టించారు. వారు తాజాగా రూపాయి విలువ గురించి స్క్వింట్‌ నియాన్‌ అనే పేరుతో ఒక ట్వీట్‌ సమాచారాన్ని ప్రచారంలో పెట్టారు. దాని సారాంశం ఇది.’హార్వర్డ్‌ బంగారు పతక గ్రహీత ఆర్ధికవేత్త (మన్మోహన్‌ సింగ్‌) హయాంలో 2008లో ఒక డాలరుకు రూపాయి విలువ 39 కాగా 2014లో 68, ఒక చాయ్‌ వాలా(నరేంద్రమోడీ) హయాంలో 2014లో 68 వుండగా 2018లో 69. ఎదుటి వారు అవివేకులని భావించి ఎక్కటం తప్ప ఏమిటిది? ‘. అని ప్రశ్నించారు, అంటే మన్మోహన్‌ సింగ్‌ హయాంలో 39 నుంచి 68కి పడిపోతే దాన్ని వదలి పెట్టి 68 నుంచి 69కి మాత్రమే పడిపోయిన మోడీ గురించి రచ్చ చేస్తున్నారేమిటి అంటూ ఎదురు దాడికి దిగటం. ఈ స్క్వింట్‌ రియాన్‌ ఫ్రొఫైల్లో ఫెమినిస్ట్‌ అని వుంది కనుక మహిళ అనుకోవచ్చు. ఆడో మగో, అసలు నకిలీ ఖాతానో వదలివేద్దాం. పేరును బట్టి విదేశీయులు కూడా ప్రధాని మోడీ పాలనా తీరు గురించి ఎలా ప్రశంసిస్తున్నారో చూడండి అని చెప్పుకోవటమే దీని ప్రధాన లక్ష్య ం. దానిలో అంశమే చర్చనీయాంశం.

‘అధికార కేంద్రాన్ని కాపాడు కోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్ధేశం లేదు,రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు ‘ ‘ యుపిఏ ప్రభుత్వాన్ని, రూపాయిని చూస్తుంటే ఎవరెంత ఎక్కువగా పతనం చెందుతారో పోటీ పడుతున్నట్లుగా వుంది’ ‘ రూపాయి తన విలువను కోల్పోయింది, ప్రధాని తన సొగసును కోల్పోయారు’ ఇద్దరు ప్రముఖు చేసిన వ్యాఖ్యలివి. మొదటి రెండు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ చేస్తే, మూడవది బిజెపి లోక్‌సభా పక్షనేతగా వున్నపుడు సుష్మా స్వరాజ్‌ చేసిన ట్వీట్‌ . ఇప్పుడు జూన్‌ 28న రు.69.09లకు పతనం చెందిన రూపాయితో నరేంద్రమోడీ తన రికార్డును తానే బద్దలు కొట్టుకొని కొత్తది సృష్టించారు. తేలు కుట్టిన దొంగల మాదిరి ఏ ఒక్క ప్రభుత్వ నేతా దీని మీద నోరు విప్పటం లేదు. మరుగుజ్జులతో ప్రచార దాడి చేయిస్తున్నారు. నిజానికి ఎదుటి వారు అమాయకులని భావించటమే కాదు, ఒక అవాస్తవాన్ని వందసార్లు చెబితే నిజమై కూర్చుంటుందన్న గోబెల్స్‌ సూత్రాన్ని తు.చ తప్పకుండా పాటిస్తున్న వారు చేస్తున్న ప్రచారదాడి ఇది.

మన్మోహన్‌ సింగ్‌ అదికారంలో వుండగా 2013 ఆగస్టు 28న రూపాయి విలువ డాలరుకు రు.68.85కు పడిపోయి ఒక రికార్డు నమోదు చేసింది. నరేంద్రమోడీ సర్కార్‌ 2016 నవంబరు 24న దాన్ని రు.68.86కు దిగజార్చి పాత రికార్డును బద్దలు చేసింది. అదే సర్కార్‌ 2018 జూన్‌ 28న రు.69.09లకు పతనం చెందిన రూపాయితో మరో ‘విజయం’ సాధించింది. ప్రతి నెలాఖరులో మోడీ చెప్పే తన మనసులోని మాటలో దీని గురించి ఇంతవరకు ఎలాంటి ప్రస్తావన చేయలేదు. ప్రస్తుతం మోడీ మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా వుండి, గతంలో ప్రతిపక్ష నేతగా వున్న రవిశంకర ప్రసాద్‌ నాడు ‘పూర్తిగా ఆర్ధిక వ్యవస్ధ దుర్నిర్వహణ’ కారణంగా రూపాయి పతనం అవుతున్నదన్నారు. ‘ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) మరియు విదేశీ సంస్ధాగత పెట్టుబడుల (ఎఫ్‌ఐఐ)తో ఆర్ధిక వ్యవస్ధను నిర్వహించే యుపిఏ విధాన కారణంగానే ఇలా జరుగుతున్నదని చెప్పారు. మన దేశం నుంచి డబ్బు తరలి పోయినందున రూపాయి విలువ పడిపోయిందని లాయర్‌గారు వాదించారు. ‘యుపిఏ ఏర్పడినపుడు డాలరకు రూపాయి విలువ రాహుల్‌ గాంధీ వయస్సుతో సమంగా వుంది. ఈ రోజు సోనియా గాంధీ వయస్సుకు దగ్గర అవుతున్నది.అది మన్మోహన్‌ సింగ్‌ వయస్సుకు దగ్గర అవుతుందేమోనని భయంగా వుంది ‘ అని చమత్కరించారు.

ఇప్పుడు రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది, యుపిఏ పాలనా విధానాలను మార్చి రూపాయి విలువను పెంచకుండా లేదా కనీసం పతనం చేయకుండా నిలువరించటంలో ఎవరు మోకాలడ్డారు ? ఎవరైనా సూటిగా సమాధానం చెప్పేవారున్నారా ? నరేంద్రమోడీ అధికారం స్వీకరించిన 2014 మే 26వ తేదీన డాలరుకు రూపాయి విలువ రు.58.73 వున్నట్లు పై ఆధారం తెలియ చేస్తున్నది. వచ్చే సెప్టెంబరు 17 నాటికి నరేంద్రమోడీ వయస్సు 68లో ప్రవేశించనుంది. రూపాయి విలువ ఇది రాస్తున్న సమయానికి రు.68.46(2018 జూన్‌ 29) వుంది. ఆయన వయస్సును దాటి పోయింది. మరి దీనికి ఏ స్టెరాయిడ్స్‌ ఇచ్చారో తెలియదు? త్వరలో 70 దాటనున్నదని విశ్లేషకులు జోశ్యం చెబుతున్నారు. పతనంలో రూపాయి, నరేంద్రమోడీ ఎవరు విజేత అవుతారో?

2014 సాధారణ ఎన్నికలలో నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి విజయం సాధించనున్నదనే అంచనాలు వెలువడిన సమయంలో అమెరికా సంస్థ బ్లూమ్‌బెర్గ్‌ ప్రతినిధులు అమిత్‌ ప్రకాష్‌, క్రిస్టిన్‌ ఆక్వినో రూపాయి విలువ పెరగటం నరేంద్రమోడీ నిర్ణయాత్మక విజయానికి సూచిక అని వ్యాఖ్యానించారు. దీర్ఘకాలంలో రూపాయి విలువ ఒక అమెరికన్‌ డాలరుకు 2014 మార్చి నెలలో వున్న రు.61.19 నుంచి 45-40కి పెరిగే క్రమంలో ఎన్నికల ఫలితం ఒక వుత్ప్రేరకంగా పని చేయగలదని, ఒక వేళ బలహీన సంకీర్ణం ఏర్పడితే 2013 అగస్టు 28 నాటి రికార్డు పతనం 68.85ను అధిగమించ వచ్చని సిటీ గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ కార్పొరేషన్‌ ఆసియా-పసిఫిక్‌ అధిపతి ఆడమ్‌ గిల్‌మౌర్‌ చెప్పిన మాటలను వారు వుటంకించారు. అంతే కాదు, మోడీ విజయం సాధిస్తే అది ఆట తీరునే మార్చివేస్తుందన్నది మార్కెట్‌ అభిప్రాయమని కూడా ఆడమ్‌ వ్యాఖ్యానించాడు. ఆసియాలోని మూడవ పెద్ద ఆర్ధిక వ్యవస్థ అయిన భారత్‌ 2008లో ప్రారంభమైన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం తరువాత ఇప్పుడే పట్టాలపైకి వస్తున్నదని మోడీ స్టీరింగ్‌ పట్టుకుంటే మరింత వేగం అందుకుంటుందని బ్లూమ్‌బెర్గ్‌ వ్యాఖ్యాతలు చెప్పారు.

రూపాయి విలువ పెరుగుతున్నదని, అది డాలరుకు 40కి పెరిగితే 2008 ఏప్రిల్‌ నాటి బలమైన స్ధాయికి చేరినట్లు అవుతుందని ఈ తరుణంలో డాలర్లను అమ్ముకోవటం మంచిదని ఎన్నికల వరకు ఆగితే ఆది ఆలస్యం కూడా కావచ్చని గిల్‌మౌర్‌ జోస్యంతో కూడిన సలహా ఇచ్చారు. అయితే అది ఎంత కాలంలో జరుగుతుందన్నది ఆయన చెప్పలేదని, బ్లూమ్‌బెర్గ్‌ జరిపిన సర్వే ప్రకారం 2014 డిసెంబరు నాటికి రు.61.21 అవుతుందని 2016 చివరికి 58.50లకు పెరుగుతుందని ఆ సంస్థ వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. దీనికి విరుద్ధంగా 2018లో 69.09గా నమోదైంది. దీనికి కారణాలేమిటి ?

నిత్యం బలమైన కరెన్సీ గురించి బోధనలు చేయటం తప్ప మోడీ-జైట్లీ ద్వయం బ్రిటీష్‌ వలసవాద ఆర్ధిక విధానాలకు మద్దతు ఇస్తున్నారని, ఇంకా బలహీనమైన రూపాయి కొనసాగటం జాతి సిగ్గుపడాల్సిన అంశమని అంశుమన్‌ తివారీ అనే ఆర్ధిక వ్యవహారాల వ్యాఖ్యాత పేర్కొన్నారు. ఒక దేశ కరెన్సీ జాతి గర్వించదగిన లేదా దగని అంశంగా వుండకూడదు, చేయకూడదని తెలిసినప్పటికీ బిజెపి 2013లో రూపాయి విలువ ఎదుర్కొన్న సంక్షోభాన్ని జాతి సిగ్గుపడే అంశంగా ప్రదర్శించిందని తివారీ పేర్కొన్నారు.

‘మారకపు విలువ కేవలం ఒక ధర మాత్రమే. నీవు అమ్మకపు వ్యాపారంలో వుండాలంటే నీ ధర పోటీలో నిలబడేట్లుగా వుండాలి’ అని 1991లో రూపాయి విలువను భారీగా తగ్గించిన సమయంలో ఆర్ధిక మంత్రిగా వున్న మన్మోహన్‌ సింగ్‌ చెప్పిన తర్కాన్ని అంగీకరించాలంటారు తివారి. బూర్జువా మేథావుల ప్రతినిధి తివారీ. మేకిన్‌ ఇండియా పిలుపు ఇచ్చిన నరేంద్రమోడీ మన దేశంలో సరకులను తయారు చేసి చౌకగా విదేశాలకు ఎగుమతి చేసేందుకు రూపాయి విలువను కావాలనే పతనం గావిస్తున్నారా ? అవుననో కాదనో, అసలు కథేమిటో మోడీ నోరు విప్పితే కదా తెలిసేది.

1990 దశకంలో మన దేశం చెల్లింపుల సంక్షోభం ఎదుర్కొన్న కారణంగా మన ఎగుమతులను పెంచాలనే ఒక దివాళాకోరు ఆలోచనతో నాటి సర్కార్‌ ప్రపంచ బ్యాంకులో పని చేస్తున్న మన్మోహన్‌ సింగ్‌ను ఆర్ధిక మంత్రిగా తీసుకొన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచబ్యాంకు ఆదేశాలతో ఈ పెద్ద మనిషి ఒక్కసారిగా నాలుగు రోజుల్లో రూపాయి విలువను తొమ్మిదిశాతం వరకు తగ్గించారు. అంతకు ముందు దేశ చరిత్రలో అలాంటి వుదంతం జరగలేదు. ఆ సమయంలో ప్రభుత్వ ఆర్ధిక సలహాదారుగా జైరాం రమేష్‌, రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా రంగరాజన్‌ వున్నారు.

గతంతో అంటే 2013 రికార్డు పతనంతో పోల్చితే నాటికీ నేటికీ ఎంతో బేధం వుంది. అప్పుడు రూపాయి విలువ పతనం దేశ బలహీనతగా బిజెపి ప్రచారం ప్రారంభించింది. అ సమయంలో మన విదేశీ మారక ద్రవ్య నిల్వలపై తీవ్ర ప్రభావం చూపే చమురు పీపా ధర 100 డాలర్లకు పైగా వుంది. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 40-50 డాలర్ల మధ్య వుండి ఇటీవలి కాలంలో 75 డాలర్ల వరకు పెరిగింది. ఇక మోడీ భక్తులు తాజాగా ప్రారంభించిన రూపాయి విలువ ప్రచారం బండారం గురించి చూద్దాం.

ఒనడా డాట్‌ కామ్‌ డాటా ప్రకారం 2004ా05 నుంచి 2018 జూన్‌ వరకు వున్న ఏడాది సగటు రూపాయి విలువ ఇలా వుంది. ప్రతి రోజు పెరగటం, తగ్గుదల వుంటుంది కనుక సౌలభ్యం కోసం ఏడాది సగటు తీసుకుందాం.(డాలరుకు రూపాయి మారకం విలువ) 2018-19లో ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు)

ఏడాది    రూపాయి విలువ

 

2004-05    44.94

 

2005-06    44.28

 

2006-07    45.25

 

2007-08     40.28

 

2008-09     46.46

 

2009-10      47.74

 

2010-11       45.90

 

2011-12       48.53

 

2012-13       54.44

 

2013-14        60.42

 

2014-15         61.17

 

2015-16        65.49

 

2016-17         67.15

 

2017-18         64.54

 

2018-19       67.02

 

ఈ అంకెల ప్రకారం పదేండ్ల మన్మోహన్‌ సింగ్‌ పాలనలో 2005ా06 నుంచి 2013ా14 మధ్య కాలంలో రూపాయి పతనం 44.28 నుంచి 60.42కు జరిగితే నాలుగేండ్ల మోడీ కాలంలో అది 60.42 నుంచి 67.02కు దిగజారింది. సగటు దిగజారుడు చూస్తే దాదాపు ఒకటే వుంది. అంటే మన్మోహన్‌ సింగ్‌ పాలన చివరి రోజుల్లో పడిన ఇబ్బందుల కంటే మోడీ కాలంలో ఎక్కువగా వున్నట్లు స్పష్టం అవుతోంది. పదేండ్ల కాంగ్రెస్‌ పాలన చివరి ఏడాదిని మినహాయించి తొలి తొమ్మిది సంవత్సరాల తీరు తెన్నులను గమనిస్తే రూపాయి విలువ 44.28 నుంచి 54.44 మధ్యనే కదలాడింది. అదే మోడీ పాలనలో 60.42 నుంచి 67.02 మద్య వుంది. దీని అర్ధం కాంగ్రెస్‌ విధానాలను సమరించటం లేదా మంచివని చెప్పటం కాదు. రెండు పార్టీల విధానాలలో ఎలాంటి మౌలిక తేడాలు లేవు.

మన దేశాన్ని కేవలం ముడి సరకులు ఎగుమతి దేశంగా వుంచాలని, మన పారిశ్రామిక వస్తువుల ధరలు ప్రపంచ మార్కెట్లో ఎక్కువగా వుంచేందుకు నాటి బ్రిటీష్‌ పాలకులు రూపాయి విలువను లేని దాని కంటే ఎక్కువగా వుంచారన్న అభిప్రాయం వుంది. యుపిఏ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు బిజెపి రూపాయి విలువ పతనాన్ని దేశానికి అవమానంగా చిత్రించింది. తాను అధికారంలోకి వచ్చిన తరువాత అదే పార్టీ ఇప్పుడు రూపాయి పతనమౌతోంటే గుడ్లప్పగించి చూస్తోంది. నోట మాట రావటం లేదు.

నాడు మన్మోహన్‌ సింగ్‌ కరెన్సీ విలువ తగ్గింపును సమర్ధించుకుంటూ ‘మారకపు విలువ కేవలం ఒక ధర మాత్రమే. నీవు అమ్మకపు వ్యాపారంలో వుండాలంటే నీ ధర పోటీలో నిలబడేట్లుగా వుండాలి’ అన్నారంటే దాని అర్ధం తక్కువగా వుంచాలనే కదా. అప్పటి నుంచి చూస్తే 1970 నుంచి 1989 వరకు వాణిజ్య లోటుతో వున్న చైనా ఆ తరువాత నుంచి నేటి వరకు తన మిగులును పెంచుకుంటూ పోతూనే వుంది.1990 నుంచి 8.74 బిలియన్‌ డాలర్ల మిగులుతో ప్రారంభమై 2017లో 422 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నది. మరి మనం ఎక్కడ వున్నాం ? 2017లో చైనా ఎగుమతులు, దిగుమతుల లావాదేవీల మొత్తం 4.1లక్షల కోట్లు కాగా మనది 800 బిలియన్‌ డాలర్లకు అటూ ఇటూగా 157 బిలియన్‌ డాలర్ల లోటుతో వున్నాం. మన వాణిజ్యలోటు పెరగటం తప్ప ఏ ఒక్క సంవత్సరంలోనూ మిగులు లేదు. మన రూపాయి విలువను తగ్గించుకున్నా మన వస్తువులను ఎగుమతి చేయలేని స్ధితి. అయినప్పటికీ నిరుద్యోగ యువతను తప్పుదారి పట్టించేందుకు మేకిన్‌ ఇండియా నినాదంతో ప్రధాని నరేంద్రమోడీ కాలం గడుపుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ మన దేశం వచ్చి ఇక్కడ మన కార్మికుల చేత వస్తువులను తయారు చేయించుకొని ఎగుమతి చేసుకోవాలన్నది ఈ నినాదం వెనుక వున్న లక్ష్యం. ఇన్నేళ్లుగా మనం ఎందుకు విఫలమయ్యాము. అందునా ప్రపంచ ధనిక దేశాలన్నీ ఆర్ధిక మాంద్యంలో వుండగా ఇప్పుడున్న పరిశ్రమల వుత్పత్తులకే దిక్కు లేకపోతే కొత్తగా ఎవరు ప్రారంభిస్తారు అన్నది ప్రశ్న. అందువలన మన ఆర్ధిక విధానాన్ని మన అవసరాలకు తగినట్లు సమూలంగా మార్చుకొని అంతర్గతంగా వస్తువినియోగానికి డిమాండ్‌ పెంచుకుంటేనే ఏ రంగమైనా అభివృద్ది చెందుతుంది. మన యువతకు వుపాధి దొరుకుతుంది.

విదేశాలకు తక్కువ ధరలకు ఎగుమతులు చేయటానికి మన వనరులన్నీంటినీ వుపయోగిస్తే మన వస్తువులు కొన్న వాడికి తప్ప మనకు లాభం ఏమిటి? ఏ కారణం చేత అయినా కొనే వారు ఎత్తుబడితే మన వస్తువులను ఎవరికి అమ్ముకోవాలి? ఇప్పుడు అమెరికా, ఐరోపా ధనిక దేశాలలో వస్తువులు కొనే వారు లేకనే మన వస్తువులు ఎగుమతి కావటం లేదని అందరూ చెబుతున్నదే. అలాంటపుడు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టి మన నరేంద్రమోడీ గారికి మేకిన్‌ ఇండియా పేరు తెచ్చేందుకు ఎవరు ముందుకు వస్తారు అన్నదే సమస్య? మన కంటే తక్కువ ధరలకు ఎగుమతులు చేయాలంటే చైనా దగ్గర డాలర్ల నిల్వలు గుట్టలు పడి వున్నాయి. రెండవది, ఎగుమతులు దెబ్బతింటే అంతర్గతంగా వినియోగాన్ని పెంచే విధంగా చైనా తన పౌరుల ఆదాయాలను పెంచుతున్నది. మన పరిస్దితి అందుకు విరుద్దంగా వుంది.

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లుగా నరేంద్రమోడీ గారి మేకినిండియా పిలుపును జయప్రదం చేయటం కోసం రూపాయి విలువను మరింత పతనం గావిస్తే మనం దిగుమతి చేసుకొనే ఎరువులు, పురుగు మందులు, పెట్రోలియం వుత్పత్తుల వంటి వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి. వుదాహరణకు మనకు స్వాతంత్య్రం వచ్చిన రోజు నాడున్న విలువ ప్రకారం ఒక రూపాయకు కొన్న ఒక వస్తువు ధర నరేంద్రమోడీ పదవిలోకి వచ్చే నాటికి రు.58.58కి పెరిగింది. నాలుగు సంవత్సరాల తరువాత జూన 28న రు.69.09కి చేరింది, ఇంకా పెరగవచ్చని కొందరి అంచనా. మోడీ ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసిన మంచి రోజులంటే ఇవా ?

2014 మే 25న రేంనద్రమోడీ పదవీ బాధ్యతలు స్వీకరించిన సమయానికి 58.58 గా వుంది. ఇది తమ మోడీ ఘనతే అని అభిమానులు చెప్పారు. రూపాయి విలువ పతనం, పెరుగుదల చరిత్రను చూస్తే ప్రధానిగా జవహర్‌ లాల్‌ నెహ్రూ వున్న సమయంలో 1947 నుంచి 1950 మధ్య ఒక రూపాయి నుంచి రు.4.76కు పడిపోయింది. ఆ ఏడాది నుంచి నెహ్రూ మరణించిన తరువాత లాల్‌ బహదూర్‌ శాస్త్రి పాలనలో 1965 వరకు స్ధిరంగా ఒక డాలరుకు రు.4.76 పైసలు వుంది. శాస్త్రి మరణించిన 1966లో రు.6.36కు పడిపోయింది. తరువాత ఇందిరా గాంధీ హయాంలో రు.6.36 నుంచి 1976లో రు.8.96కు పడిపోయి, ఆమె దిగిపోయే నాటికి రు.8.75కు పెరిగింది. జనతా పార్టీ నేత మొరార్జీ దేశాయ్‌ పాలనలో పెరుగుదల తప్ప పతనం లేదు, రు.8.75 నుంచి రు.8.14కు పెరిగి పెరిగింది.

రెండవ సారి ఇందిరా గాంధీ అధికారానికి వచ్చిన సమయంలో రు.7.86గా వున్నది కాస్తా ఆమె మరణించే నాటికి రు.11.36కు పతనమైంది. తరువాత రాజీవ్‌ గాంధీ ఏలుబడిలో రు.16.23కు దిగజారింది.1989లో అధికారానికి వచ్చిన విపి సింగ్‌ హయాంలో రు.17.50కి, నూతన ఆర్ధిక సంస్కరణలకు ఆద్యుడిగా పేరు గాంచిన పివి నరసింహారావు పాలనలో రు.22.74 నుంచి 35.43కు తగ్గింది. హెచ్‌డి దేవగౌడ, ఐకె గుజ్రాల్‌ పాలనా కాలంలో రు.41.26కు చేరింది. తరువాత బిజెపి నేత ఎబి వాజ్‌పేయి పాలనలో రు.48.61కి పతనమై చివరికి రు.45.32కు పెరిగింది. మన్మోహన్‌ సింగ్‌ పది సంవత్సరాల కాలంలో కిందికీ మీదికీ పడుతూ లేస్తూ రు.45.32 నుంచి గరిష్టంగా 68.85 వరకు పతనమై నరేంద్రమోడీ అధికారానికి వచ్చే సమయానికి రు.58.43కు పెరిగింది. మోడీ హయాంలో తాజాగా 69.10కి దిగజారింది. ఏడాది సగటు ఎలా వుందో పైన చూశాము. మోడీపాలనా కాలం ముగిసే నాటికి ఇంకా పతనం అవుతుందనే వారే తప్ప పెరుగుతుందని చెప్పేవారు ఒక్కరూ లేరు. మోడీని అభిమానించే వారు దీనిని విజయం అంటారా పతనంగాక మరేదైనా పేరు పెడతారా ?

రూపాయి విలువ పతనమైతే సామాన్య జనానికి జరిగే నష్టం ఏమిటి? మోడీకి, మన్మోహన్‌ సింగ్‌కో మరొకరికో వ్యక్తిగత నష్టం గురించిన సమస్య కాదిది. మనిషికి బిపి పెరిగినా, తగ్గినా శరీరంలో ఎటువంటి ప్రమాదకర మార్పులు సంభవిస్తాయో ఏ దేశ ఆర్ధిక వ్యవస్ధలో అయినా కరెన్సీ విలువ వుద్ధాన, పతనాలు అలాంటి పర్యవసానాలకే దారితీస్తాయి. అంటే మొత్తం జనాన్ని ముఖ్యంగా సామాన్య జనాన్ని తీవ్ర ప్రభావితం చేస్తాయి. ఎలాగో చూద్దాం.

మనకు చమురు నిక్షేపాలు తగినన్ని లేని కారణంగా అత్యధికంగా దిగుమతులపై ఆధారపడుతున్నాం. అందువలన ఆ రంగంలో పర్యవసానాలు మన నిత్యజీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నరేంద్రమోడీ అధికారాన్ని స్వీకరించిన తరువాత 2014 మే 29 జూన్‌ 11వ తేదీతో ముగిసిన పక్షంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు పీపా(బారెల్‌) ధర 106.72 డాలర్లు వుంది. ఆ రోజుల్లో డాలరు సగటు రూపాయి విలువ రు. 59.17 ఆ లెక్కన మనం రు 6314 లకు ఒక పీపాను కొనుగోలు చేశాము. ఇప్పుడు అంటే 2018 జూన్‌ 30 నాటికి ఒక పీపాధర 75 డాలర్లకు తగ్గినా రూపాయల్లో డాలరుకు రు.68-69 మధ్య విలువ పతనం కారణంగా పీపాను ఆరువేల రూపాయలకు అటూ ఇటూగా కొనుగోలు చేస్తున్నాము. నరేంద్రమోడీ సర్కార్‌ రూపాయి విలువ పతనాన్ని అరికట్టి స్ధిరంగా వుంచి వుంటే, ప్రపంచ ఆర్ధికవేత్తలు వూహించినట్లు 45-40 రూపాయలకు పెరిగి వుంటే చమురు ధరలు గణనీయంగా తగ్గి వుండేవి. అన్నీ తానే అయి చూసుకుంటున్న నరేంద్రమోడీ రూపాయి పతనాన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నారు.అది చేయలేకపోగా తన హయాంలో డీజిలు, పెట్రోలుపై పన్ను పెంచి అదనపు భారం ఎందుకు మోపి నట్లు ?

రూపాయి విలువ పతనమైతే ఎక్కువ మందికి నష్టం జరిగితే, లాభపడే వారు కూడా వుంటారు. విదేశాలలో వుద్యోగాలు చేస్తూ మన దేశానికి డాలర్లు పంపే వారికి ఇక్కడ రూపాయలు అదనంగా వస్తాయి. మన వస్తువులను దిగుమతులు చేసుకొనే వారు తక్కువ డాలర్లు చెల్లించి లబ్దిపొందుతారు. మన దేశం దిగుమతి చేసుకొనే ముడి చమురు, ఎరువులు, ఔషధాలు, పురుగుమందులు, పప్పుధాన్యాలు, పామాయిల్‌ వంటి ఖాద్య తైలాలకు ఎక్కువ డాలర్లు చెల్లించాలి, పర్యవసానంగా ధరలు పెరుగుతాయి. అవి ఇతర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తాయి. విదేశాలలో విద్యనభ్యసించేవారిపై భారం పెరుగుతుంది. విదేశాల నుంచి డాలర్ల రూపంలో తీసుకొనే రుణాలకు చెల్లించాల్సిన మొత్తాలు పెరుగుతాయి.

అంతర్జాతీయ మార్కెట్‌ ముఖ్యంగా డాలరుతో మన బంధం ముడివేసుకున్న కారణంగా, మన పాలకులు గత 70సంవత్సరాలుగా అనుసరిస్తున్న దివాలాకోరు ఆర్ధిక విధానాల పర్యవసానంగా కరవ మంటే కప్పకు కోపం విడవ మంటే పాముకు ఆగ్రహం అన్నట్లుగా మన రూపాయి విలువ పరిస్ధితి తయారైంది. విలువ తగ్గినా, పెరిగినా కార్పొరేట్లకు పోయిందేమీ లేదు. ఆ కారణాలతో దివాలా తీసి బలవన్మరణాలకు పాల్పడిన పెద్దలు ఒక్కరంటే ఒక్కరు కూడా వున్నట్లు మనకు వార్తలు లేవు. వారు బ్యాంకుల దగ్గర తీసుకున్న అప్పులను ఎగవేయటం, మన్మోహన్‌, మోడీ వంటి పాలకులు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు రుణాలు ఇవ్వటం, బ్యాంకులకు ఎగవేసిన కార్పొరేట్ల అప్పులను ఏటా లక్షల కోట్ల వంతున రద్దు చేయటం తప్ప మరొకటి చేయటం లేదు. ఎటు తిరిగి సామాన్య వ్యాపారులు, జనమే గగ్గోలు పెట్టి ఆత్మహత్యలకు పూనుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది. రూపాయి బలపడితే ఎగుమతి వ్యాపారులు లబోదిబో మంటే దిగుమతి వ్యాపారులు సంతోషించారు, ఇప్పుడు దిగుమతి వ్యాపారులతో పాటు జనమంతా గగ్గోలు పెట్టే దిశంగా ఈ పతనం కొనసాగుతుందా అనిపిస్తోంది.

 

 

(* రచయిత ఎం.కోటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్. హైదరాబాద్.)