కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తర్వాత బిజెపి విధానాల్లో పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో కూడా పలు సందర్భాల్లో అధికారంలో వున్నది వాజ్ పాయ్ కాదనే అంశం గుర్తు చేస్తూ పోస్టింగ్ లు వెల్లువెత్తాయి.
ఇప్పుడు సాక్షాత్తు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి బల్ల గుద్ది చెప్పారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నట్లు ఇప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో శాసన సభ స్థానాలు పెంచేది లేదని చెప్పారు. విభజన చట్టంలో ఆఖరు నిమిషంలో ఈ నిబంధన చేర్చారని దాన్ని అమలు చేయడం కుదరదని చెప్పారు. ఇచ్చట రెండు అంశాలు ఇమిడి వున్నాయి. ఒకటి. ఆ రోజుల్లో ఉభయ పార్లమెంటు సభల్లో రాష్ట్ర విభజన చట్టం బిజెపి ఆమోదం లేనిదే ఆమోదం పొందేది కాదు. బిజెపి అంగీకారంతోనే ఆమోదం పొందింది. మరో అంశం చట్టం ఆమోదింప బడిన తర్వాత అది చట్టమే. కేంద్ర మంత్రిగా వుండి ఈలాంటి వ్యాఖ్యానం చేయ వచ్చా?
అంతేకాదు. మంత్రి ఇంకొక అంశం శెలవు ఇచ్చారు. కాశ్మీర్ లో మాత్రం శాసన సభ స్థానాలు పెంచుతారట. అంటే బిజెపికీ రాజకీయ ప్రయోజనాలు లేనిదే ఏ పనికి కేంద్ర ప్రభుత్వం ఉపక్రమించదనేందుకు చాలా ఉదాహరణలు వున్నాయి.దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా చట్టంలో చేర్చి అమలు చేయ లేదు. అప్పట్లో వున్న ప్రణాళిక సంఘం ప్రతిపాదనలు తయారు చేస్తే జాతీయ అభివృద్ధి మండలి ఆమోదంతో అమలు జరిపారు. కాని ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చే సరికి విభజన చట్టంలో లేదని ఎగనాము పెట్టారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో ఆమోదించి ప్రణాళిక సంఘానికి పంపారు.
ఇప్ఫుడేమో శాసన సభ స్థానాలు పెంచడం చట్టంలో వున్నా రాజకీయ ప్రయోజనం వుండదు కాబట్టి ఆఖరు నిమిషంలో చేర్చారని మొండి చేయి చూపిస్తున్నారు.