పంట‌కు చీప్ లిక్క‌ర్ కిక్కు

 

`మ‌ద్యం సేవించ‌డం ఆరోగ్యానికి హానిక‌రం` సినిమా ప్రారంభానికి ముందు క‌నిపించే ప‌దాలివి. మ‌ద్యం సేవించ‌డం హానిక‌రం అని తెలిసినా, దాన్ని ఒంట‌ప‌ట్టించుకుని, త‌లకెక్కించుకునే వారు ఉండ‌ర‌నుకోండి అది వేరే విష‌యం. అలాంటి మ‌ద్యాన్ని క్రిమి సంహార‌క మందుగా ఉప‌యోగిస్తున్నారు ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ రైతులు. బులంద్‌ష‌హ‌ర్‌లో కొంత‌మంది రైతులు బంగాలాదుంపల‌కు ప‌ట్టిన చీడ పురుగుల‌ను వ‌దిలించుకోవ‌డానికి చీప్ లిక్క‌ర్‌ను ఎరువుగా వాడుతున్నారు.

మ‌ద్యాన్ని ఎరువుగా వాడ‌టం వ‌ల్ల క్రిములు న‌శించ‌డంతో పాటు పంట దిగుబ‌డి కూడా బాగుంటుద‌ని చెబుతున్నారు. మ‌ద్యం మ‌త్తులోనో, ఏమో తెలియ‌దు గానీ మొదట్లో ఓ రైతు మ‌ద్యానికి నీళ్లు, కాసింత ర‌సాయ‌నిక ఎరువును క‌లిపి పిచికారి చేశాడ‌ట‌. తెల్లారి లేచి చూడ‌గా, చాలావ‌ర‌కు చీడ పురుగులు న‌శించిన విష‌యాన్ని గుర్తించాడు. వెంటనే- తోటి రైతుల‌కూ ఈ `ప్ర‌యోగం` గురించి వివ‌రించాడు. అంతే. స్థానిక రైతులు పోలో మంటూ ఎరువుల దుకాణాల‌కు బ‌దులుగా మ‌ద్యం షాపుల‌పై ఎగ‌బ‌డ్డారు. చీప్ లిక్క‌ర్‌ను కొని, ఓ పెగ్గు గొంతులో పోసుకుని, మిగిలిన దాన్ని పిచికారి చేస్తున్నారు. రైతులు అనుస‌రిస్తోన్న ఈ స‌రికొత్త విధానం ఆ నోట ఈ నోట ప‌డి చివరికి జిల్లా వ్య‌వ‌సాయ అధికారుల చెవుల్లో ప‌డింది.

మ‌ద్యంతో చీడ పురుగులు న‌శిస్తాయ‌న‌డానికి ఎలాంటి శాస్త్రీయ కార‌ణం లేద‌ని అంటున్నారు అధికారులు. ఈ విధానాన్ని మానుకోవాలని సూచిస్తున్నారు. పంట దిగుబ‌డి రావ‌డానికి స‌రైన ఎరువుల‌ను మాత్ర‌మే వినియోగించాల‌ని చెబుతున్నారు. పంట దిగుబ‌డి పెర‌గ‌డానికి రైతులు చేప‌ట్టిన ఈ ప్ర‌యోగం స‌రైన‌ది కాద‌ని జిల్లా వ్య‌వ‌సాయ అధికారి వెల్ల‌డించారు.