గాడిద మాంసం తినొచ్చా? లేదా? హైకోర్టుకు ధర్మ సందేహం

గాడిద మాంసం తినొచ్చా? లేదా? గాడిద మాంసం తింటే లాభమా? నష్టమా? గాడిద పాలు రోగాలు నయం చేస్తున్నప్పుడు గాడిద మాంసం తింటే మరింత లాభమంటున్నారు నిజమేనా? ఈ ధర్మ సందేహం మనలాంటి సామాన్యులకే కాదు ఏకంగా తెలుగు రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకే వచ్చింది. దీంతో దీని లాభనష్టాలు, మంచి చెడ్డలపై వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ప్రభుత్వాలను ఆదేశించింది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యానికి ఔషధం అంటూ గాడిద మాంసం కొనుగోళ్లు విరివిగా పెరిగిపోయాయి. అసలు ఈ మాంసం తినవచ్చా? లేదా? లాభమా? నష్టమా? దీనిపై తెలుగురాజ్యం వెబ్ సైట్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. మొత్తం చదవండి.

గాడిదపాలు ఉబ్బసం, ఆయాసం ఉన్నవారికి మేలు చేస్తాయని మనం తరచూ వింటూనే ఉంటాం. చలికాలంలో ఈ గాడిద పాలకు గిరాకీ ఎక్కువే. గత కొన్నేళ్లుగా గాడిద మాంసానికి కూడా డిమాండ్ పెరిగిపోయింది. గాడిద మాంసం తింటే గుండె జబ్బులకి, ఆస్తమాకు, కీళ్ల నొప్పులకు చెక్ పెట్టొచ్చంటూ జోరుగా అమ్మకాలు పెంచేశారు విక్రయదారులు. గాడిద మాంసం తింటే ఎముకలకు బలం చేకూరుతుంది అంటూ పిల్లలకు కూడా తినిపించేస్తున్నారట తల్లిదండ్రులు.

దొంగా పోలీసు మధ్యలో గాడిద

ఆసక్తికర విషయం ఏమిటంటే దొంగతనాలు చేయటానికి కావాల్సిన బలం కోసం దొంగలు కూడా ఈ మాంసాన్ని ఆరగిస్తున్నారట. ఇది నిజంగా నిజం. కావాలంటే ఈ స్టోరీ చూడండి. తరచూ దొంగతనాలు చేసి జైలుకి వెళుతుండే ఒక దొంగ ఒకరోజు నాకు గాడిద మాంసం కావాలి లేదంటే ఒక ముద్ద కూడా ముట్టను అని భీష్మించుకుని కుర్చున్నాడట. నీకు గాడిద మాంసం ఎందుకు కావాలి అని అడిగితే దొంగతనాలు చేయాలంటే బలం కావాలి, ఆ బలం గాడిద మాంసం తింటే వస్తుందని చెప్పాడట. ఎట్టి పరిస్థితుల్లోనూ గాడిద మాంసం తెప్పించటానికి నిబంధనలు ఒప్పుకోవు అని వారి పద్దతిలో చెప్పారట జైలు అధికారులు. నేరస్థుల స్వభావం గురించి వివరిస్తూ ఈ విషయాన్ని స్వయంగా డీఐజీ కేశవనాయుడు వెల్లడించారు ఒకానొక ఇంటర్వ్యూలో. దొంగ జైల్లో ఉండి కూడా గాడిద మాంసం తినటానికి ఉవ్విళ్లూరుతున్నాడంటే దాని ప్రచార ప్రభావం ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది కదా.

 

గాడిద మాంసం గురించి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి గాడిదమాంస ప్రియులు ఎక్కువ అవడంతో ఇక్కడ గాడిదల కొరత ఏర్పడింది. దీంతో పక్కరాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక నుండి వాటిని దిగుమతి చేసుకుంటున్నారు. ఇది ఇలానే కొనసాగితే భవిషయతులో వాటి మనుగడ అంతరించిపోతుందేమో అని కలత చెందుతున్నారు జంతు ప్రేమికులు. భారత ఆహార భద్రత సంస్థవారు రూపొందించిన నిబంధనలలో గాడిద వంశాన్ని తినే అంశంలో పొందు పరచలేదని వారు వాదిస్తున్నారు. వెంటనే గాడిద వధను నిలిపివేయాలని కోరుతున్నారు. దీనిపై కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసారు యానిమల్ లవర్స్. హైకోర్టు దీనిని పరిగణలోకి తీసుకుని గాడిదమాంసాన్ని తినవచ్చా? లేదా? అనేదానిపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆహార భద్రత అధికారులను కోరింది. గాడిదలు తినే జంతువుల జాబితాలో ఉన్నాయో లేదో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటివరకు అనధికారికంగా జంతువధ జరగకుండా చూడాలని గుంటూరు కార్పొరేషన్ అధికారులను ఆదేశించింది.

గాడిద మాంసం ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా? డాక్టర్స్ మాటల్లో…

గాడిద మాంసం ఆరోగ్యానికి ఔషధం అనే మాటలను ఖండిస్తున్నారు డాక్టర్లు. అది కేవలం అపోహ మాత్రమే అంటున్నారు. ఏ మాంసం అయితే గుండెకు మంచిది అని లాగించేస్తున్నారో ఆ మాంసం రోగం నయం చేయకపోగా మరింత ప్రమాదకరం అవుతుంది. గాడిద మాంసంలో ఉండే కార్నిటైన్ అనే పదార్ధం గుండెకు రక్తం సరఫరా చేసే నాళాలను మూసివేస్తుంది. దానివలన గుండె దెబ్బ తింటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ మాంసం ద్వారా ప్రేగుల్లోకి చేరిన కార్నిటైన్ అక్కడ ఉండే బాక్టీరియా ప్రభావం వలన ‘ట్రై మితలమైన్ యనాక్సయిడ్(టీఎంఏఓ)’గా మారుతుంది. ఈ కార్నిటైన్ మోతాదు ఎక్కువ అవుతున్న కొద్దీ గుండె జబ్బు ప్రమాదం పెరుగుతుందని శాస్త్రవేత్తల హెచ్చరిక. ఆస్తమా, గురక ట్రీట్మెంట్ ద్వారా కంట్రోల్ అవుతాయి తప్ప గాడిదమంసం వలన ప్రయోజనం లేదని సూచిస్తున్నారు డాక్టర్లు.

“గాడిద మాంసం తింటే లాభాలు వస్తాయని సైన్స్ చెప్పలేదు. ఇది తినడం వలన ఆరోగ్యానికి హానికరం అని స్పష్టంగా తెలుస్తోంది. అదే విషయం పరిశోధనల్లో కూడా వెల్లడైంది కాబట్టి ప్రజలు దానిని ఆహారంలో చేర్చుకోకపోవటమే ఉత్తమం” అంటున్నారు నిపుణులు.