ఓదార్పు యాత్రా లేక లక్ష్య సాధన యాత్రా? జగన్ ఢిల్లీ పర్యటన

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన పెట్టుకొన్న సమయం ఎన్నో ఊహాగానాలకు తావిస్తోంది.
ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి ఘోరంగా ఓడి పోయింది. బిజెపి ఓటమి అనే దాని కన్నా మోదీ షా ద్వయం ఓటమిగా దేశ ప్రజలందరూ భావిస్తున్నారు. ఎందుకంటే వీరిద్దరే మొన్న జనరల్ ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కారు. ఈ ఓటమి కూడా ఇద్దరే భరించ వలసి వుంది.

70 శాసన సభ స్థానాలుంటే కేవలం ఏడు స్థానాలకే బిజెపి పరిమితం కావడం సాదాసీదా ఓటమి కాదు. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రిని కలిసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ యాత్ర పెట్టుకున్నారు. ఘోర పరాజయం పాలైన ప్రధాన మంత్రి మోదీనీ ఓదార్చేందుకు వెళ్లుతున్నారా? లేక బలహీనపడిన సమయంలో తన లక్ష్యాన్ని సాధించుకొనేందుకు వెళ్లుతున్నారా అనే సందేహం ఎవరికైనా కలుగకమానదు.

సాధారణంగా ఈ లాంటి సమయాల్లో ఘోర పరాజయం పొందిన ప్రధాన మంత్రి లాంటి నేతను కలుసు కోవడం జరగదు.ఎంత దృఢ చిత్తం వున్నా మానసిక సంక్షోభం ఎంతో కొంత వుంటుంది కొంత విరామం ఇచ్చి కలుసుకొంటుంటారు. కాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాలు వచ్చిన మరు రోజునే కలుసు కొనేందుకు వెళ్లుతున్నారంటే ఆశ్చర్యం లేకపోలేదు.

ఎంతవరకు నిజమో ఏమో గాని బిజెపి నుండి శివసేన లాంటి పార్టీలు దూరమైన తర్వాత వైసిపి బిజెపికి దగ్గర అవుతుందని కేంద్రంలో మంత్రి పదవులు దక్కించుకుంటుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి ఓటమి తర్వాత అది మరింత దిగజారిందని భావించాలి. ఈ నేపథ్యంలో బిజెపి వైసిపి రెండు పార్టీలు బాయ్ బాయ్ అనుకునేందుకు ఈ సమావేశం వేదిక కావచ్చునేమో. ఇదే జరిగితే ముఖ్యమంత్రికి స్వకార్యం కూడా నెర వేర వచ్చు. రాజధాని మార్పు శాసన మండలి రద్దు అంశాల్లో కేంద్ర ప్రభుత్వం అండదండలు ముఖ్యమంత్రికి తప్పని సరి. కేంద్రం నుండి ఈ సహాయం తీసుకుంటూ బిజెపికి దగ్గర అయితే భవిష్యత్తు సంగతి అటుంచగా ప్రస్తుతానికి రాష్ట్రంలో ప్రతి పక్షాలను సులభంగా నిలువరించవచ్చు. ఇదంతా ఊహాగానాలే అయినా ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి మోదీని కలుసుకొనేందుకు ఎంచుకున్న సమయం ఎన్నో ఊహాగానాలకు అవకాశం ఇస్తోంది.