ఆర్మీని తాకిన కరోనా..! భద్రతాబలగాలను భయపెడుతోన్న మహమ్మారి!

ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి కరోనా ఇండియన్ ఆర్మీని కూడా తాకింది. కేంద్రపాలిత ప్రాంతం లేహ్ లోని ‘లదాక్ స్కౌట్స్’ రెజిమెంట్‌‌కు చెందిన ఓ జవానుకు కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా ఇండియన్ ఆర్మీ ఉలిక్కిపడింది. తండ్రి ద్వారా ఆ జవాన్ కుటుంబం మొత్తానికి వైరస్ సోకిందని అధికారులు నిర్దారించుకున్నారు.

వివరాలకు సంబంధించి.. ‘లదాక్ స్కౌట్స్’ రెజిమెం‌ట్‌కు చెందిన 34 ఏళ్ల జవాన్ ఫిబ్రవరి 25 నుంచి మార్చి 2 వరకు సెలవులో ఉన్నారు. ఆ సమయంలోనే అతని తండ్రి తీర్థయాత్రకు ఇరాన్ వెళ్లి తిరిగి వచ్చారు. సెలవులు ముగించుకున్న జవాన్ మార్చి 2న డ్యూటీలో జాయిన్ అయ్యారు. అయితే చేరిన తర్వాత జవాన్‌కు విపరీతమైన దగ్గు, జ్వరం రావడంతో అధికారులు అతణ్ని ఆస్పత్రికి తరలించారు. ముందస్తు చర్యల్లో భాగంగా అతనితో కలిసి ఉన్న మరో 200 మంది సైనికులను, జవాన్‌ కుటుంబ సభ్యులను కూడా ఐసోలేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ముందస్తు జాగ్రత్త చర్యలు, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు చేపట్టినట్లు సమాచారం.