సినిమా పేరు : మాస్టర్
నటీనటులు : విజయ్, విజయ్ సేతుపతి, మాళవిక మోహనన్, అర్జున్ దాస్, గౌరి కిషన్, శాంతను
మ్యూజిక్ డైరెక్టర్ : అనిరుధ్ రవిచందర్
నిర్మాత : జేవియర్ బ్రిట్టో
డైరెక్టర్ : లోకేశ్ కనకరాజ్
విజయ్ సినిమాలంటే కేవలం కోలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్ లో కూడా క్రేజ్ ఉంటుంది. విజయ్ తెలుగు అభిమానులు కూడా ఉన్నారు. అందుకే ఆయన సినిమాలన్నింటినీ తెలుగులోకి డబ్ చేస్తారు. తెలుగులో కూడా ఆయన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతాయి. తమిళ్ లో ఎలాగూ ఆయన స్టార్ హీరో. ఇక.. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే.. అది కూడా లాక్ డౌన్ తర్వాత థియేటర్లు తెరుచుకున్నాక.. ఇంత పెద్ద సినిమా రిలీజ్ అంటే సినీ అభిమానుకు పండుగే కదా. ఓవైపు సంక్రాంతి సంబురాలు.. మరోవైపు విజయ్ సినిమా సంబురాలు.. తమిళనాడు, ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా విజయ్ సినిమా గురించే చర్చ. మరి.. ఇంత హైప్ మధ్య విడుదలైన మాస్టర్ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? తెలుసుకుందాం పదండి..
‘మాస్టర్’ సినిమా కథ ఇదే
ఈ సినిమాలో విజయ్ పాత్ర పేరు జేడీ. ఈయన ప్రొఫెసర్. మామూలు ప్రొఫెసర్ అయితే బాగానే ఉండు కానీ.. జేడీ సైకాలజీ ప్రొఫెసర్. కాలేజీలో విద్యార్థులందరికీ జేడీ అంటే చాలా ఇష్టం. విద్యార్థులంతా జేడీ వైపే ఉన్నప్పటికీ.. కాలేజీ యాజమాన్యానికి మాత్రం జేడీ ప్రవర్తన నచ్చదు. స్టూడెంట్ ఎలక్షన్స్ విషయంలో జరిగిన గొడవ వల్ల జేడీ కాలేజీని వదిలి వెళ్లిపోవాల్సి వస్తుంది. జేడీని కాలేజీ నుంచి వెళ్లగొట్టాలని కావాలనే కాలేజీ యాజమాన్యం.. ఎన్నికల్లో గొడవలు సృష్టిస్తుంది. ఆ తర్వాత జేడీ.. ఒక జువైనల్ హోంకు టీచర్ గా వెళ్తాడు. అక్కడి నుంచి అసలు కథ మొదలు అవుతుంది.
అక్కడ బాల నేరస్థులను ఉపయోగించుకొని బయట నేరాలు చేస్తున్న వ్యక్తి గురించి జేడీకి తెలుస్తుంది. ఆయనే భవాని. ఈ పాత్రను వేసింది తమిళ్ లోనే మరో పెద్ద హీరో విజయ్ సేతుపతి. ఈ నేరాల గురించి తెలుసుకున్న జేడీ.. భవానితో ఢీకొడతాడు. జువైనల్ హోంను గాడిలో పెట్టడం కోసం జేడీ ఏం చేస్తాడు? భవానిని ఎలా ఎదుర్కొంటాడు? అనేదే మిగితా కథ.
‘మాస్టర్’ ప్లస్ పాయింట్స్
ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ ముగ్గురు. ఒకరు విజయ్, మరొకరు విజయ్ సేతుపతి, మరొకరు సినిమా డైరెక్టర్ లోకేశ్. ఎందుకంటే.. లోకేశ్.. ఖైదీ లాంటి విభిన్నమైన సినిమాను రూపొందించారు. కాబట్టి ఈ సినిమా మీద కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అందులోనూ ఇద్దరు టాప్ హీరోలతో ఈ సినిమాను తెరకెక్కించడం అనేది పెద్ద సంచలనం. అందుకే ఈ సినిమాకు ఈ ముగ్గురే ప్రాణం. విజయ్ సేతుపతిని విలన్ గా చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.
సినిమా స్టార్టింగ్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఆసక్తికరంగా సాగుతుంది. విలన్ పాత్రను కూడా బాగా ఎలివేట్ చేసి చూపించాడు. విజయ్ స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతం. ఆయన లుక్స్ కానీ.. ఆయన నటన కానీ.. చాలా స్టయిలిష్ గా ఉన్నాయి. యాక్షన్ సన్నివేశాలు కూడా సూపర్బ్. హీరోయిన్ తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించింది. అనిరుధ్ మ్యూజిక్ ఓకే.
‘మాస్టర్’ మైనస్ పాయింట్స్
సినిమాలో చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ మొత్తం బోరింగ్. అదే రొటీన్ రొడ్డుకొట్టుడు. కొన్ని యాక్షన్ సన్నివేశాలు కొంచెం ఓవర్ గా అనిపించాయి. సినిమా కథ మొత్తం రొటీన్ గా అనిపించడం.. క్లయిమాక్స్ వరకు హీరో, విలన్ కలవకపోవడం.. హీరో, విలన్ మధ్య పోరాటాలు కూడా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఫస్ట్ హాఫ్ లో కాలేజీ సీన్లు కూడా పెద్దగా పండలేదు. అంతా ఒక రొటీన్ మసాలా సినిమాలా అనిపిస్తుంది.
‘మాస్టర్’ కన్ క్లూజన్
చివరకు చెప్పొచ్చేదేంటంటే.. సినిమాకు వెళ్లాలా? వెళ్లొద్దా? అనేది మాత్రం ప్రేక్షకుల చేతిలోనే ఉంది. విజయ్ అభిమానులు సినిమా ఎలా ఉన్నా చూస్తారు. మాస్ ఆడియెన్స్ కు కూడా ఈ సినిమా నచ్చేస్తుంది. కానీ.. రొటీన్ ఫార్ములా అవ్వడం వల్ల.. సెకండ్ హాఫ్ బోర్ కొడుతుంది. సో.. ఒక్కసారి అయినా పర్లేదు.. సంక్రాంతి పండగ సమయాన టైమ్ పాస్ కోసం అని అనుకుంటే మాత్రం నిరభ్యంతరంగా ఈ సినిమాకు వెళ్లొచ్చు. మధ్యలో బోర్ కొడితే మాత్రం ఏం చేయాలనేది మీ ఇష్టం. ఎలివేషన్లు ఇష్టపడేవాళ్లకు కూడా ఈ సినిమా బాగానే నచ్చుతుంది.
తెలుగు రాజ్యం రేటింగ్ : 2.5/5