దర్శకత్వం : సముద్ర కని
తారాగణం : తంబి రామయ్య, సముద్ర కని, శ్రీరంజని, సంచితా శెట్టి, యువశ్రీ లక్ష్మి, షెరీన్, దీపక్ దినకర్, హరికృష్ణన్, జయప్రకాష్ తదితరులు
రచన : శ్రీవత్సన్, విజి, సముద్ర కని,
సంగీతం : సి సత్య, ఛాయాగ్రహణం : ఎన్ కె ఏకాంబరం
బ్యానర్ ; అభిరామి మీడియా వర్క్స్
నిర్మాతలు : అభిరామి రామనాథన్, నల్లమ్మై రామనాథన్
విడుదల : అక్టోబర్ 13, 2021 -జీ5
రేటింగ్ : 2.25/5
Vinodhaya Sitham Movie Review : తమిళంలో సముద్రకని దర్శకత్వం వహించిన ‘వినోదయ చిత్తం‘ (వింత కోరిక) తెలుగులో పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ లతో రీమేక్ కి సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు. ఇది తమిళంలో ఓటీటీలో విడుదలైన గంటన్నర ప్రయోగాత్మక సినిమా. ఏమిటి ఇంత పొట్టి సినిమా ప్రత్యేకత? పవన్ కళ్యాణ్ లాంటి బిగ్ స్టార్ తో రీమేక్ చేసేంత విశేషం ఇందులో ఏముంది? ఇందులో వున్న సానుకూల ప్రతికూలత లేమిటి? తమిళ మలయాళ స్మాల్ బడ్జెట్ సబ్జెక్టులు తెలుగులో స్టార్స్ కి సూటవుతాయా? ఈ సందేహాలకి సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం…
కథ
చెన్నైలోని ఓ ఎమెన్సీ లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా వుంటాడు పరశురామ్ (తంబి రామయ్య). ఇక త్వరత్వరగా జనరల్ మేనేజరై పోవాలని ఆరాట పడుతూంటాడు. భార్య ఈశ్వరి (శ్రీరంజని), కుమార్తెలు వీణ (సంచితా శెట్టి), గాయత్రి (యువశ్రీ లక్ష్మి), అమెరికాలో పనిచేసే కుమారుడు అరుణ్ (దీపక్ దినకర్) వుంటారు. ఆధిపత్య భావజాలంతో హల్చల్ చేసే పరశురామ్ కంపెనీలో, ఇంట్లో ప్రతీదీ తన ఇష్ట ప్రకారమే జరిగి తీరాలని శాసిస్తాడు. తన నిర్ణయాల్ని ఇతరుల మీద రుద్దుతాడు. ప్రతీపనీ అనుకున్న టైంకి చేస్తాడు. ఇలా ఆ రోజు 25 వ పెళ్ళి రోజు వుంటుంది. సాయంత్రం వచ్చేస్తానని కంపెనీకి వెళ్ళిపోతాడు. అట్నుంచి కంపెనీ పని మీద కోయంబత్తూరు వెళ్ళాల్సి వచ్చి, కోయంబత్తూరు వెళ్ళి వస్తూ ప్రమాదానికి గురై చనిపోతాడు.
చనిపోయిన వాడు లేచి కూర్చుంటాడు. భయం భయంగా చూస్తాడు. అంధకారంలో వుంటాడు. ఎవరో వ్యక్తి తన వైపు వస్తూ, తనని ‘కాలం‘ (సముద్రకని) గా పరిచయం చేసుకుంటాడు. పరశురామ్ కి భూమ్మీద కాలం తీరిందని, ఇక పరలోక ప్రయాణానికి పదమంటాడు. పరశురామ్ కంగాడి పడి, అప్పుడే పరలోకానికి పంపొద్దనీ వేడుకుంటాడు. తను చేయాల్సిన పనులు ఇంకా మిగిలున్నాయనీ, తను లేకపోతే పనులాగి పోతాయనీ, కనుక పనులు పూర్తి చేయడానికి ఇంకొంత సమయం ఇమ్మనీ ప్రాధేయపడతాడు. కాలం అంగీకరిస్తాడు. పనులు పూర్తి చేసుకోవడానికి మూడు నెలల సమయమిచ్చి, తను వెంట వుండి చూస్తానని వచ్చి పరశురామ్ ఇంట్లో మకాం వేస్తాడు. ఇక పనులు పూర్తి చేసుకోమంటాడు.
ఏమిటా పరశురామ్ పూర్తి చేయాల్సిన పనులు? కాలం నిఘా కింద వాటిని పూర్తి చేయగల్గాడా? అందులో ఎలాటి ఇబ్బందులు పడ్డాడు? ఈ క్రమంలో తన గురించి, జనన మరణాల గురించీ ఏం తెలుసుకున్నాడు? చివరికి కాలం ఇచ్చిన తీర్పేమిటి? ఇదీ మిగతా కథ.
ఎలావుంది కథ
ఫిలాసఫికల్ ఫాంటసీ జానర్ కథ. కథ అనేకన్నా ఇది గాథ. గాథ అనడంలోనే సినిమాకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. గాథలు సినిమాలకి పనికిరావని ఎన్నో ఉదాహరణలు చూశాం. ఈ గాథ లోకంలో అన్నీ మన వల్లే జరుగుతున్నాయనీ, మనం లేకపోతే ప్రపంచమే ఆగిపోతుందనీ అహం పెంచుకుని ప్రవర్తించే మనుషులకి ప్రతీక. మనమున్నా లేకపోయినా ప్రపంచంలో ఏదీ ఆగదనీ, ప్రపంచం దాని పని అది చేసుకుపోతుందనీ, మన కోసం కాలం ఆగదనీ, కనుక అహం మాని కాలంతో బాటు బ్రతకమనీ చెప్పే గాథ. అదే సమయంలో మరణం ఆఖరి మజిలీ కాదనీ, జనన మరణాలు ముగింపు లేని ఒక వృత్తమనీ, మరణాన్ని చూసి భయపడకూడదనీ, చెప్పే ఫిలాసఫికల్ ఫాంటసీ గాథ. గాథకి ఈ కాన్సెప్ట్ ఆడియెన్స్ ఫ్రెండ్లీగా బాగానే వుంది. కానీ గాథ కమర్షియల్ సినిమా ఫ్రెండ్లీ కాదు.
మనం చూసిన కాలం మనతో వుండదు. ఇంకో కాలం వచ్చేసి మనల్ని వెనక్కి నెట్టేసి ముందు కెళ్ళి పోతుంది. ఈ గాథలో ప్రధాన పాత్ర పరశురామ్ తను చూసిన కాలంతోనే వ్యక్తుల్ని లెక్కగట్టి, వాళ్ళని అక్కడే కట్టేసి, తను అనుకున్నట్టు జరగాలనే, బాసిజం వెలగబెట్టే వ్యక్తి. ఫిలాసఫికల్ గా చూస్తే అతను వ్యక్తుల్ని శాసించడం లేదు, కాలాన్నే శాసిస్తున్నాడు. అందుకని కాలం కల్పించుకుని అతడి కాలం ముగించేసింది.
పాపులర్ మూవీ ‘బ్రూస్ ఆల్ మైటీ‘ లో జిమ్ కేరీ స్వలాభం కోసం చేసే కొన్ని పనులు ఎదురు తన్ని, టీవీ రిపోర్టర్ ఉద్యోగంలోంచి డిస్మిస్ అవుతాడు. అప్పుడు వొళ్ళు మండిపోయి ‘అసలు డిస్మిస్ చెయ్యాల్సింది నిన్నేరా!‘ అని దేవుణ్ణి తిట్టి పోస్తాడు. ఆ దేవుడు ప్రత్యక్షమై, తన పవర్స్ అన్నీ జిమ్ కేరీ కిచ్చేసి – ఇక పనులు పూర్తి చేసుకో
పొమ్మంటాడు. ఇది గాథ కాదు, కథ.
ఆ గాథా ఈ కథా రెండూ మనిషి సూపీరియారిటీ కాంప్లెక్స్ గురించే. అయితే జిమ్ కేరీతో వినోద విలువలతో కాన్సెప్ట్ ని హాస్యభరితంగా, కథగా చూపిస్తే; పరశురామ్ తో వినోద విలువలకి వీడ్కోలు చెప్పి విషాద భరిత గాథ చేశారు. కారణం, ఇది ఇదే పేరుతో శ్రీవత్సన్ రాసిన తమిళ నాటకం ఆధారంగా తీశారు. ఇందుకే గంటన్నర వుంది. నాటకం గాథగా వుంటే నష్టమేం లేదు. సినిమా కోసం నాటకాన్ని మార్చలేదని సమాచారం. ఇక్కడే తప్పులో కాలేశారు ఈ గాథని కథగా మార్చకుండా.
జిమ్ కేరీతో కథని – అదీ వినోదాత్మకంగా తీస్తే, 81 మిలియన్ డాలర్లకి 484 మిలియన్ డాలర్ల కనకవర్షం కురిసింది. ఈ తమిళ గాథతో ఈ సినిమా ఓటీటీ కిచ్చేసి సేఫ్ అయ్యారు. ఓటీటీకి గాథా కథా, పోట్టీ పొడుగూ ఏమీ వుండవు. ఒకసారి చందాకట్టేసి ఏడాది పాటు సినిమాలు చూస్తూ వుండే ప్రేక్షకుల వాషింగ్ మెషీన్ లో వేసి తీస్తే అన్నీ ఒకటే.
ఇది థియేటర్ మెటీరీయల్ కాదని ఓటీటీలో చూస్తూంటేనే తెలిసిపోతుంది. దేవుడు- కాలం లాంటి ఫిలాసఫికల్ ఫాంటసీ కాన్సెప్టులు నాటకానికి సీరియస్ గా, గాథగా వుంటే సరిపోవచ్చు గానీ, సినిమాకి హాలీవుడ్ ప్రకారం హీరోయిక్ ఫాంటసీ కథగా వుండా
ల్సిందే. ఫిలాసఫీ పనికి రాదని కాదు. ఈ ఫిలాసఫికల్ ఫాంటసీని ‘బ్రూస్ ఆల్ మైటీ‘ లాగా ఫన్నీగా, కామెడీగా, కథగా తీయాల్సిందే. ఏ సీరియస్ కాన్సెప్ట్ అయినా షుగర్ కోటింగ్ వేసిన తియ్యటి క్యాప్సూల్ లా వుండాల్సిందే కమర్షియల్ సినిమాకి. మార్కెట్ యాస్పెక్ట్ కి. ఈ సినిమా మార్కెట్ యాస్పెక్ట్ ఏమిటీ అని మొదటి ప్రశ్న వేసుకోకుండా తీస్తే మనుగడ ఏమంత బావుండదు.
ఇంకా విషయం చూద్దాం
పరశురామ్ కాలమిచ్చిన మూడు నెలల గడువుతో బతికొచ్చాక, కంపెనీలో తనని క్రాస్ చేసి జ్యూనియర్ జీఎం ఐపోవడం చూస్తాడు. కోపంతో ఉద్యోగానికి రాజీనామా చేసేస్తాడు. ఇంట్లో భార్య ఈశ్వరికి పార్కిన్సన్స్ వ్యాధి బయటపడి ఆస్పత్రి పాలవుతుంది. చికిత్సకి అమెరికా తీసికెళ్ళాలంటే చాలా డబ్బు అవసరం. ఇక స్నేహితుడి కొడుక్కిచ్చి పెద్ద కుమార్తె వీణ పెళ్ళి చేద్దామంటే, ఆమె కులం కాని వాణ్ణి ప్రేమించి వెళ్ళిపోతుంది. తండ్రి పరువు కోసం అక్క కాదనుకున్న సంబంధం చేసుకోవడానికి చిన్న కూతురు గాయత్రి సిద్ధపడుతుంది. పై చదువులకి తను అమెరికా వెళ్ళే ప్రయత్నాలు మానేసి. ఇంతలో అమెరికా నుంచి కొడుకు అరుణ్ అమెరికన్ భార్య (షెరీన్) ని వెంటబెట్టు కొస్తాడు. మరింతలో ఇటు గాయత్రి భర్త ఇంకో ఆమెతో సంబంధం పెట్టుకోవడంతో గొడవై తండ్రి దగ్గరి కొచ్చేస్తుంది. ఇలా ఎన్నో సమస్యలు చుట్టు ముడతాయి.
ఇలా ప్రతీ సమస్యకీ ఠారెత్తి పోతాడు, ఏడుస్తాడు. ఏం చెయ్యాలో తోచదు. తనతో సంబంధం లేకుండా, తను నిర్ణయించకుండా అన్నీ జరిగిపోతున్నాయి. సమస్యలతో రాజీ పడిపోతాడు. ఈ లోకానికి తనతో పనే లేదు. లోకం కంటే ఉన్నతుడని భావించుకున్న తనకి కనువిప్పయ్యింది. లోకంతో కలిసి, దాని అభీష్టాల్ని కూడా మన్నిస్తూ బ్రతకాలని తెలుసుకుంటాడు. మారిన మనిషవుతాడు.
అయినా కాలం ఇంకో రెండు పాపాలు చేశావని గుర్తు చేస్తాడు. ఇప్పుడు కంపెనీలో ఈ స్థాయికి ఎదిగావంటే ఆనాడు చేసిన పాపమే కారణమని గుర్తు చేస్తాడు. పాతికేళ్ళ క్రితం మరొకరు చేరాల్సిన ఉద్యోగంలో మాయ చేసి తను చేరిపోయాడు పరశురామ్. అలాగే భార్య ఈశ్వరి తెచ్చే లక్ష కట్నం, ఓ స్కూటరు కోసం ప్రేమించిన ఇంకో అమ్మాయిని వదిలించు
కున్నాడు. ఇప్పుడు ఈ రెండిటికీ నిష్కృతి చేసుకుంటాడు.
ఇప్పుడు కంపెనీ జీఎం కన్నా ఉన్నతమైన ఎండీ పోస్టులో కూర్చోబెడుతుంది. కుటుంబం అందరితో కలిసి హాయిగా గడుపుతాడు. మూడు నెలల గడువు తీరి కాలం ముందు నించుంటాడు. ఆయువు తీరిన అతడ్ని కాలం స్వర్గానికి తీసుకెళ్ళి పోతాడు.
ఫాంటసీ గాథా రహస్యం
ఫాంటసీ గాథా రహస్యం
ఇది గాథ కాబట్టి పరశురామ్ పాసివ్ పాత్రగా వున్నాడు. ఏ సమస్యతోనూ సంఘర్షించడు, పై చేయి సాధించడు. ఏడ్చి రాజీ పడతాడు. ఇవన్నీ కాలం సమక్షంలో జరుగుతున్నా కాలాన్ని ప్రశ్నించడు, ఎదురు తిరగడు. కాలాన్ని తన ప్రత్యర్ధిగా, శత్రువుగా భావించి – కాలానికి అతీతుడన్న తన సహజసిద్ధ భావంతో పోరాటం చెయ్యడు. గాథ అన్నాక అందులో కాన్ఫ్లిక్ట్ ఏముంటుంది? ప్రత్యర్ధి పాత్రే ముంటుంది? పాత్రకి అనుభవాలే వుంటాయి. సమస్యలతో అనుభవించీ అనుభవించీ ఓటమి చెందడమే వుంటుంది. ఇదే పరశురామ్ పని. ఇందుకే ఇలాటి సినిమాలు ఫ్లాపవుతాయి.
ఓ పాత్ర- దానికి ఒకే ప్రధాన సమస్యతో సంఘర్షణ- చివరికి పరిష్కారమనే స్ట్రక్చర్ గల కథగా గాక- స్ట్రక్చర్ వుండని గాథ కాబట్టి- ఒక సమస్య రావడం, అది ముగియడం, ఇంకో సమస్య రావడం, అది కూడా ముగియడం, మళ్ళీ ఇంకో సమస్య … ఒక్కో సమస్య ముగియగానే కాలం దానికి నీతి చెప్పడం… ఇలా వివిధ సమస్యల ఎపిసోడిక్ – డాక్యుమెంటరీ కథనం ఇక్కడ ప్రత్యక్షమైంది. కమర్షియల్ సినిమా అంటే ఎపిసోడ్లు కాదుగా? డాక్యుమెంటరీ కూడా కాదు. ఒకే సమస్యతో సంఘర్షించే ఒకే కథ!
‘బ్రూస్ ఆల్ మైటీ‘ లో ఉద్యోగం పోగొట్టుకున్న జిమ్ కేరీకి వొళ్ళు మండింది కాబట్టే యాక్టివ్ పాత్రగా దేవుణ్ణి తిట్టాడు. అలా ఓ కథ పుట్టింది. ప్రధాన పాత్ర, ప్రత్యర్ధి పాత్రల మధ్య వాద ప్రతివాదాలు పుట్టకపోతే కథ పుట్టదు. చనిపోయిన పరశురామ్ పాసివ్ పాత్రగా కాలాన్ని బతిమాలుకున్నాడు కాబట్టి కాలం దయదల్చి గడువిస్తే చాలనుకున్నాడు. అలాగే కాలం ఒప్పుకున్నాడు. దీంతో ఇక్కడ సంవాదం పుట్టలేదు, దాంతో ప్రత్యర్థి పుట్టలేదు. ఇలా ఎంతో అహం భావియైన తను ప్రాణాలు పోగానే – అసలు నా ప్రాణాలెందుకు తీశావని మౌలిక పాయింటు లేవదీసి కాలాన్ని తిట్టి ఎదురు తిరగకపోవడం ఈ ప్లాట్ పాయింట్ వన్ ఘట్టంలో కథగా నడవడానికి ఏర్పడిన పెద్ద లోపం.
తిట్టించి, కాలానికీ పరశురామ్ కీ మధ్య కాన్ఫ్లిక్ట్ పుట్టించడానికి ఎందుకు సందేహించాడు కథకుడు? సెంటి మెంట్ కాదనా? ‘భక్త తుకారాం’ లో అక్కినేని నాగేశ్వరరావు పాటలో, ‘చేసిన మేలును మరిచే వాడా నువ్వా దేవుడివి… నువ్వొక వ్యర్థుడివి,నీకొక పేరూ లేదు,రూపం లేదు,నీతీ లేదు,నియమం లేదు, నిజానికి నువ్వే లేవు..’అని చెడామడా దేవుణ్ణి తిట్టలేదా? (మనలో వున్న సబ్ కాన్షస్ ని మైండ్ ని తెలుసుకోకుండా బయటెక్కడో దేవుడున్నాడనుకుని దేవుడ్ని తిట్టడం జనాలకి నచ్చుతుంది. బాక్సాఫీసు ఫార్ములా).
మరి ఈ గాథలో కాలం ఏం చేస్తూంటాడు? ఏమీ లేదు, బ్యాక్ గ్రౌండ్ లో వుంటూ పరశురామ్ తినే ఒక్కో ఎదురు దెబ్బకి ఒక్కో నీతి చెప్పడమే. ఇతను కూడా పాసివే. పాసివ్ పాసివ్ రాసుకుంటే పైసలేం రాలతాయి. జోగీ జోగీ రాసుకుంటే బూడిదైనా రాలుతుంది గాని. దాదాపు సగం సినిమా కాలం ఒకే డ్రెస్సులో అలాగే వుంటాడు. ఆ తర్వాత కాస్ట్యూమ్స్ గుర్తొచ్చినట్టు గబగబా డ్రెస్సులు మార్చేస్తూ వుంటాడు. కంటిన్యూటీ ప్రాబ్లమో, కాస్ట్యూమర్ పారిపోయాడో.
నిజానికి పరశురామ్ పనులు పూర్తి చేయాలని గడువు తీసుకుని చేసిందేమీ లేదు. ఇది చెప్పాలనుకున్న పాయింటుకి లోబడిన పాత్ర చిత్రణే. తన వల్లే అన్నీ జరుగుతాయని నమ్మే వాడికి తన వెనుక చాలా జరిగిపోతాయని చెప్పడమే పాయింటు. ఇద్దరు కూతుళ్ళతో అలాగే జరిగింది, కొడుకుతో అలాగే జరిగింది. అయితే పెద్ద కూతురు ప్రేమించిన వాడితో వెళ్ళి పోవడానికీ, కొడుకు అమెరికన్ భార్యతో రావడానికీ తనకి తెలియకుండా భార్య ప్రోత్సాహముందని చివర్లో తెలుసుకుంటాడు. బావుంది. మరి ఆ భార్యని పార్కిన్సన్స్ వ్యాధితో ఎందుకు శిక్షించింది కాలం? ఆమె చేసింది తప్పనా?
అలాగే తండ్రి పరువు కోసం అతను చూసిన సంబంధం ఆపద్ధర్మంగా చేసుకున్న చిన్న కూతుర్నీ ఎందుకు శిక్షింది కాలం? వ్యాధితో వున్న భార్యని చికిత్సకి అమెరికాకి తీసికెళ్ళాల్సిన పనిని ఎలా మర్చిపోయి అనుకున్న గడువుకి తనువు చాలించి వెళ్ళిపోయాడు పరశురామ్? అమెరికన్ కోడలు అమెరికాలో చికిత్స ఏర్పాటు చేసింది గనుకనా?
ఈశ్వరిని చేసుకోవడానికి నమ్మిన ఇంకో యువతిని వదిలేసిన తను, అనారోగ్యంతో వున్న ఈశ్వరిని కూడా ఇలా వదిలేసి వెళ్ళి పోతాడా? అసలు ఈశ్వరితోనైనా తనదెలాటి ప్రేమ? 25వ పెళ్ళి రోజున తను యాక్సిడెంట్ లో చనిపోతే- కాలాన్ని అడగడానికి పెళ్ళి రోజు గుర్తుకు రాలేదా? నా భార్య ఎదురు చూస్తోంది- నా పెళ్ళి రోజు చంపావేంటని అసలు ప్రశ్న వేయకుండా – ఇంకేవో పనులు పూర్తి చేయాలంటాడా? ఈశ్వరికి భర్త పోవడమే ఎక్కువ, అలాటిది పెళ్ళి రోజు ముస్తాబై ఎదురు చూస్తూంటే అదే సమయం చూసుకుని కాలం మహాశయుడు భర్త ప్రాణం తీశాడంటే అతడెలాంటి శాడిస్టు? (మళ్ళీ ఆమెకి పార్కిన్సన్స్ తో ఇంకో శాడిజం). ముందు కాలాన్ని నిలదీయాలి పరశురామ్ – ఈ కోలెటరల్ డ్యామేజ్ కి. ఇలా కాలంతో సంఘర్షించడానికి పుష్కలంగా రంగం సిద్ధమైవున్నా పాసివ్ గా వుండిపోయాడు పరశురామ్. రసోత్పత్తిలేని జీవచ్ఛవ సినిమా ఇచ్చాడు.
సినిమా కథంటే రెండు పాత్రల మధ్య యాక్షన్ రియాక్షన్ల ఇంటర్ ప్లే అనేది కామన్ సెన్సు. ఇక్కడ కర్తృత్వపు కాంపిటీషన్. అన్నీ జరిపించే కాలం తను కర్త అనుకోవడం, లేదు తన వల్లే అన్నీ జరుగుతున్నాయనుకునే పరశురామ్ తనే కర్త అనుకోవడం- ఇద్దరూ అమీతుమీ తేల్చుకోవడానికి సిగపట్లకి దిగడం. ఇలా ఒక ప్రధాన సమస్య ఏర్పాటై, ఇతర సమస్యలు సబ్ ఫ్లాట్స్ గా ఏర్పడి- మొత్తం కలిపి ఒక కథగా రూపం తొడగాల్సిన కాన్సెప్ట్. మొదటి ప్రశ్న మార్కెట్ యాస్పెక్ట్ చూసుకున్నాక, చూసుకోవాల్సిన క్రియేటివ్ యాస్పెక్ట్.
పాత్రల పంపకం – పెంపకం
పరశురామ్ పెళ్ళీడుకొచ్చిన పిల్లలున్న నడి వయస్కుడు. ఈ పాత్రకి వందకి పైగా సినిమాలు నటించిన సీనియర్ క్యారక్టర్ ఆర్టిస్టు తంబి రామయ్య సరిపోయాడు. అహం, రోషం, భోళాతనం, అమాయకత్వం అన్నీ కలగలిసిన అతడి నటనే సాంతం ఈ సినిమా. కాలం పాత్రలో సముద్రకని సరిపోయినా పెద్దగా పని లేదు. తంబిరామయ్య వెంట వుంటూ మోరల్ లెసన్స్ ఇవ్వడమే. ఈ రెండు పాత్రల్లో తమిళ స్టార్స్ ఎవరినీ తీసుకోకపోవడం గమనించాలి. స్టార్ స్టేటస్ వున్న పాత్రలు కాకపోవడం చేత. గంటన్నర సినిమా కావడం చేత. నాటకం కావడం చేత కూడా కావొచ్చు. తమిళ నాటకాలనీ, సినిమాల్నీ ప్రమోట్ చేస్తూ తెలుగు రీమేకులు చేయడం జాతీయ సమైక్యతకి మంచిదే, మన సమైక్యత ఎలా వున్నా.
వాటిలోకి పవన్ కళ్యాణులూ, సాయి ధరమ్ తేజులూ వంటి స్టార్లు వచ్చినప్పుడు పాత్రల పంపకం, పెంపకం కోళ్ళ ఫామ్ కాకూడదు. సముద్రకని గెటప్ బావుందని పవన్ సముద్రకని అయినా, ధరమ్ మనకింతే అనుకుని పెళ్ళీడు పిల్లలున్న మిడిలేజి తంబి రామయ్య అయినా – లేదూ, పాత్రలో నటించే అవకాశముందని పవన్ తంబి రామయ్య అయి, మనకి ఇది కూడా చాలనుకుని ధరమ్ సముద్రకని అయినా – మేకర్స్ ఇష్టం. ‘బుద్ధిమంతుడు‘ లో అక్కినేని భక్తుడై శోభన్ బాబు దేవుడయ్యాడు; ‘అన్నమయ్య‘ లో నాగార్జున భక్తుడై సుమన్ దేవుడయ్యాడు. చిన్నవాళ్ళే దేవుళ్ళయ్యారు. ఇలా తమిళ ఒరిజినల్ తో వున్న ఎన్నో సమస్యల్ని మేకర్స్ ఎలా పరిష్కరిస్తారో, పరిష్కరించి చివరికి తాము కథవుతారో గాథవుతారో చూడడం కూడా ఒక ఇంట్రెస్టింగ్ సినిమానే.
—సికిందర్