అదేంటో, పవన్ కళ్యాణ్ రాజకీయాలకు సంబంధించిన అంశాల కంటే సినిమాల గురించిన చర్చ ఎక్కువగా జరుగుతోంది. అది కొంత మేర సహజమే కావొచ్చు. కానీ, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎప్పటికప్పుడు అనూహ్యంగా వేడెక్కుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గురించి రాజకీయ వార్తలే ఎక్కువ రావాలి.
కానీ, సినిమా గాసిప్స్ ఎక్కువగా వస్తున్నాయి. సినిమాలపై పవన్ ఎక్కువ ఫోకస్ పెట్టడమే అందుక్కారణం. ఓ సినిమా ప్రస్తుతం సెట్స్ మీద వుండగా, రెండు సినిమాలు ఈ నెలలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్నాయ్. ప్రస్తుతానికైతే ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ జరుగుతోంది. మిగతా రెండు సినిమాల్లో ఒకటి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కాగా, ఇంకోటి ‘వినోదియ సితం’ రీమేక్. మరోపక్క, సుజీత్ సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లొచ్చు.
ఇదిలా వుంటే, యంగ్ హీరో నితిన్ నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కనుందనీ, అందులో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తారనీ ప్రచారం జరుగుతోంది. నిజానికి, గతంలోనే నితిన్ ఈ విషయమై పవన్ నుంచి హామీ పొందాడట. ఓ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కథతో ఈ సినిమా తెరకెక్కనుందని అంటున్నారు.
అసలు పవన్ కళ్యాణ్‌కి కొత్తగా సినిమాలు చేసే ఛాన్సెక్కడ.? అన్న అనుమానాలు ఓ వైపు వున్నాయ్. కానీ, ఆయన తన పని తాను చేసుకుపోతున్నారు.