‘రాజయోగం’ మూవీ ఎలావుందంటే…?

సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్, అజయ్ ఘోష్ ముఖ్య పాత్రదారులుగా రామ్ గణపతి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘రాజయోగం’. ఈ సినిమాలోని ఇతరపాత్రల్లో ప్రవీణ్, గిరి, భద్రం, షకలక శంకర్, తాగుబోతు రమేష్, చిత్రం శ్రీను, సిజ్జు, మధునందన్ తదితరులు నటించారు. మణి లక్ష్మణ్‌రావునిర్మించిన ఈ చిత్రానికి డాక్టర్ శ్యామ్ లోహియా, నందకిషోర్ దారక్ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రానికి విజయ్ సీ కుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతల్ని నిర్వహించారు. సాంకేతిక విషయాలకొస్తే.. శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రూపుదిద్దుకున్న ఏ చిత్రానికి ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, సంగీతం: అరుణ్ మురళీధరన్, మాటలు : చింతపల్లి రమణ సమకూర్చారు. ఈ రోజు (30-12-2022)న విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకునే ముందు కథలోకి వెళదాం…

మధ్యతరగతి కుటుంబానికి చెందిన రిషి (సాయిరోనక్) మెకానిక్ గా పని చేస్తూ కాలం గడుపుతుంటాడు. ఎలాగైనా సూపర్ గా సెటిలవ్వాలన్నది అతడి ఆశయం. అయితే.. అందుకు ఎంత కష్టమో తెలియందికాదు. మరి ఎలా? అని ఆలోచిస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఓ సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొంటే జీవితంలో సెటిల్ కావొచ్చని పగటికలలు కంటుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ రోజు హైదరాబాద్‌ స్టార్ హోటల్‌లో ఉండే యాజమానికి కారు అప్పగించడానికి వెళ్లి.. అక్కడ శ్రీ (అంకిత సాహా)అనే అమ్మాయిని చొసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. అయితే.. ఆమె విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలనే కోరికతో వయసు మళ్లిన బిజినెస్ మ్యాగ్నెట్ (జీవా)తో రిలేషన్‌పిప్ పెట్టుకొంటూనే రిషితో శారీరక సుఖాన్ని పొందుతుంది. అయితే శ్రీపై పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన సమయంలో రిషికి షాకిచ్చి.. డేనియల్ (సిజ్టు) వద్ద వజ్రాలను కాజేయాలని గ్యాంగ్‌స్టర్ రాధా (అజయ్ ఘోష్)తో జత కడుతుంది. మరి చివరికి ఏమైంది? రిషి పగటికలలు ఫలించాయా? కారు అప్పగించడానికి వెళ్లిన రిషి ఫైవ్ స్టార్ హోటల్‌లోనే ఎందుకు ఉండిపోయాడు? రిషిని శ్రీ ఎందుకు ప్రేమించింది? రిషి సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు.. కారు మెకానిక్ అనే విషయం శ్రీకి ఎలాంటి పరిస్థితుల్లో తెలిసింది? రాధా, డేనియల్ సిజ్జు మధ్య వజ్రాల గొడవ ఏమిటి? రిషి, శ్రీ ప్రేమ కథలోకి ఐశ్వర్య (బిస్మీ నాస్) ఎందుకు వచ్చింది? అసలు ఐశ్వర్య ఎవరు? వజ్రాల కోసం జరిగిన దొంగాటతో ఐశ్వర్యకు ఎలాంటి సంబంధం ఉంది? కారు మెకానిక్ అని శ్రీ వదిలేసి వెళ్లిన తర్వాత రిషి పరిస్థితి ఏమిటి? చివరికి ఐశ్వర్య, శ్రీలో ఎవరిని రిషి పెళ్లి చేసుకొన్నాడు? అనేది తెలియాలంటే ‘రాజయోగం’ సినిమా చూడాల్సిందే..

విశ్లేషణ : దర్శకుడు రామ్ గణపతి సినిమాను ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించడానికి విఫలప్రయత్నం చేశాడు. కోట్లాది రూపాయల విలువ చేసే వజ్రాలను దక్కించుకోవాలని ప్లాన్ చేసిన రెండు ముఠాల మధ్య ఇద్దరు ప్రేమికులు ఇరుక్కుపోవడం అనే పాయింట్‌ను దర్శకుడు కథగా విస్తరించిన విధానం ఆకట్టుకుంటుంది. యువతను టార్గెట్ చేస్తూ తొలి భాగం పూర్తిగా నాటు కామెడీతో పాటు, మితిమీరిన శృంగారం, రొమాన్స్‌తో గిలిగింతలు పెట్టి సినిమా ఆద్యంతం అలరించేలా సాగింది. ఫస్టాఫ్‌లో అజయ్ ఘోష్, చిత్రం శ్రీను గ్రూప్ కామెడీ కడుపుబ్బ నవ్విస్తూ ప్రేక్షకుల్ని వినోదంలో ముంచెత్తుతుంది. ఇక హీరో సాయి రోనక్, అంకిత సాహా మధ్య ఉన్న శృంగార సన్నివేశాలు పూర్తిగా ఓవర్‌డోస్ అని చెప్పొచ్చు. మంచి ఎమోషనల్ ట్విస్టుతో తొలిభాగాన్ని ముగించి ద్వితీయార్ధంపై ఎంతో ఆసక్తిని పెంచడంలో దర్శకుడు వాహ్.. అనిపించాడు. అయితే ద్వితీయార్ధం కోసం మంచి జోష్‌తో వచ్చిన ప్రేక్షకులకు ఆ రేంజ్ ఫన్ కొంత కరువైనట్టు కనిపిస్తుంది. హోటల్‌లో ఇద్దరు అమ్మాయిలతో నలుగురు రొమాంటిక్ సీన్లు మరోసారి కడుపుబ్బ నవ్విస్తాయి. తొలిభాగం సన్నివేశాలతో అలరించిన దర్శకుడు ద్వితీయార్ధంలో ఆ టెంపోను కొనసాగించలేకపోయాడు. కథలో సాగదీత వల్ల ఫస్టాఫ్‌లో ఉండే జోష్ ఏ మాత్రం కనిపించదు. హఠాత్తుగా కథలోకి ప్రీ క్లైమాక్స్ నుంచి ఎక్కువగా క్యారెక్టర్లు రావడం వల్ల గందరగోళం నెలకొంటుంది. ఫలితంగా ప్రేక్షకుడు బోర్ ఫీలవుతాడు. సెకండాఫ్‌లో కొంత నిడివి తగ్గిస్తే ఇంకా మంచి ఫీల్ ఉండే అవకాశం ఉండేదనిపిస్తుంది. లవ్, రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్, యాక్షన్, థ్రిల్లింగ్ మూమెంట్స్ కలబోసిన అడల్డ్ కామెడీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఈ ‘రాజయోగం’. నటీనటుల పెర్పార్మెన్స్‌తోపాటు, అజయ్ ఘోష్ బృందం అందించిన నాటు కామెడీ ఈ సినిమాకు హైలెట్. ఫస్టాఫ్ ఫుల్ ఫన్, రొమాన్స్ అంశాలు బాగుంటాయి. సెకండాఫ్ రొటీన్ సన్నివేశాలతో సాగుతుంది.

ఎవెరెలా చేశారంటే.. హీరో సాయి రోనక్ విషయానికి వస్తే.. రిషిగా అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న పాత్రలో ఒదిగిపోయి చక్కటి నటన కనబరిచాడు. రొమాంటిక్ సన్నివేశాల్లో, శృంగారపరమైన సీన్స్ లో లీనమై నటించాడు. హీరోయిన్‌ శ్రీతో కలిసి తెరమీద యువతను గిలిగింతలు పెట్టేలా మంచి కెమిస్ట్రీని పండించాడు. ఇక ఫైట్స్ సన్నివేశాలను కూడా ఈజీగా చేసేశాడు. బ్రేకప్ సన్నివేశాల్లోనూ ఎమోషనల్‌గా నటన కనబరిచి ఫర్వాలేదనిపించాడు. మంచి కథ, దర్శకుడు పడితే.. టాలీవుడ్‌లో మంచి హీరోగా మారే అవకాశం ఉంది.

ఇక హీరోయిన్ విషయానికొస్తే.. శ్రీ పాత్రలో నటించిన అంకిత సాహా అందాల అరబోతతో యువతకు గాలం వేసే ప్రయత్నం చేసింది. ఎలాంటి బిడియం లేకుండా లిప్‌లాక్స్‌తో గ్లామర్ ను చిందించింది. కేవలం రొమాన్స్‌కే పరిమితం కాకుండా ఎమోషనల్ సీన్లలో చక్కటి నటన ప్రదర్శించి ఒకే అనిపించింది. ముఖ్యంగా ఈ ‘రాజయోగం’లో నాటు, మాస్ కామెడీని పండించడంలో అజయ్ ఘోష్, చిత్రం శ్రీను, తాగుబోతు రమేష్, షకలక శంకర్ బృందం బాగా నవ్వుల్లో ముంచెత్తింది. బాల్ సన్నివేశాలు ప్రేక్షకులను నవ్వించేలా చేస్తాయి. అలాగే వజ్రాల దక్కించుకొనేందుకు రెండు మాఫియా గ్యాంగుల మధ్య సన్నివేశాలు ఆసక్తికరంగా సాగేలా సిజ్జు, మధునందన్ తమ వంతు పాత్రను పోషించారు. ఇతర క్యారెక్టర్లలో నటించిన వారు తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపిస్తారు.

సాంకేతిక విభాగాల విషయానికొస్తే… విజయ్ సీ కుమార్ కెమెరా పలు సన్నివేశాలను ఎంతో అందంగా కెమెరాలో బంధించి మంచి మార్కుల్ని కొట్టేసింది. అరుణ్ మురళీధరన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ఒకే అనిపిస్తుంది. . పలు సన్నివేశాలను ఆసక్తికరంగా సాగడంలో మ్యూజిక్ ప్రధాన పాత్ర పోషించింది. అలాగే చింతపల్లి రమణ రాసిన మాటలు ఫన్ క్రియేట్ చేశాయి. ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్ పనితీరు ఫర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

మొత్తంమీద ‘జబర్దస్త్’ తరహా కామెడీని ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు మాత్రమే ఈ ‘రాజయోగం’ నచ్చే అవకాశం ఉంది.

చిత్రం : రాజయోగం,
విడుదల : 30, డిసెంబర్-2022,
రచన-దర్శకత్వం : రామ్ గణపతి,
రేటింగ్ : 2/5