ఏది నగ్న సత్యం?- ‘ఆమె’ రివ్యూ

ఏది నగ్న సత్యం? – ‘ఆమె’ రివ్యూ!

తెర మరుగవుతోందననుకున్న అమలా పాల్ ఒక్కసాగా తెరపైకి సంచలనాత్మకంగా వచ్చేసింది. సినిమా సంప్రదాయాల్ని బద్దలు కొడుతూ, ఛాలెంజింగ్, డేరింగ్, డాషింగ్ ప్రయత్నం చేసి వార్తల కెక్కేసింది, ట్రైలర్స్ తో వైరల్ అయింది. అర్బన్ యూత్ విశృంఖలత్వాన్నిచాటి చెప్తూ పవర్ఫుల్ మెసేజిని ఇవ్వాలనుకుంది. బోల్డ్ గా నటించి సోలో హీరోయిన్ సినిమాని కొత్త మలుపు తిప్పింది. ఇన్ని చేసిన తను అసలు చివరికి ఏం తేల్చిందో చూద్దాం…

కథ
న్యూస్ ఛానెల్లో ప్రాంక్ షోలు నిర్వహించే సత్యవాణి అలియాస్ కామిని (అమలా పాల్) పాశ్చాత్య పోకడలతో స్వేచ్ఛగా, విశృంఖలంగా జీవించే డేరింగ్ గర్ల్. పొగరు, మొండితనం, ఏదైనా అనేసే, చేసేసే తత్త్వం ఎక్కువ. అమ్మాయిగా కంటే అబ్బాయిలా ఎక్కువ బిహేవ్ చేయడం, ప్రతీ దానికీ బెట్స్ కట్టడం ఆమె ధోరణిగా వుంటుంది. ఇవి పెడ ధోరణులని ఆమె తల్లి (శ్రీరంజని) వాపోతూంటుంది. ఛానెల్లో జెన్నిఫర్ (రమ్యా సుబ్రహ్మణ్యన్) అనే  న్యూస్ రీడర్ తో నగ్నంగా న్యూస్ చదువుతానని ఛాలెంజి కూడా విసురుతుంది కామిని. ఒక రోజు ఆమె బర్త్ డేకి ఛానెల్ కొలీగ్స్ పార్టీ ఇస్తారు. ఆ పార్టీలో పీకలదాకా తాగి, డ్రగ్స్ పీల్చేసి ఎంజాయ్ చేస్తారు. తెల్లారిపోయాక లేచి చూస్తే అక్కడెవరూ వుండరు, తను తప్ప. అదీ నగ్నంగా. షాకై, ఏం చేయాలో అర్ధంగాక, ధరించడానికి బట్టల్లేక, బయటికి రాలేక, ఆ భవనంలో బందీ అయిపోతుంది.

ఎవరు తననిలా చేశారు? దేని ఫలితమిది? ఇప్పుడెలా పరువు కాపాడుకుని బయటపడాలి? దీన్నుంచి ఏం నేర్చుకోవాలి?… ఈ ప్రశ్నలకి సమాధానాలు మిగతా కథలో తెలుస్తాయి.

ఎలావుంది కథ
ఇదొక అపూర్వ ప్రయోగమని చెప్పొచ్చు నగ్న పాత్రతో. గతంలో సీమా బిస్వాస్ ‘ఫూలన్ దేవి’ లో నగ్నంగా నటించింది గానీ కాసేపే. ‘ఆమె’ లో సెకండాఫ్ దాదాపూ స్క్రీన్ టైం నగ్న పాత్రతోనే వుంటుంది. ఈ ఆలోచన చేయడానికి దర్శకుడు రత్న కుమార్ ఎంతో సాహసించాడు. తమిళ సినిమాని ఇంకో మెట్టు పైకి తీసికెళ్ళాడు.

ఈ కథ హాలీవుడ్ నియో నోయర్ జానర్ లో వుంది. పెద్ద నగరాల్లో అర్బన్ యూత్ నైట్ లైఫ్ అనే సంస్కృతి నేర్పాటు చేసుకుని, తప్పులు చేసి ఇరుక్కుని, నేరాలు కూడా చేసి బయట పడలేక, సొసైటీకి మొహం చూపించలేని పరిస్థితుల్లో ఎలా జీవితాల్ని చెడగొట్టుకుంటారో తెలిపే కథలతో వుండే నియో నోయర్ జానర్లో, హిందీలో కహానీ -2, పింక్, షైతాన్, యాక్సిడెంట్ ఆన్ హిల్ రోడ్, తమిళంలో 16- డి, సూదు కవ్వం, నగరం, మలయాళంలో కనుపాప మొదలైనవి వచ్చాయి.

ఇప్పుడు తమిళ ‘ఆడై’ తెలుగు డబ్బింగ్ ‘ఆమె’ కూడా ఈ కోవకే చెందుతుంది. ఇది యూత్ ఓరియెంటెడ్ జానర్. తెలుగు సినిమాలు రొటీన్ క్రైం థ్రిల్లర్ జానర్ దగ్గరే ఆగిపోయాయి. యూత్ నైట్ లైఫ్ ని విశ్లేషించే నియో నోయర్ ని అర్ధం జేసుకునే పరిస్థితుల్లో లేరు తెలుగు మేకర్లు. కానీ పైన చెప్పుకున్న మూడు భాషల్లో నోయర్ సినిమాలకి తెలుగు యువ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. నోయర్ సినిమాలని డార్క్ మూవీస్ అని కూడా అంటారు. ‘ఆమె’ ఈ జానర్లో యువ పోకడలపై బాగానే ఫోకస్ చేసింది కానీ, కథకి సంబంధంలేని ఇంకో రెండు విషయాలని కూడా ఎత్తుకుంది.

నోయర్ జానర్ మర్యాదకి వ్యతిరేకంగా చరిత్రలోకి కూడా వెళ్ళింది. పూర్వ కాలంలో తమిళనాడులో ఫ్యూడల్ వ్యవస్థ స్త్రీల అచ్ఛాదనకి సంబంధించి చేసిన ఒక దుష్ట చట్టానికి వ్యతిరేకంగా నంగేయి అనే వివాహిత రొమ్ము కోసుకుని వస్త్ర స్వాతంత్ర్యాన్ని నినదించిన ఘట్టాన్ని, సినిమా మొదట్లోయానిమేషన్ చేసి ప్రారంభించారు. దీంతో ఒక తికమక ఏర్పడింది – ఈ కథ అర్బన్ యూత్ విశృంఖలత్వం గురించా, లేక స్త్రీ వస్త్ర స్వాతంత్ర్యం గురించా అన్న కన్ఫ్యూజన్ ఏర్పడింది.

అలాగే ఛానెల్స్ నిర్వహించే ప్రాంక్ షోల మీద కూడా కథ వుంటుంది. ఆ చరిత్ర, ఈ ప్రాంక్ షోలు కాకుండా ఇప్పటి యూత్ రుబాబు చరిత్ర చెప్తే సరిపోయేది. పైగా చరిత్రలోని నంగేయి పేరుతో ఒక నీట్ విద్యార్ధినిని చివర్లో ప్రవేశ పెట్టి, సుదీర్ఘమైన క్లాసు పీకించి, మెసేజి ఇప్పించారు నారాయణ మూర్తి సినిమా కథల్లోలాగా.

నిజానికి ‘ఆమె’ కథ వస్త్ర స్వాతంత్ర్యం గురించి కాదు. ఎక్స్ పోజ్ చేస్తూ తిరిగే అమ్మాయిల పాత్రలేవీ ఇందులో లేవు. అలాగే ప్రాంక్ షోలకి వ్యతిరేకంగా కూడా కథ కాదు. కేవలం ఒక రాత్రి బెట్లు కట్టి పాల్పడిన చర్యలకి ప్రతిచర్యగా ప్రాప్తించిన నగ్నత్వపు కథ ఇది. ఈ నగ్నత్వమనేది విశృంఖలత్వంలోని చేదుని రుచి చూపించానికి ఉపయోగపడ్డ సింబాలిజం మాత్రమే.

ఐతే ఇందులో రోమాన్స్ లేదు. లవ్ ట్రాకులు లేవు. ఇదొక మంచి రిలీఫ్. ‘బ్రోచేవారెవరురా’ రోమాన్స్ కి దూరంగా వుండిపోయింది. ఇప్పుడు ‘ఆమె’. సినిమాలు మారుతున్నాయనడానికిదో సంకేతం.

ఎవరెలా చేశారు
అమలా పాల్ లోని నటి బహుముఖ పార్శ్వాల్లో వెల్లడైంది. పాత్రలో పదహారు షేడ్స్ వున్నాయి – ఇతరుల్ని ఏడ్పించడం దగ్గర్నుంచీ తను ఏడ్చే దాకా. పదహారు అవార్డులు గ్యారంటీ. ఇక సోలో హీరోయిన్ సినిమాలు చేసే నటీమణులకి గట్టి పోటీ నివ్వడం ఖాయం. ప్రాంక్ షో యాంకర్ గా బహిరంగ ప్రదేశాల్లో ప్రజల్ని ఫూల్స్ చేసే పాత్రతో అల్లరల్లరిగా ప్రారంభమై, నైట్ పార్టీతో సమస్యలో ఇరుక్కుని, మొత్తం తన జీవితాన్నే విశ్లేషించుకునే సావకాశం ఇలా ఏర్పడి, రియలైజ్ అయి, ఇక మారిన యువతిగా జీవితాన్ని మార్చుకునే పాత్రలో చాలా జీవించేసింది. కథ చెప్పడమంటే ఇగోని మెచ్యూర్డ్ ఇగోగా మారుస్తూ చిత్రించే నిర్వచనానికి సజీవ రూపం అమల పాత్ర, నటన.

ఆద్యంతం నోయర్ మూవీ చిత్రీకరణతో వుంటాయి దృశ్యాలు. లైటింగ్ గానీ, షేడ్స్ గానీ, కథ వయొలెంట్ నేచర్ కి తగిన రెడ్ కలర్ థీమ్ గానీ అర్బన్ లుక్ తో జానర్ కి న్యాయం చేస్తాయి. అయితే నోయర్ జానర్ కి తప్పనిసరిగా పాటించాల్సిన 9 ఎలిమెంట్సూ లేకపోయినా వున్న లైటింగ్, షేడింగ్ ఎలిమెంట్స్ ఎఫెక్టివ్ గా వున్నాయి. అక్కడక్కడా వెలిగే డిమ్ బల్బులు సైకలాజికల్ గా ప్రేక్షకులకి హిప్నాటిక్ మూడ్ ని సృష్టిస్తాయి. కెమెరా మాన్ విజయ్ కార్తీక్ గ్రేట్ వర్క్ చేశాడు. అలాగే ప్రదీప్ సౌండ్ ట్రాక్ రాక్,మెలోడీ, డివోషనల్ ట్రాకుల కలబోతగా జోష్ నిస్తుంది. షఫీఖ్ మహమ్మద్ అలీ ఎడిటింగ్ ఇంకో ఆర్టు. నోయర్ సినిమా అంటేనే కళాత్మకంగా వుండేది.

చివరికేమిటి?
విశృంఖలత్వం పాత్రలకేగానీ దర్శకుడు రత్న కుమార్ కి కాదు. నగ్నత్వం వరకూ పాత్రల్ని వాటి విశృంఖలత్వానికి వదిలేసి, పాత్ర దుస్తులు కోల్పోయాక సానుభూతితో తానందుకుని దాంతో సున్నితంగా డీల్ చేయడం మొదలెట్టాడు. అవసరమైన చోటల్లా నగ్న రూపాన్ని బ్లర్ చేస్తూపోయాడు. ఎక్కడా ప్రేక్షకుల కామోద్రేకాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయలేదు. ఎక్కడా నేల క్లాసు ప్రేక్షకులు కూడా కామెంట్లు చేయలేదు, ఈలలు వేయలేదు, పిల్లి కూతలు కూయలేదు. ఇది దర్శకుడి విజయం. అమల ధైర్యం.

కథనంలో ఎక్కడెక్కడ ఏఏ లీడ్స్ ఇవ్వాలో కథలో కలిసిపోయేట్టు ఇస్తూ డైనమిక్ గా నడిపాడు. సమస్య మొదలయ్యే లోగా అనేక చోట్ల ఏదోవొక రూపంలో దుస్తుల మీద క్షణకాలపు సీన్స్ వుంటాయి. డ్రెస్ విప్పేసి న్యూస్ చదువుతా అనే పాయింటుకి ఆమె వచ్చేసరికి, ఈ దుస్తుల లీడ్స్ అన్నీ అప్పుడామె పాయింటుని జస్టిఫై చేస్తాయి. ఏ సీనూ వృధాగా లేదు.

అలాగే నైట్ పార్టీ ఏదో ఒక బంగళాలో పెట్టవచ్చు. కార్లేసుకుని అక్కడికి వెళ్ళొచ్చు. కానీ అలా చేయలేదు. కథా ప్రాంగణంలోనే కథ వుండాలన్న నియమంతో ఒక పని చేశాడు. ప్రారంభ సీన్స్ లోనే ఛానెల్ ఆఫీసు ఖాళీ చేసే తతంగం మొదలవుతుంది కోర్టు ఉత్తర్వుల ప్రకారం. బర్త్ డే పార్టీ అనుకున్నప్పుడు ఆ ఖాళీ అయిన ఆఫీసులోనే పెట్టుకునేట్టు చేశాడు.

ఇక  సెకండాఫ్ క్లయిమాక్స్ వరకూ పెద్ద సస్పెన్స్ ఏమిటంటే, ఆమె నగ్నంగా భవనంలో బందీ అయిపోగా, ఆమె పార్టీలో పాల్గొన్న ఆమె కొలీగ్స్ ఏమయ్యారనేది. క్లయిమాక్స్ వరకూ వీళ్ళని చూపించకుండా సస్పెన్స్ సృష్టిస్తాడు. ఆ  కొలీగ్స్ లో ఎవరు ఈమెనిలా శిక్షించి వెళ్లి పోయారనేది క్లయిమాక్స్ లో వాళ్ళు కన్పించేవరకూ సస్పెన్స్.

ఇక క్లయిమాక్స్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఆమె నగ్నత్వపు రహస్యాన్ని విప్పుతుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ తో కాన్సెప్టే మారిపోయింది. యూత్ పోకడల మీద గాక, ప్రాంక్ షోల మీద కథ అన్నట్టు తేలింది. ఏ అంశం యూత్ కి చెప్పాల్సిన నగ్న సత్యమో తేల్చుకోలేక వస్త్రం కప్పేసినట్టయింది.

రచన – దర్శకత్వం : రత్నకుమార్
తారాగణం : అమలా పాల్, శ్రీరంజని, రమ్యా సుబ్రహ్మణ్యన్, ఆది రాజ్, వివేక్ ప్రసన్న తదితరులు
సంగీతం : ప్రదీప్ కుమార్, ఛాయాగ్రహణం : విజయ్ కార్తీక్
నిర్మాతలు :  రాం బాబు కే, విజయ్ ఎం.
2.5
-సికిందర్