నటీనటులు: నాగశౌర్య, మెహరీన్, ప్రిన్స్, జిష్షుసేన్ గుప్తా, హరీష్ ఉత్తమన్, సర్గున్ కౌర్, సత్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
కథ: నాగశౌర్య,
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రమణతేజ
నిర్మాత: ఉషా ముల్పూరి
సంగీతం: శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి
ఎడిటింగ్: గ్యారీ బీహెచ్
రిలీజ్ డేట్: 31-01-2020
రేటింగ్: 2.5
2011లో కెరీర్ ప్రారంభించిన నాగశౌర్యకు గుర్తింపుని, తన కెరీర్‌లో మంచి హిట్‌ని అందించింది మాత్రం `ఛలో` మాత్రమే. ఈ సినిమా తరువాత మళ్లీ ఆ తరహా మ్యాజిక్‌ని నాగశౌర్య చేయలేకపోయాడు. అతని చుట్టూ వున్న వాతావరణం, వ్యక్తుల ప్రభావమో ఏమో తెలియదు కానీ తనకు తగ్గ కథల్నిఎంచుకోలేక వరుస ఫ్లాపుల్ని సొంతం చేసుకున్నారు. సొంత బ్యానర్‌పై చేసిన `నర్తనశాల` దారుణంగా ఫ్లాప్ అయినా మళ్లీ సొంత సంస్థలోనే తాజా చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాతో లవర్‌బాయ్ ఇమేజ్‌ని తుడిచేసుకోవాలని, మాస్ హీరోగా గుర్తింపుని పొందాలని నాగశౌర్య చేసిన ప్రయత్నం ఫలించిందా?. అతని కాన్ఫిడెన్స్‌కు తగ్గట్టే సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
నాగశౌర్యకు చెల్లెలు అంటే ప్రాణం. ఆమెకు ఎలాంటి ఆపద రాకూడదని, తను హాయిగా నవ్వుతూ వుండాలని కోరుకుంటుంటాడు. అలాంటి చెల్లెలు పెళ్లికి ముందు గర్భవతని తెలుస్తుంది. అయితే అది ఎలా జరిగింది అన్నది ఆమెకే తెలియదు. ఆ తరువాత అబార్షన్ చేయించి పెళ్లి చేస్తాడు. తన చెల్లెలి తరహాలోనే వైజాగ్‌లో మరింత మంది అమ్మాయిలకు అలాంటి సంఘటనే ఎదురవుతుంది. కొంత మంది అమ్మాయిలు వరుస కిడ్నాప్‌లకు గురవుతారు. ఇలా అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తున్నది ఎవరు?.. ఎందుకు చేస్తున్నారు? అన్నది మిస్టరీగా మారుతుంది. ఈ మిస్టరీని ఛేదించడానికి రంగంలోకి దిగిన నాగశౌర్య ఏం చేశాడు? .. కిడ్నాప్‌ల వెనకున్న అసలు సూత్రధారిని కనిపెట్టాడా? కనిపిఎడితే వాడి టార్గెట్ అమ్మాయిలే ఎందుకు? అన్న విషయాలు తెలియాలంటే `అశ్వథ్థామ` సినిమా చూడాల్సిందే.
నటీనటులు:
యంగ్ హీరోగా క్రేజ్ వున్నా తన క్రేజ్‌కి తగ్గ చిత్రాల్ని నాగశౌర్య చేయలేకపోయాడు. మొహమాటం కోసం ఓ బేబీ, కణం వంటి చిత్రాల్లో నటించి మరింత క్రేజ్‌ని తగ్గించుకున్నాడు. అయితే `ఛలో`తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడని పించుకున్నా అమ్మమ్మగారిల్లు, నక్తనశాల, ఓ బేబీ వంటి చిత్రాలతో మళ్లీ వెనకబడ్డాడు. లవర్ బాయ్ ఇమేజ్‌ని పక్కన పెట్టి మాస్ ఇమేజ్ కోసం నాగశౌర్య చేసిన చిత్రం `అశ్వథ్థామ`. ఈ విషయంలో కొంత వరకు సక్సెస్ అయినట్టే కనిపిస్తోంది. తనతో సినిమాలు చేయాలనుకుంటున్న డైరెక్టర్‌లకు `అశ్వథ్థామ`తో డైరెక్ట్ ఇండికేషన్స్ ఇచ్చాడు. మాస్ అంశాల్లో తన ఎనర్జీ లెవెల్‌ని చూపించి ఆకట్టుకున్న నాగశౌర్య కథా, కథనం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. అతని శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కేది. మెహరీన్ నటనకు చెప్పుకోవాల్సింది ఏమీ లేదు అయితే ఉన్నంతలో బాగానే చేసింది. ప్రధాన విలన్‌గా కనిపించకుండా దోబూచులాడిన జిష్షుసేన్ గుప్తా సినిమాకి మెయిన్ హైలైట్‌గా నిలిచాడు. అతనికి, హీరోకి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించేలా వున్నాయి. హరీష్ ఉత్తమన్ నటన కూడా బాగుంది. ప్రిన్స్, సర్గున్ కౌర్, సత్య తదితరులు తమ తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం:
నాగశౌర్య అందించిన కథ బాగున్నా అందులో చేర్చిన సన్నివేశాలు చాలా వరకు సినిమాకు అతకలేదని చెప్పాలి. ఒక దగ్గర హైలో వుంటే మరో దగ్గర లోలో వుండటం… ఎప్పటికప్నుడు ఈ సీన్ బాగుంటే వచ్చే సీన్ మీర బాగుంటుందేమో అనుకునే లోగా టప్‌మని గ్రాఫ్ పడిపోవడం లాంటివి చాలానే వున్నాయి. ఇక కథకి యాక్షన్ సన్నివేశాలకు ఎక్కడా సంబంధం వున్నట్టు కనిపించదు. ఈ కథకు ఈ స్థాయి యాక్షన్ సీక్వెన్స్‌లు అవసమా? అనిపిస్తుంది. దర్శకుడిగా రమణ తేజ కథని గ్రిప్పింగ్‌గా నడిపించడంలో ఫెయిలయ్యాడు. ఎమోషనల్ డ్రైవ్‌తో సాగాల్సిన సినిమా అక్కడక్కడ డీవేట్ అవుతూ సాగుతుంది.
ఈ సినిమా కోసం మనోజ్ రెడ్డి ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఆయన అందించిన ఫొటోగ్రఫీ సినిమాకి గ్రాండ్ లుక్‌ని తీసుకొచ్చింది. ఇక అనల్- అరసు చిత్రీకరించిన యాక్షన్ బ్లాక్స్ సూపర్బ్. ఇవి కొంత సినిమాకు ప్లస్ అయ్యాయి. గ్యారి బిహెచ్ ఉన్నంతలో తన పని చూపించే ప్రయత్నం చేశాడు కానీ ఫస్ట్ హాఫ్‌లో చేతులు ఎత్తేసినట్టే కనిపించింది.
శ్రీచరణ్ పాకాల పాటలు ఓకే అనిపించాయి. జిబ్రాన్ నేపథ్య సంగీతం మాత్రం ఓ రేంజ్‌లో వుంది. సినిమా మూడ్‌ని మెయింటైన్ చేయడంలో అది కీలక పాత్ర పోషించింది.
విశ్లేషణ:
నాగశౌర్యకు గత కొంత కాలంగా లవర్‌బాయ్ ఇమేజ్ గురించి విని విని విసుగుపుట్టిందట. ఆ ఇమేజ్ తనకొద్దు బాబోయ్ అంటూ మాస్ ఇమేజ్ కోసం చేసిన చిత్రం `అశ్శథ్థామ`. ఆ కోరికను తీర్చేలానే వుంది. కానీ కథ, కథనంలో మరిన్ని మార్పులు చేసుకుని పక్కాగా దిగితే మరింత బాగుండేది. దాంతో మాస్ హీరోగా వంద మార్కులు సాధించాలనుకున్న నాగశౌర్య యాభై మార్కులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
మాస్ మసాలా యాక్షన్ సీన్స్, జిష్షూ సైకో యాక్షన్.. వెరసి కొత్త తరహా సైకో థ్రిల్లర్ చిత్రాలని కోరుకునే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చుతుంది కానీ రెగ్యులర్ ఫ్యామిలీ ఎమోషన్ ఫిలింస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ చూడాలనుకునే వారిని మాత్రం ఖచ్చితంగా నిరాశ పరుస్తుంది.