డామిట్ కథ ‘అద్దం’ తిరిగింది – ‘నిను వీడని నీడను నేనే’ రివ్యూ!

డామిట్ కథ ‘అద్దం’ తిరిగింది – ‘నిను వీడని నీడను నేనే’ రివ్యూ!

2010 నుంచి నటించిన 21 లో విజయవంతంగా 19 ఫ్లాపులిచ్చిన సందీప్ కిషన్, ఇక నిర్మాతగా మారి సక్సెస్ సంగతి తేల్చుకుందామనుకున్నాడు. ‘నిను వీడని నీడను నేనే’ అంటూ వెంటాడుతున్న ఫ్లాపుల పరంపరకి ఇదే టైటిల్ తో సినిమా తీసి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాడు. కొత్త ఐడియాతో వచ్చిన తమిళ దర్శకుడితో రంగంలోకి దూకాడు. తెలుగు ప్రేక్షకులు కూడా కొత్త ఐడియాలతో వచ్చే అర్బన్ సినిమాలకి అలవాటుపడుతున్నారు. ఈ అనుకూల మార్కెట్ వాతావరణంలో నిర్మాతగా సందీప్ కిషన్ కొత్త ప్రయోగం, దాని ప్రచారం, సాటి హీరోల ప్రమోషన్లు, గ్లోబల్ గానే తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ‘సవ్యసాచి’ నుంచీ ‘బుర్రకథ’ వరకూ ఈమధ్య కొత్త అయిడియాలతో అరడజను సినిమాలొచ్చాయి. వీటిలో ‘ఓ బేబీ’ తప్ప ఇంకేవీ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి. కాబట్టి ఒకమనిషిలో ఇంకొకరుండే వన్ బై టూ ఐడియాతో ఇంకో సస్పెన్స్ థ్రిల్లర్ గా తీసిన సందీప్ కిషన్ ఏ మేరకు సక్సెస్ అయ్యాడు? ఇది చూద్దాం…

కథ :
2035 లో పారా సైకాలజిస్టు (మురళీ శర్మ) ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చి విద్యార్థులకి (మాళవికా నాయర్, తమిళ దర్శకుడు కార్తీక్ నరేన్) తను డీల్ చేసిన ఒక కేసు గురించి చెప్పుకొస్తూంటాడు… అది కూకట్ పల్లిలో 2013 వ సంవత్సరం. రిషి (సందీప్ కిషన్), దియా (అన్యా సింగ్) లు భార్యాభర్తలు. ఒక రాత్రి కారులో పోతూండగా శృంగార చేష్టలు అదుపు తప్పి, కారుకూడా అదుపు తప్పడంతో ఘోరప్రమాదం జరుగుతుంది. అందులోంచి బయటపడి అటుగా వెళ్తే అనుకోకుండా స్మశానంలో ప్రవేశిస్తారు. అక్కడో శవం కాలుతూంటుంది. ఎలాగో అక్కడ్నుంచి ఇంటికొచ్చేస్తే అద్దంలో వేరే ముఖాలు కనబడతాయి. రిషి అద్దంలో చూసుకుంటే అర్జున్ (వెన్నెల కిషోర్) మొహం, దియా అద్దంలో చూసుకుంటే మాధవి మొహం కన్పిస్తాయి. వాట్సాప్, ఫేస్ బుక్ లలో కూడా వాళ్ళ ఫోటోలు మారిపోతాయి. దీంతో కంగారుపడ్డ రిషి పారాసైకాలజిస్టుని కలుస్తాడు. ఈ మిస్టరీని ఛేదించడానికి పోలీస్ ఇన్స్ పెక్టర్ (పోసాని) తోడవుతాడు. అప్పుడు తెలుస్తుంది, రిషి – దియాలలో వున్నది అర్జున్, మాధవిలు కాదనీ, అర్జున్ – మాధవిల్లోనే రిషీ – దియాలున్నారని!

అంటే అసలు అర్జున్ (సందీప్ కిషన్), మాధవి (అన్యా సింగ్) లే రిషి (వెన్నెల కిషోర్_ అతడి భార్య దియాల్లో వుంటూ ఇబ్బంది పెడుతున్నారని. ఇదెలా జరిగింది? ఈ మిస్టరీని ఛేదించేదే మిగతా కథ.

ఎలావుంది కథ :
ఒకమనిషిలో ఇంకొకరుండే వన్ బై టూ కథల సినిమాలు రొటీన్ అయిపోతున్నాయి. సినిమా కెళ్ళాలంటే ఎవడిలో ఎవడుంటాడోనని భయమేసే పరిస్థితేర్పడింది. మనలో మనమే వున్నామా అని డౌటేసే …దాపురించింది. అమర్ అక్బర్ అంటోనీ, సవ్యసాచి, గేమ్ ఓవర్, బుర్రకథ, ఓ బేబీ, ఇప్పుడు నిను వీడని నీడను నేనే… ఇంకా రాబోయే ఇస్మార్ట్ శంకర్ కూడా! …ఇలా హార్రర్ కామెడీల ట్రెండ్ ముగిసి, వన్ బై టూ క్యారక్టర్ సినిమాలు అదే పనిగా వస్తున్నాయి. వీటితో సక్సెస్ లేదు. విడుదల కాని ‘ఇస్మార్ట్ శంకర్’ ని పక్కన బెడితే, ‘ఓ బేబీ’ తప్ప పైన పేర్కొన్న మిగిలినవన్నీ అట్టర్ ఫ్లాపులే. తాజాగా ‘నిను వీడని నీడను నేనే’ (నివీనీనే) ఫస్టాఫ్ మాత్రమే సక్సెస్. ఇలాటి యూనీక్ ఐడియాలు కథ మొదలెట్టడం వరకే కొత్తగా వుంటున్నాయి. మొదలెట్టాక కథ నడపడం రాక, ఐడియానే వదిలేసి ఇంకో కథని ఎత్తుకుంటూ సెకండాఫ్ సిండ్రోం అనే సుడిగుండంలో పడుతున్నాయి. ‘నిను వీడని నీడను నేనే’ అనే కొత్త ఐడియాకి ఫస్టాఫ్ వరకే ఇంధనం సరిపోయింది, ఆ తర్వాత క్రాష్ లాండింగ్ అయి ఢమాల్మని సెకండాఫ్ సిండ్రోంలో పడింది. అద్దం కథ అడ్డం తిరిగింది…

ఎవరెలా చేశారు:
సందీప్ కిషన్ స్మార్ట్ గా బావున్నాడు. అతను నటించడంలో ఎప్పుడూ విఫలంకాలేదు, సినిమాలే విఫలమయ్యాయి. ఇప్పుడు సగం సినిమా అయినా బాగా కుదిరి నటనతో పాక్షిక విజయాన్ని సమకూర్చాడు సినిమాకి. హీరోయిన్ తో రోమాంటిక్, ఎరోటిక్ సీన్లు, ప్రత్యర్థులతో ఫైటింగ్ సీన్లు, చివర్లో మదర్ తో సెంటిమెంటు సీను (ఏడుస్తున్నప్పుడు కూడా కాన్ఫిడెంట్ గా వున్నాడు), మిస్టరీ, సస్పెన్స్, హార్రర్ సీన్లూ… ఇలా అన్నిటా నిర్మాతగా బాధ్యతగా నటించి నిరూపించుకున్నాడు. సెకండాఫ్ కథ దారితప్పి ఏవో కామెడీలు చేయడం వల్ల నాన్ సింక్ అయిపోయాడు పాత్రతో సహా.

హీరోయిన్ అన్యా సింగ్ గ్లామరస్ గా వుంది. క్లిష్ట పాత్రని బాగానే పోషించింది. రో మాంటిక్ ఎరోటిక్ సీన్ కి ఎక్కువ తోడ్పడింది. వెన్నెల కిషోర్ తో కామెడీ వుండదు, అతను బాధిత పాటర్. మదర్ పాత్రలో పూర్ణిమా భాగ్యరాజ్ మీద బరువైన సన్నివేశాలూ,ఒక పాటా వున్నాయి. పోసానీ కామెడీ పోలీస్ పాత్రలో, మురళీ శర్మ పారా సైకాలజిస్టు పాత్రలో బావున్నారు.

ఎస్ ఎస్ తమన్ సంగీతం హైలైట్ గా వుంది. అలాగే ఛాయాగ్రహణం కూడా. ప్రొడక్షన్ విలువల బావున్నాయి.

చివరికేమిటి:
ఫస్టాఫ్ పది నిమిషాల్లో కథ ప్రారంభమై పోతుంది – అద్దాల్లో వేరే ప్రతిబింబాలు కన్పించడం ద్వారా. ఇంటర్వెల్లో అద్దాల్లో కన్పిస్తున్న వాళ్ళే సజీవంగా వున్న భార్యా భర్తలనీ, అద్దాల్లో చూసుకుంటున్న భార్యాభర్తలు ఎప్పుడో చచ్చి పోయారనీ రివీల్ అవడం ట్విస్టు. ఇలాటి ట్విస్టులు ఇంటర్వెల్లో పెడితే ఏమవుతుందంటే, ఇంటర్వెల్ తర్వాత కథ వుండదు. ప్రతీ కథకి బిగినింగ్, మిడిల్, ట్విస్ట్ వుంటాయని కొత్త పాయింటు చెప్పాడు ఆర్ ఎల్ స్టీన్ అనే స్క్రీన్ రైటర్. ఇది హాలీవుడ్ లో మనోజ్ నైట్ శ్యామలన్ తీసిన ‘సిక్స్త్ సెన్స్’ (1999) అనే సూపర్ హిట్ కి వర్తిస్తుంది. ఇందులో చివరివరకూ కన్పించే బ్రూస్ విల్లీస్ నటించిన హీరో పాత్ర, నిజానికి బతికి లేదని ముగింపులో ఇచ్చే ట్విస్ట్ గా వుంటుంది. ఇలాటి ట్విస్టులు ముగింపులోనే వర్కౌట్ అవుతాయి. ఇంటర్వెల్లో పెట్టేస్తే ఆ తర్వాత కథ వుండదు. ఇది తెలుసుకోకుండా ఘోరమైన పొరపాటు చేశారు ‘నివీనీనే’ లో.

దీంతో అర్జున్ – మాధవిలు ఎలా చనిపోయారని తెలుసుకునే కథ అతికించి సెకండాఫ్ నడిపించారు. దీంతో స్క్రీన్ ప్లే మధ్యకి ఫ్రాక్చర్ అవడమే కాక, మొత్తం కాన్సెప్ట్ లేదా ఐడియా కథ లేని సెకండాఫ్ సిండ్రోం లో పడింది. మనిషిగా ఎలా చనిపోయారో ఆత్మలకి తెలియకుండా వుంటుందా? ఇంకేమిటి తెలుసుకునేది? దీన్నుంచి కథ ఇంకో అంశం మీదికి జంప్ అవుతుంది. అర్జున్ తను తిష్ట వేసిన రిషీ శరీరంలోంచి బయటికి వచ్చేందుకు అతడితో త్రీ స్టేజి మంత్రం అంటూ కామెడీ చేయడం, మంత్రగాళ్ళతో కామెడీ చేయడం, ఇది వదిలేసి బ్రెయిన్ సర్జరీ అని, అదీ వదిలేసి మదర్ తో కలిసి మదర్ సెంటిమెంటు అనీ ఇలా రకరకాల పరస్పర సంబంధంలేని ఎపిసోడ్లుగా సాగుతుంది కథనం. దీంతో సెకండాఫ్ డాక్యుమెంటరీలకి పనికొచ్చే స్టార్ట్ అండ్ స్టాప్ బాపతు నాన్ కమర్షియల్ కథనం కూడా అయింది.

ఇలా ఇంటర్వెల్ ట్విస్టు బ్రహ్మాండంగా వుందని సంబరపడినట్టున్నారు గానీ, అదే సెకండాఫ్ కి కథ లేకుండా దర్శకుణ్ణి కన్ఫ్యూజన్లో పడేసింది. ఇలా సందీప్ కిషన్ సగం విజయం సాధించాడని వన్ బై టూ ఫీలింగ్ ని షేర్ చేసుకోవాలేమో…

రచన – దర్శకత్వం : కార్తీక్ రాజు
సందీప్ కిషన్, అన్యా సింగ్, పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, పూర్ణిమా భగ్యరాజ్, ప్రగతి తదితరులు
సంగీతం: ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహణం: ప్రమోద్ వర్మ,
బ్యానర్స్: . వెంకటాద్రి టాకీస్, వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్
సమర్పణ : అనిల్ సుంకర
నిర్మాతలు: దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్,
విడుదల : జులై 12, 2019
2.25
―సికిందర్