నటీనటులు: రవితేజ, పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్య హోప్, బాబీ సింహా, సునీల్, వెన్నెల కిషోర్, సత్య, అజయ్, జీవా, సత్యం రాజేష్, రాంకీ, రఘుబాబు, గిరిబాబు, అన్నపూర్ణమ్మ, నరేష్, సీవీఎల్ నరసింహారావు తదితరులు నటించారు.
స్టోరీ, స్క్రీప్‌ప్లే, దర్శకత్వం: వి.ఐ.ఆనంద్
నిర్మాత: రామ్ తాళ్లూరి
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
మాటలు: అబ్బూరి రవి
ఎడిటింగ్: శ్రవణ్ కటికనేని
రిలీజ్ డేట్: 24-01-2020
రేటింగ్: 2.5
ఏడాది విరామం తరువాత 2017లో `రాజా ది గ్రేట్`తో ప్రేక్షకుల ముందుకొచ్చారు మాస్ రాజా రవితేజ. ఇది హిట్ అనిపించుకున్నా ఆ తరువాత చేసిన టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోని…ఇలా వరుసగా మూడు ఫ్లాప్‌లని చవిచూశారు. దీంతో మళ్లీ ఏడాది విరామం తీసుకున్న మాస్ రాజా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ `డిస్కోరాజా`తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మురుగదాస్ శిష్యుడు వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అటు వి.ఐ.ఆనంద్‌కు, ఇటు మాస్ రాజా రవితేజకు, నిర్మాత రామ్ తాళ్లూరికి విషమ పరీక్షే. ఎందుకంటే ఈ సమయంలో ఈ ముగ్గురికి హిట్ కావాలి. ఏడాది విరామం తరువాత పూర్తి నమ్మకంతో గ్యారెంటీగా హిట్ కొట్టాలనే పట్టుదలతో చేశామని ఈ చిత్ర ప్రమోషన్స్‌లో రవితేజ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారు. అయన చెప్పినట్టే సినిమా వుందా? లేదా అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
మంచు కొండల్లో బ్రెయిన్ డెడ్ అయిన పడి వున్న వాసు (రవితేజ) ని తీసుకొచ్చి బయోకెమికల్ వారు అతనిపై ప్రయోగం చేస్తారు. ఆ ప్రయోగం ఫలించి అతను తిరిగి మళ్లీ మామూలు మనిషి అవుతాడు. అయితే ఆ ప్రయోగం వల్ల తన గతాన్ని మొత్తం మర్చిపోతాడు. ప్రయోగం అనంతరం వాసు బయో కెమికల్ ల్యాబ్ నుంచి తప్పించుకుని తన కుటుంబాన్ని వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో ఓ ఎంపీతో గొడవకు దిగుతాడు. ఇదే సమయంలో బర్మాసేతు (బాబీ సింహా) వాసుని హత్య చేయడానికి వస్తాడు. బర్మా సేతు.. వాసుని చంపాలనుకోవడానికి కారణం డిస్కోరాజ్(రవితేజ). ఇంతకీ డిస్కోరాజ్ ఎవరు?. అతని కథేంటి?. అతనికీ వాసుకి ఉన్న సంబంధం ఏంటి?. ఆ తరువాత కథ ఎన్ని మలుపులు తిరిగింది?…వాసు మంచు పర్వతాల్లో అచేతనంగా పడిపోవడానికి కారణం ఎవరు?.. అసలు వాసు.. డిస్కోరాజ్ ఒకరేనా? అతనిపై బయో కెమికల్ ల్యాబ్‌లో జరిగిన ప్రయోగం ఏంటి? అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటులు:
ఏడాది విరామం తరువాత రవితేజ నుంచి వచ్చిన సినిమా ఇది. తనదైన మేనరిజమ్స్‌తో ఆకట్టుకునే రవితేజ ఈ మధ్య వరుస ఫ్లాపులతో రేసులో చాలా వేనకబడిపోయారు. ఆ లోటుని తీర్చాలని కొంత విరామం తీసుకుని చేసిన సైన్స్ ఫిక్షన్ ఇది. డిస్కోరాజ్‌గా మాస్‌రాజా అదరగొట్టాడని చెప్పొచ్చు. కొత్త రవితేజ కనిపించాడు. మేనరిజమ్స్, డైలాగ్ మాడ్యులేషన్, క్యారెక్టర్ని ఓన్ చేసుకున్న తీరు ఆకట్టుకుంటుంది. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కనిపించారు. డిస్కోరాజ్.. మజా లేలో అన్నట్టుగానే వుంది రవితేజ క్యారెక్టర్ని మలిచిన తీరు. ఆ తరువాత మెప్పించిన పాత్ర బాబీ సింహాది. బర్మా సేతు పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సునీల్ కిది ఓ గేమ్ చేంజర్ అనుకోవచ్చు. కామెడీని పండిస్తూనే నెగెటివ్ షేడ్స్‌తో తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఈ సినిమాతో సునీల్ కెరీర్ కొత్త మలుపు తిరిగే అవకాశం వుంది. ఇక సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించారు. పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్య హోప్ ఈ ముగ్గురిలో కొంతలో కొంత పాయల్ రాజ్ పుత్‌కు తప్ప ఎవరికీ అంత ప్రాధాన్యత లభించలేదు. వెన్నెల కిషోర్ నవ్వించే ప్రయత్నం చేశారు.
సత్య, అజయ్, జీవా, సత్యం రాజేష్, రాంకీ, రఘుబాబు, గిరిబాబు, అన్నపూర్ణమ్మ, నరేష్, సీవీఎల్ నరసింహారావు పాత్రల పరిధిమేరకు నటించారు.
సాంకేతిక వర్గం:
సైన్స్ ఫిక్షన్‌గా కలరింగ్ ఇచ్చినా రోటీన్ రివేంజ్ డ్రామానే ఎన్నుకున్నారు వి.ఐ. ఆనంద్. ఆయన పనితనం ఎక్కడా కనిపించలేదు. అతనికి మించి బెస్ట్ ఇచ్చిన వారు ఎవరైనా వున్నారంటే అది రవితేజతో పాటు టెక్నీషియన్స్ మాత్రమే. `అల వైకుంఠపురములో`తో మాంచి ఫామ్‌లో వున్న తమన్ ఈ సినిమా విషయంలోనూ అదే ఫామ్‌ని కొనసాగించాడు. పాటలతో పాటు ఆయన అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్లస్ అని చెప్పాలి. రెట్రో థ్రిల్లర్ అయిన ఈ చిత్రాన్ని విజువల్స్ పరంగా ఉన్నతంగా చూపించే ప్రయత్నం చేశాడు కెమెరామెన్ కార్తీక్ ఘట్టమనేని. సినిమాలో రవితేజ పాత్ర ఎంత క్లాస్‌గా కనిపించినా మాస్‌ని ఆకట్టుకునే డైలాగ్‌లని రాసి అదరగొట్టారు అబ్బూరి రవి. శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని వుంటే బాగుండేది. కొంత వరకు బోరింగ్ సీన్లకు కత్తెర వేయాల్సింది. ఇలాంటి సినిమా ఎంత షార్ప్‌గా కట్ చేస్తే అంత ఎంగేజింగ్‌గా వుంటుంది. కానీ ఆ విషయంలో దర్శకుడు, ఎడిటర్ ఫెయిల్ అయినట్టే తెలుస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తపడితే కొంత వరకైనా మెప్పించే వీలుండేదేమో.
విశ్లేషణ:
సైన్స్ ఫిక్షన్ అని ఇండికేషన్స్ అందించి సినిమాకి రెట్రో కలర్ ఇచ్చిన దర్శకుడు వి.ఐ. ఆనంద్ రొటీన్ రివేంజ్ డ్రామాని తెరపైకి తీసుకొచ్చి ప్రేక్షకుల్నిమోసం చేశాడనే చెప్పాలి. శిరీష్‌తో కొరియన్ సైన్స్ ఫిక్షన్ ని `ఒక్క క్షణం` పేరుతో ఫ్రీమేక్ చేసి ఫెయిల్ అయిన వి.ఐ. ఆనంద్ మళ్లీ అదే తప్పు చేసినట్టు కనిపిస్తోంది. సినిమా ప్రకటించిన దగ్గరి నుంచి వరుస లుక్లతో నానా హంగామా చేసి అంచనాల్ని పెంచేసిన ఆయన ఆ స్థాయిలో మాత్రం కంటెంట్‌ని అందించలేకపోయాడు. డిస్కోరాజ్ పాత్రని మాత్రమే ప్రధానంగా రాసుకుని సినిమాకు ప్రాణమైన అసలు కథని గాలికి వదిలేసినట్టు అర్థమౌతోంది. ఆ పాత్రని గంట నడిపించి బాగానే స్కోర్ చేసిన ఆనంద్ ఆ తరువాత చేతులెత్తేయడంతో కథ గాడి తప్పింది. దీనికి తోడు రవితేజ మార్కు కామెడీ పంచ్‌లు, మాస్ ఎలిమెంట్స్ లేకపోవడం మరో డ్రాబ్యాక్గా చెప్పుకోవచ్చు. డిస్కో అంటూ బొమ్మ చూపించిన వి.ఐ. ఆనంద్ సైన్స్ ఫిక్షన్ పేరుతో చేసిన ప్రయోగం మరోసారి నిరాశపరిచింది. దాంతో భారీగా అంచనాలు పెంచిన `డిస్కోరాజా` బాక్సాఫీస్ వద్ద యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది.