ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి టీమిండియా మూడోసారి ఛాంపియన్‌గా నిలిచింది. అయితే మ్యాచ్ తో పాటు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ న్యూ స్టోరీ. స్టేడియంలో చహల్ ఓ అందమైన అమ్మాయితో కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతవరకు ఎవరికీ తెలియని ఈ మిస్టరీ గర్ల్ అసలెవరో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి కనబరిచారు.
స్టేడియంలో చహల్‌తో కలిసి కనిపించిన వ్యక్తి మహ్వాష్ అని తెలిసింది. ఆమె ఓ ప్రముఖ రేడియో జాకీగా పేరుగాంచింది. చహల్ వ్యక్తిగత జీవితం ఇప్పటికే వార్తల్లో ఉండగా, ఈ కొత్త పరిణామం మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. దంపతుల మధ్య విభేదాలు ఉన్నట్లు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ ఇటీవల చహల్, ధనశ్రీ వర్మ విడాకుల కోసం అఫీషియల్‌గా కోర్టులో దరఖాస్తు చేసుకున్నారని వార్తలు వచ్చాయి.
అయితే ఈ కేసు ఇంకా కోర్టులో ఉన్నదని, దాని గురించి ఎటువంటి తప్పుడు సమాచారం ప్రసారం చేయొద్దని ధనశ్రీ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. అంతేకాకుండా విడాకుల సెటిల్‌మెంట్‌లో ధనశ్రీ రూ. 60 కోట్లు డిమాండ్ చేసిందని వచ్చిన వార్తలను ఆమె కుటుంబం ఖండించింది. “ఇలాంటి అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేయడం బాధాకరం. మీడియా వాస్తవాలను నిర్ధారించుకుని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి” అని ధనశ్రీ కుటుంబం ఓ ప్రకటనలో పేర్కొంది.
ఒకవైపు ఛాంపియన్స్ ట్రోఫీ విజయోత్సవం, మరోవైపు చహల్ వ్యక్తిగత జీవితం.. ఈ రెండూ ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారాయి. చహల్ స్టేడియంలో కనిపించడమే కాదు, ఓ కొత్త అమ్మాయితో ఉన్న కారణంగా ఈ వార్త మరింత చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం దీనిపై చహల్ ఎలాంటి అధికారిక వ్యాఖ్యలు చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ అంశంపై ఊహాగానాలు ఆగడం లేదు.