ప్రతి ఐపీఎల్ సీజన్ ముందూ అభిమానులు కొన్ని జట్లపై భారీ అంచనాలు వేసుకుంటారు. కానీ ఈసారి అందరి ఊహలకూ విరుద్ధంగా పంజాబ్ కింగ్స్ అద్భుత ప్రదర్శనతో లీగ్ దశను టాప్-2లో ముగించింది. గత 17 సీజన్లలో కేవలం ఒక ఫైనల్ మాత్రమే ఆడిన ఈ జట్టు, ఈసారి మాత్రం ఆటలోనే కాదు, టేబుల్ లో ముందంజలో ఉంది. వరుస విజయాలతో ఉన్న ముంబయిని ఓడించి పంజాబ్ అగ్రస్థానాన్ని అందుకోవడం ఈ సీజన్‌లోని హైలైట్‌గా నిలిచింది.
ఇప్పటికే పంజాబ్ టాప్-2లో ఉండటం ఖాయం కావడంతో, క్వాలిఫయర్-1లో ప్రత్యక్షంగా ఆడే అవకాశం దక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది. ఓడినా క్వాలిఫయర్-2 ద్వారా మరో అవకాశం ఉంటుంది. ఈ స్థాయికి పంజాబ్ చేరడంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పాత్ర అత్యంత కీలకం. గతంలో ఢిల్లీకి ఫైనల్ టికెట్ అందించిన ఈ యువ కెప్టెన్ ఇప్పుడు పంజాబ్ రాతను మలిచాడు.
కెప్టెన్సీ, ఇతర ఆటగాళ్ల వినియోగం, వరుస విజయాల్లో వ్యూహాత్మక స్ధిరత్వం.. అన్నీ శ్రేయస్ శైలికి నిదర్శనం. అతడి ఆధ్వర్యంలో పంజాబ్ పూర్తిగా మారిపోయింది. గతంలో అసంతృప్తిగా ముగిసిన సీజన్లను పక్కనపెట్టి, ఈసారి జట్టు సమిష్టిగా మెరుగైన ఆటతీరు కనబరుస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ బ్యాలెన్స్‌తో ముందుకెళ్తోంది.
ఇప్పుడు ప్రశ్న ఒకటే.. ఈ ఊపుతో పంజాబ్‌కు తొలిసారి ఐపీఎల్ కప్పు లభిస్తుందా? శ్రేయస్ అద్భుత నాయకత్వం, బలమైన బ్యాకప్‌తో చూస్తుంటే ఈసారి అదృష్టం పంజాబ్ కింగ్స్ వైపు మళ్లేలా ఉంది అనిపించకమానదు. ముఖ్యంగా ఎంతో కాలంగా ప్రీతి జింటా ఐపీఎల్ ట్రోపిని.ముద్దాడాలని చూస్తోంది. మరి ఆమె కల నెరవేరుతుందో లేదో చూడాలి.