తెలుగువాడైన విక్రమ్ తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. విక్రమ్ ముందు నుంచి విభిన్నమైన కథలల్లో నటించడానికే ఆసక్తి చూపిస్తున్నాడు. తెలుగులో దాదాపు 6-7 సినిమాలు చేశాడు. అవన్ని కుటుంబ కథా చిత్రాలే. కాని తమిళంలో నటించిన శివ పుత్రుడు సినిమాతో అటు తమిళం తో పాటు ఇటు తెలుగులోనూ సరికొత్త ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. అంతేకాదు ఈ సినిమాతో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్నాడు.
ఆ తర్వాత అపరిచితుడు, మల్లన్న, ఐ, నాన్న, మజా, మిస్టర్ కెకె లాంటి సినిమాలతో ఆయన క్రేజ్ ఊహించనంతగా మారిపోయింది. కాగా తాజాగా విక్రమ్ 3 తమిళ సినిమాలలో నటిస్తున్నాడు. ఈ సినిమాలు తెలుగులోనూ రిలీజ్ కానున్నాయి. అయితే ఈ సినిమాలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా ‘కోబ్రా’. ఈ సినిమా మీద కోలీవుడ్ మీడియా వర్గాలలో .. అలాగే ఇండస్ట్రీ వర్గాలలో భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.
లాక్ డౌన్ లేకపోయి ఉంటే ఇప్పటికే ఈ సినిమా విడుదలవ్వాల్సింది. కానీ ఇండస్ట్రీ మూతబడటంతో షూటింగ్ దశలోనే ఆగిపోయింది. కాగా తిరిగి రీసెంట్ గా ఇటీవలే లాక్ డౌన్ ఎత్తివేయడంతో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. చెన్నైలోని ప్రముఖ స్టూడియోలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్ లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ షెడ్యూల్ పూర్తవగానే చిత్ర యూనిట్ రష్యా లో కొత్త షెడ్యూల్ మొదలపెట్టబోతున్నారట. ఇక ఈ సినిమాని వయకామ్, 7 స్క్రీన్ స్టుడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించనున్న ఈ సినిమాలో విక్రమ్ 30 రకాల గెటప్స్ లో కనిపించనున్నాడని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాలో విక్రమ్ పర్ఫార్మెన్స్ అసలు ఊహకందదని చెప్పుకుంటున్నారు. ఇక 2021 లో సమ్మర్ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందట.