విక్రమ్ అభిమానులపై పోలిసుల దాడి… మండిపడుతున్న నెటిజన్స్?

సౌత్ ఇండియన్ స్టార్ హీరో చియాన్‌ విక్రమ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విక్రమ్ నటించిన సినిమాలు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. విక్రమ్ ఎప్పుడు వైవిధ్యమైన పాత్రలలో నటించడానికి ఆసక్తి చూపుతాడు. విక్రమ్ నటించిన అపరిచితుడు,మల్లన్న, ఐ వంటి సినిమాలు అన్ని భాషలలోనూ విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచాయి. తన వైవిద్యమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరైన విక్రమ్ ప్రస్తుతం ‘ కోబ్రా ‘ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 31వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాలో విక్రమ్‌ సరసన కేజిఎఫ్ 2 ఫేమ్ శ్రీనిధి శెట్టి నటించింది. షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ పనులను ప్రారంబించింది.

తాజాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విక్రమ్, శ్రీనిధి శెట్టి, దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తదితరులు తిరుచ్చి వెళ్లారు. అయితే తమ అభిమాన హీరోని కలవాలన్న కోరికతో విక్రమ్ అభిమానులు భారీగా ఎత్తున ఎయిర్ పోర్ట్ కి తరలి వచ్చారు. ఈ క్రమంలో అభిమానులని అదుపు చేసే క్రమంలో సీఐఎస్‌ఎఫ్‌ పోలీసులు వారిని తరిమికొట్టారు. వీరిలో ఒక పోలీస్ మాత్రం మరింత రెచ్చిపోయి ఒక అభిమానిని కాలుతో తన్నుతూ వెళ్ళాడు. పక్కన ఉన్న ఇతర పోలీస్ సిబ్బంది అతనిని అదుపు చేయటానికి ప్రయత్నించినా కూడా అభిమానిపై విరుచుకుపడ్డాడు.

అయితే అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమ అభిమాన నటుడికి ఆహ్వానం పలికి అతనిని చూడటానికి వచ్చిన అభిమానుల పట్ల ఇలా దురుసుగా ప్రవర్తించటం తో నెటిజన్లు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన సీఐఎస్‌ఎఫ్‌ పోలీస్ పై చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.