మరోమారు విక్రమ్‌ దర్శకత్వంలో నితిన్‌!

యూత్‌ స్టార్‌ నితిన్‌కు ప్రస్తుతం బ్యాడ్‌ టైం నడుస్తోంది. ఈ మధ్య ఆయన చేసిన సినిమాలేవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. అప్పుడెప్పుడో ‘భీష్మ’ సినిమాతో కెరీర్‌ లో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న నితిన్‌ ఇప్పటివరకు సరైన హిట్‌ కొట్టలేకపోయాడు. మధ్యలో వచ్చిన మ్యాస్టో కాస్త పరవాలేదనిపించినా.. ఆతరువాత వచ్చిన ‘మాచర్ల నియోజకవర్గం’, ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ’ సినిమాలు డిజాస్టర్‌ గా నిలిచాయి. దాంతో తన తరువాతి సినిమాల విషయంలో కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్నాడు నితిన్‌.

ఈ నేపధ్యంలోనే తన నెక్ట్స్‌ సినిమా కోసం క్రేజీ కాంబోను సెట్‌ చేసుకున్నాడు. ఈమధ్యే ‘హనుమాన్‌’ సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అనుకున్న నిర్మాత నిరంజన్‌ రెడ్డి బ్యానర్‌ లో నెక్ట్స్‌ సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్టు కోసం తన ప్రియమైన దర్శకుడు విక్రమ్‌ కె కుమార్‌ ను సెలెక్ట్‌ చేసుకున్నాడట. గతంలో కూడా నితిన్‌ వరుస ప్లాప్స్‌ లో ఉన్నప్పుడు ‘ఇష్క్‌’ సినిమాతో మెమరబుల్‌ హిట్‌ అందించాడు దర్శకుడు విక్రమ్‌.

ఇప్పుడు మరోసారి తన కెరీర్‌ ను సెట్‌ చేసే భాధ్యతను విక్రమ్‌ చేతిలో పెట్టాడు నితిన్‌. ఇక విక్రమ్‌ కె కుమార్‌ అంటే వినూత్న సినిమాలకు కేరాఫ్‌. అలా వచ్చినవే మనం, 24, రీసెంట్‌ గా ‘దూత’ వంటి సినిమాలు. ఇపుడు మరోసారి నితిన్‌ సినిమా కోసం కూడా సరికొత్త కథను సిద్ధం చేశాడట విక్రమ్‌. దీనికి సంబందించిన కథా చర్చలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయని, ఇప్పటివరకు కనిపించని సరికొత్త పాత్రలో నితిన్‌ కనిపించన్నాడని టాక్‌. ఈ సినిమాను నిర్మాత నిరంజన్‌ రెడ్డి కూడా చాలా ప్రత్యేకంగా తీసుకున్నారట. కాబట్టి.. హిట్‌ కాంబోలో వస్తున్న ఈ సినిమాతో నితిన్‌ తన కెరీర్‌ ను సెట్‌ చేసుకుంటాడా అనేది చూడాలి.