బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ వార్త దేశవ్యాప్తంగా సంచలం సృష్టించింది. మొదటగా దీన్ని ఆత్మహత్య అని నిర్దారించినా.. అనూహ్య మలుపుల తరువాత హత్యకేసుగా ఫిర్యాదులు నమోదు కావడం, సీబీఐ, ఈడీ, నార్కోటిక్ డపార్ట్మెంట్ కలుగజేసుకోవడం జరిగింది. ప్రస్తుతం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు డ్రగ్స్ మాఫియా చుట్టూ తిరుగుతోంది. వీటన్నంటిలో ముఖ్యంగా ముడిపడి ఉన్నది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రేయసి రియా చక్రవర్తియే. ఇక ఈ విషయాలన్నింటిపై విజయశాంతి స్పందిస్తూ.. టాలీవుడ్‌లో జరిగిన సెలెబ్రిటీల మరణాలు, అంతుచిక్కని రహస్యాలపై ప్రశ్నలు సంధించింది. ఈ మేరకు విజయశాంతి చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
‘బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వెనుక వాస్తవాల్ని వెలికితీసేందుకు ప్రభుత్వాలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. దోషుల్ని పట్టుకోవడానికి సీబీఐ విచారణకు సైతం ఆదేశించడం హర్షణీయమే గానీ… మన సినీరంగంలో ఒకప్పుడు ఇంతకంటే దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకుని ఎందరో నటీమణులు బలవన్మరణాలకు పాల్పడిన సంగతి మనందరికీ తెలుసు. వారిలో ఒక్కరి ఆత్మకైనా శాంతి కలిగించేలా ఈ స్థాయిలో విచారణలు… దర్యాప్తులు జరిగాయా? చాలామంది నటీమణులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినప్పుడు నామమాత్రంగా కేసులు నమోదు కావడం, తూతూ మంత్రంగా విచారణ చేసి చివరకి మమ అనిపించడమే చూశాం.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో బయటకొస్తున్న విషయాలు చూస్తుంటే విస్మయం కలుగుతోంది. వెండితెరపై వెలగాలని ఎన్నో ఆశలతో వచ్చే కళాకారులు ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురవడం బాధాకరం. అయితే దర్యాప్తులు, విచారణలనేవి వివక్ష లేకుండా ఎవరి విషయంలోనైనా ఒకేలా ఉండాలి. ఈ విషయంపైన ఒక జాతీయ టీవీ చానెల్‌లో జరిగిన చర్చ సందర్భంగా ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే స్పందిస్తూ… సెలబ్రిటీలకైనా, సామాన్యులకైనా న్యాయప్రక్రియ ఒకే తీరులో కొనసాగాలని, అప్పుడే న్యాయాన్ని ఆశించగలమని అన్నారు. సంచలనాత్మకమైన ఇలాంటి ఎన్నో కేసుల విచారణ క్రమాన్ని గమనిస్తే, తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో ఏసీబీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు ఎంతో శ్రమించి కోర్టులకు తగిన ఆధారాల్ని సమర్పించిన తర్వాత కూడా… వారు ఆశించిన ఫలితం రాకుంటే ప్రభుత్వాలు అప్పీలుకు వెళ్ళకపోవడం వల్ల శిక్షలు పడే అవకాశం బలంగా ఉన్న కేసులు సైతం నీరుగారుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు జరగాలి’ అంటూ విజయశాంతి కోరుకుంది.