Mithun Chakraborty: మిథున్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు… ప్రధాని మోదీ అభినందనలు

Mithun Chakraborty: మన దేశంలో సినీ రంగానికి సంబంధించి ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డుల్లో ‘దాదా సాహెబ్‌ ఫాల్కే’ ప్రధానమైనది. ఈ ఏడాది అవార్డుకు ప్రముఖ నటుడు మిథున్‌ చక్రవర్తి ఎంపికైనట్టు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. అక్టోబర్‌ 8న జరగనున్న జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కేంద్ర, సమాచార మంత్రి అశ్విని వైష్ణవ్‌ పోస్ట్‌ పెట్టారు. మిథున్‌ చక్రవర్తి అద్భుతమైన సినీ ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు గుర్తించి ఈ ఏడాది దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం ఆయనకు అందించాలని జ్యూరీ నిర్ణయించిందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. మిథున్‌ చక్రవర్తికి శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ చలన చిత్ర రంగానికి ప్రముఖ నటుడు మిథున్‌ చక్రవర్తి చేసిన అపారమైన సేవలను గుర్తించి ఆయనకు ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు ప్రకటించడం ఆనందంగా ఉంది. విభిన్నమైన నటనతో ఆయన ఎన్నో తరాలను అలరించారు. ఎంతోమంది అభిమానాన్ని పొందారు. ఆయనకు నా అభినందనలని ప్రధాని పేర్కొన్నారు.

ఈ పురస్కారానికి తాను ఎంపిక కావడంపై మిథున్‌ ఆనందం వ్యక్తంచేశారు. మాటలు రావడం లేదు. ఇలాంటి గొప్ప విజయాన్ని నేను అస్సలు ఊహించలేదు. చాలా సంతోషంగా ఉన్నా. నా కుటుంబానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు దీనిని అంకితం చేస్తున్నానని తెలిపారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన మిథున్‌ చక్రవర్తి.. బాలీవుడ్‌లో ఎన్నో చిత్రాల్లో యాక్ట్‌ చేసి పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్నారు.

హీరోగానే కాకుండా సహాయనటుడు, విలన్‌గా కూడా ఆయన ఎంతోమంది స్టార్‌ హీరోల చిత్రాల్లో నటించారు. 1976లో ’మృగాయ’తో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రంతోనే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ’ముక్తి’, ’బన్సారీ’, ’అమర్‌దీప్‌’, ’ప్రేమ్‌ వివాప్‌ా’, ’భయానక్‌’, ’కస్తూరి’, ’కిస్మత్‌’, ’మే ఔర్‌ మేరా సాథి’, ’సాహాస్‌’, ’వాంటెడ్‌’, ’బాక్సర్‌’, ’త్రినేత్ర’, ’దుష్మన్‌’, ’దలాల్‌’, ’భీష్మ’, ’సుల్తాన్‌’, ’గురు’, ’కిక్‌’, ’బాస్‌’, డిస్కోడాన్సర్‌ వంటి చిత్రాలు ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టాయి.

హిందీ, బెంగాలీ చిత్రాలతోపాటు కన్నడ, తెలుగు, ఒరియా, భోజ్‌పురి చిత్రాల్లోనూ ఆయన నటించారు. ’గోపాల గోపాల’తో తెలుగు వారికి సుపరిచితమయ్యారు. ఇందులో ఆయన ప్రతినాయకుడిగా కనిపించారు. అనంతరం ’మలుపు’ అనే టాలీవుడ్‌ మూవీలోనూ ఆయన యాక్ట్‌ చేశారు. ‘ఐ యామే డిస్కో డాన్సర్‌‘ అన్న పాటతో దేశవిదేశాల్లో గుర్తింపు తెచ్చుకొన్నారు. ఈ ఏడాది ఆరంభంలో ఆయనకు పద్మభూషణ్‌ అవార్డును కేంద్రం అందజేసింది.

RK Roja Shocking Comments On Pawan kalyan Tirumala Tour || Chandrababu || Tirumala Laddu || TR