వకీల్ సాబ్ ప్ర‌మోష‌న్స్ ఖ‌ర్చు అంతనా ?

టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. హిందీలో సూప‌ర్ హిట్ అయిన పింక్ రీమేక్‌గా తెర‌కెక్కిన వ‌కీల్ సాబ్ అనే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో శృతి హాస‌న్ క‌థానాయిక‌గా న‌టించ‌గా, అంజలి, నివేద థామస్, అనన్య నాగేళ్ల కీలకపాత్రల్లో క‌నిపించ‌నున్నారు. ఏప్రిల్ 9న విడుద‌ల కానున్న ఈ చిత్రం కోసం భారీ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

వ‌కీల్ సాబ్ చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా తెలుగు రాష్ట్రాల‌లోని ప్ర‌తి జిల్లాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫుల్ ఫొటోతో రూపొందించిన లైట్ బెలూన్స్‌ని ఏర్పాటు చేయ‌నున్నార‌ట‌. ఒక్క బెలూన్ ఖ‌రీదు ముప్పై వేల రూపాయ‌లు ఉంటుంద‌ని స‌మాచారం. ఇక ఏప్రిల్ 3న యూసుఫ్ గూడ‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయ‌గా, దీనికి దాదాపు కోటి రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో పాటు ఇండియ‌న్ స్టార్ హీరో ఒక‌రు వేడుక‌కు ముఖ్య అతిథులుగా వ‌స్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.

రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న క్రమంలో మేకర్స్ ఇంకా ప్రమోషన్స్ మొదలు పెట్టలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే అందులో వాస్తవం లేదని చెప్పాలి. న్యూ ఇయర్ నుంచి వకీల్ సాబ్ సినిమాకి సంబంధించిన ఏదో ఒక సర్‌ప్రైజ్ ఇస్తూనే ఉన్నారు దిల్ రాజు బృందం. వకీల్ సాబ్ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించగా బాలీవుడ్ మేకర్ బోనీకపూర్ సమర్పిస్తున్నాడు. పవర్ స్టార్ కెరీర్‌లో 26వ సినిమాగా తెరకెక్కిన ‘వకీల్ సాబ్’ సినిమా మీద అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి.