టీడీపీ, జనసేన భేటీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయేది ఇదేనా?

ఏపీలో రసవత్తరంగా రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార విపక్షాల మధ్య గట్టి పోరు జరగనుంది. వైసీపీని టార్గెట్ చేసేందుకు టీడీపీ, జనసేన ఒక్కటై ముందుకు సాగనుంది. జీవో నెంబర్ 1కి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన కలిసి పోరాడేందుకు సిద్ధమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై మాత్రం చంద్రబాబు, పవన్ ఇంకా ఏ విషయాన్ని ప్రకటించలేదు.

ఏపీలో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 రాజకీయంగా అనేక సమస్యలకు తావిస్తోంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ భేటీ కావడం రాజకీయ దుమారం రేపింది. హైదరాబాద్ లోని చంద్రబాబు నాయుడు నివాసంలో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. వీరిద్దరి భేటీ సుమారుగా రెండున్నర గంటల సేపు జరిగింది. ఏపీలో ఈ మధ్య కాలంలో చోటుచేసుకున్న పరిణామాలపై ఇద్దరు నేతలు అన్ని చర్చించుకున్నారు.

వైసీపీ సర్కార్ విధానాలపై పోరాటంపైనే పవన్ తో చంద్రబాబు చర్చించినట్లుగా తెలిపారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనం అయ్యాయని, రాజకీయ పార్టీలన్నీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తనను తన సొంత నియోజకవర్గం కుప్పంలోకి రాకుండా 2వేల మంది పోలీసులతో తనను అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీలో పరిస్థితులు ఎమర్జెన్సీ కన్నా దారుణంగా ఉన్నాయని, కుప్పంలో జరిగిన ఘటనలే అందుకు నిదర్శనమని చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అరాచకాలు, ఫీజు రీయింబర్స్ మెంట్, పెన్షన్లు, శాంతి భద్రతలు తదితర అంశాలపై పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపినట్లుగా తెలిపారు. వైజాగ్ లో తన పర్యటన టైంలో మొదలైన పరిణామాలు కుప్పం వరకు చేరాయని పవన్ వైసీపీ సర్కార్ పై ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ తమ విశ్వరూపం చూస్తుందని హెచ్చరించారు. పొత్తులపై మాత్రం సమయం వచ్చినప్పుడు క్లారిటీ ఇస్తామని తెలిపారు.