స్టార్ హీరో పవన్ కళ్యాణ్ దాదాపుగా తొమ్మిదేళ్ల నుంచి కష్టపడుతున్నా ఏపీలో జనసేన పార్టీ పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదనే సంగతి తెలిసిందే. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకున్నా ఆ పొత్తు వల్ల లాభం కంటే నష్టం ఎక్కువని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏపీలోని ఎన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి అభ్యర్థులు ఉన్నారని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు పవన్ కళ్యాణ్ దగ్గర కూడా సమాధానం లేదు.
జనసేన పాపులారిటీ ఉన్న ఇతర పార్టీలతో పొత్తు లేకుండా పోటీ చేస్తే ఆ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో 2019 ఎన్నికల ఫలితాలు ప్రూవ్ చేశాయి. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీ ప్రజలే పవన్ కళ్యాణ్ ను నమ్మడం లేదని ఇప్పుడు తెలంగాణపై దృష్టి పెడితే తెలంగాణ ప్రజలు నమ్ముతారా? అంటూ ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
పవన్ కళ్యాణ్ వాహనం అయిన వారాహికి ఈ నెల 24వ తేదీన కొండగట్టులో పూజ జరగనుందని సమాచారం అందుతోంది. ఇక్కడ పూజ అనంతరం పవన్ కళ్యాణ్ అతి ముఖ్యమైన కార్యక్రమాలను మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. పూజ తర్వాత తెలంగాణ ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారట. తెలంగాణలో జనసేనకు మద్దతు ఇస్తున్న ముఖ్య నేతలెవరో పవన్ కు మాత్రమే తెలియాలి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేనను అధికారంలోకి తీసుకొనిరావాలని పవన్ కళ్యాణ్ భావించడం ఆయన అత్యాశకు నిదర్శనమని కొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పొత్తుల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ఇతర పార్టీలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ అడిగిన స్థాయిలో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇవ్వడం టీడీపీకి సాధ్యం కాదని సమాచారం అందుతోంది.