Udit Narayan: ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. ఇటీవల ఓ మ్యూజికల్ ఈవెంట్‌లో ఆయన ఓ మహిళా అభిమానికి ముద్దు పెట్టిన వీడియో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీన్ని అనైతికంగా పరిగణిస్తూ నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అయితే ఈ వివాదంపై ఉదిత్ నారాయణ్ స్పందించి తన వాదనను వెల్లడించారు.
తన అభిమానుల పట్ల ప్రేమే కానీ వేరే ఉద్దేశం లేనని స్పష్టం చేశారు. ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉదిత్ నారాయణ్ మాట్లాడుతూ “నా పాటల వల్ల ఎంతో మంది నన్ను అభిమానిస్తారు. వారితో ఎప్పుడూ ఆప్యాయంగా ఉంటాను. ఒకరు సెల్ఫీ కోసం వచ్చి, ఆ ఆనందంలో ఒక క్షణం ఎమోషనల్ అయ్యా. కానీ దానిని తప్పుగా అర్థం చేసుకోవడం బాధాకరం.” అని అన్నారు.
ఈ ఘటన ముంబైలో జరిగిన ఓ లైవ్ కాన్సర్ట్‌లో జరిగింది. “టిప్ టిప్ బర్సా పానీ” పాట పాడుతున్న సమయంలో, ఓ యువతి స్టేజ్ వద్దకు వచ్చి సెల్ఫీ తీసుకునే క్రమంలో ఈ సంఘటన జరిగింది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు “దిగ్గజ గాయకుడికి ఇలాంటి ప్రవర్తన తగునా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇందుకు స్పందించిన ఉదిత్ “అభిమానులు ఒక్కో రకంగా తమ ప్రేమను తెలియజేస్తుంటారు. కొందరు షేక్ హ్యాండ్ కోసం చూస్తారు, మరికొందరు దగ్గరగా రావాలనుకుంటారు. నేనూ అలాంటి ప్రేమను మర్చిపోలేను. కానీ, కొందరు కావాలనే దీన్ని వివాదంగా మార్చుతున్నారు.” అని అన్నారు.
ఉదిత్ నారాయణ్ బాలీవుడ్‌లోనే కాకుండా, టాలీవుడ్‌లోనూ ఎన్నో అద్భుతమైన పాటలు అందించిన గొప్ప గాయకుడు. ఆయన గాత్రం విన్న ప్రతిసారీ 90’s కిడ్స్‌కు ఫ్లాష్‌బ్యాక్ అనుభూతి కలుగుతుంది. ప్రస్తుతం ఆయన మ్యూజికల్ ఈవెంట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. కానీ, తాజా వివాదం అనవసరంగా తలనొప్పిగా మారినట్టుంది. ఇక నుంచి ఇలాంటి వివాదాలకు తాను దూరంగా ఉంటానని ఆయన పేర్కొన్నారు. “నాకు నా గౌరవం చాలా ముఖ్యమైనది” అని తేల్చిచెప్పారు.