విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అతని ఆట మాత్రమే కాదు, స్టైల్, లుక్స్ కూడా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను తెచ్చిపెట్టాయి. అప్పుడప్పుడు అతన్ని పోలిన వ్యక్తుల ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ ఉంటాయి. కానీ తాజాగా వైరల్ అయిన ఫోటో మాత్రం నేరుగా టెలివిజన్ స్క్రీన్ నుంచి రావడం ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. “విరాట్ కోహ్లీ టీవీ సీరీస్‌లో నటిస్తున్నాడా?” అంటూ నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఈ హంగామా రెడ్డిట్‌లో ప్రారంభమైంది. ఒక యూజర్ “అనుష్క శర్మ భర్త టీవీ షో అరంగేట్రం చేశాడు” అనే క్యాప్షన్‌తో ఓ టర్కిష్ నటుడు కావిట్ సెటిన్ గునెర్ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో కనిపించిన వ్యక్తి ముఖం, గడ్డం, హెయిర్‌స్టైల్ అన్నీ చూస్తే అసలైన విరాట్ కోహ్లీనే అన్న అనుమానం కలుగుతోంది. నెటిజన్లు కూడా “ఇతను కోహ్లీ కాదు అని నమ్మించాలంటే కష్టం” అంటూ కామెంట్ల వర్షం కురిపించారు.
ఈ ఫోటో తుర్కీకి చెందిన ప్రముఖ హిస్టారికల్ సీరీస్ Dirilis: Ertugrul లోని ఒక సన్నివేశం నుంచి తీసినదిగా గుర్తించారు. ఈ సీరీస్ 2014 నుంచి 2019 వరకు ఐదు సీజన్లుగా ప్రసారం అయ్యింది. ఇస్లామిక్ ప్రపంచంలో ఇది భారీ హిట్‌గా నిలిచింది. అందులో నటించిన కావిట్ సెటిన్ గునెర్, ఇప్పుడు కోహ్లీలా కనిపిస్తున్న ఫోటోతో మరోసారి వెలుగులోకి వచ్చారు.
ఇంతకీ ఇది అసలు కోహ్లీ కాదు. కానీ ఈ పోలికతో సోషల్ మీడియాలో కోహ్లీ పేరు మరోసారి ట్రెండింగ్ అవుతోంది. సెలబ్రిటీలకు దగ్గరగా కనిపించే వ్యక్తులు ఎంతగా జనాల్లో ఆసక్తిని రేపుతారో, వారి లుక్స్ ఎంతటి ప్రచారాన్ని తెచ్చిపెడతాయో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ఇప్పుడు ఫ్యాన్స్ మాత్రం “టర్కీ కోహ్లీ”ను చూసిన తర్వాత అసలైన కోహ్లీ రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు.