Tollywood: తెలుగు సినీ పరిశ్రమ విశాఖకు తరలిపోతుందట. ఎందుకంటే, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతోంది గనుక.. ఈ నేపథ్యంలోనే జగన్ సర్కార్, విశాఖలో తెలుగు సినీ పరిశ్రమ కోసం ప్రత్యేక వెసులుబాట్లు కల్పించనున్నారు గనుక. వినడానికి చాలా బావుంది ఈ వ్యవహారం. కానీ, సినీ పరిశ్రమ ఓ చోట నుంచి ఇంకో చోటకి తరలిపోవడమంటే అంత తేలిక కాదు. తెలుగు సినీ పరిశ్రమ, మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చసి చాలా ఏళ్ళే అవుతున్నా, ఇప్పటికీ చెన్నయ్ నగరంలోనే చాలామంది సినీ ప్రముఖులు సెటిలయ్యారు. అక్కడి నుంచే వాళ్ళంతా తమ సినీ ప్రస్తానాన్ని తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో సినీ పరిశ్రమకు ప్రభుత్వాలు కల్పిస్తున్న సౌకర్యాలు అన్నీ ఇన్నీ కావు. స్టూడియోల నిర్మాణం దగ్గర్నుంచి, ఇతరత్రా వ్యాపార కార్యకలాపాలు చేపట్టుకునేదాకా.. సినీ పరిశ్రమ, హైద్రాబాద్ నగరాన్ని తమ సొంత ఇల్లుగా భావించినప్పటికీ, చెన్నయ్ నగరంతో మమకారాన్ని ఇంకా తెంచుకోలేకపోతోంది.
అలాంటిది, హైదరాబాద్ నుంచి విశాఖకు సినీ పరిశ్రమ తరలిపోతుందా.? అలా తరలిపోవడానికి హైద్రాబాద్ నగరంలో సినీ పరిశ్రమకు వచ్చిన ఇబ్బందేంటి.? హైద్రాబాద్ కంటే విశాఖలో సినీ పరిశ్రమకు కలిగే అదనపు ప్రయోజనాలేంటి.? ఇలా చాలా ప్రశ్నలున్నాయి. ఏడేళ్ళుగా ఈ మాట వింటూనే వున్నాం. ఆ మాటకొస్తే, పదేళ్ళకు పైనే ఈ వాదన తెరపైకొస్తూ వుంది. కానీ, సినీ పరిశ్రమ హైద్రాబాద్ వదిలి ఇంకో చోటకు వెళ్ళే అవకాశాలైతే కనిపించడంలేదు.
విశాఖలోనూ సినీ పరిశ్రమకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తే, అది రెండో ఇల్లుగా మాత్రమే తెలుగు సినీ పరిశ్రమకు మారే అవకాశం వుండొచ్చు. అన్నిటికీ మించి, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి, రాజకీయ వివాదాలు.. సినీ పరిశ్రమ అటువైపుగా చూసే కనీసపాటి ఆలోచనల్ని సైతం దెబ్బతీస్తున్నాయన్నది నిర్వివాదాంశం.