సినిమా థియేటర్లు మళ్లీ జోరందుకున్నాయి. కారణం.. క్రికెట్ మ్యాచ్‌లకు బ్రేక్ పడడంతో జనాలు వీకెండ్ లో థియేటర్స్ వైపు యూ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలతో ఐపీఎల్ 2025 మ్యాచ్‌లు తాత్కాలికంగా నిలిపివేయబడిన నేపథ్యంలో, ఈ వారం థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. సాధారణంగా ఐపీఎల్ సీజన్‌లో సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోరాడాల్సి వస్తుంది.
కానీ ఈసారి మ్యాచ్‌ల లేకపోవడం సినిమాలకే కలిసి వచ్చిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న ‘సింగిల్’, ‘హిట్ 3: ది థర్డ్ కేస్’, ‘శుభం’ సినిమాలు ఈ అవకాశాన్ని బాగా క్యాష్ చేసుకున్నాయి. శ్రీ విష్ణు నటించిన సింగిల్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంటుండగా, నాని నటించిన హిట్ 3 తన టెన్షన్ ఫుల్ థ్రిల్లింగ్ నేపథ్యంతో ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తోంది. మరోవైపు సమంత సమర్పణలో వచ్చిన కామెడీ హారర్ థ్రిల్లర్ ‘శుభం’ కూడా ఆకట్టుకుంటోంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి కీలక నగరాల్లో ఈ సినిమాలన్ని హౌస్‌ఫుల్ బోర్డులతో దూసుకెళ్తున్నాయి. ‘సింగిల్’ చిత్రానికి హైదరాబాద్‌లో 65% ఆక్యుపెన్సీ నమోదవగా, హిట్ 3 రెండో వీకెండ్‌లోనూ 50% పైగా ఆక్యుపెన్సీని సాధించింది. శుభం సినిమా కూడా తన ప్రమోషన్స్‌తో మంచి ఫ్యామిలీ క్రౌడ్‌ను ఆకర్షిస్తోంది.
ఐపీఎల్ లేదు, వీకెండ్ వాతావరణం ఉంది, థియేటర్లలో కంటెంట్ ఉంది అన్న సమీకరణ సినిమాలకు కలిసొచ్చినదే. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా పునరాగమనం చేయడంతో, ఈ మూడు సినిమాలు కలిపి వీకెండ్ లోనే దాదాపు రూ.10 కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ట్రెండ్ కొనసాగితే, మిగతా చిన్న సినిమాలకు కూడా ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఒక్కసారి కంటెంట్ సక్సెస్ అయితే, ఎలాంటి పోటీ లేకుండానే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారన్నది ఈ వారం రుజువైంది. ఈ సడెన్ బ్రేక్ టాలీవుడ్‌కు ఊపిరివ్వడమే కాకుండా, సమ్మర్ చివర్లో మరోసారి కలెక్షన్ ఉత్సవానికి తెరతీసినట్లైంది.