Salman Khan: జీషన్‌ సిద్ధిక్‌కి, హీరో సల్మాన్‌ ఖాన్‌కు బెదిరింపు.. ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు

Salman Khan: మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ హత్య తర్వాత ఆయన కుమారుడు, ఎన్సీపీ (అజిత్‌ పవార్‌) నేత జీషన్‌ సిద్ధిక్‌కి, బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌కు బెదిరింపు కాల్స్‌ వచ్చిన విషయం తెలిసిందే. చంపేస్తామంటూ సదరు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ బెదిరింపు కాల్స్‌ అక్టోబర్‌ 25వ తేదీన వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ బెదిరింపులపై జీషన్‌ సిద్ధిక్‌ కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బెదిరింపులకు పాల్పడింది నోయిడాకు చెందిన 20 ఏళ్ల వ్యక్తి మహ్మద్‌ తయ్యబ్‌గా గుర్తించారు. తాజాగా అతడిని అరెస్ట్‌ చేశారు. అయితే..అక్టోబర్‌ 17న కూడా బెదిరింపులు వచ్చాయి. ప్రాణాలతో ఉండాలన్నా, బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ సల్మాన్‌ ఖాన్‌ను హెచ్చరించారు. ఈ మేరకు ముంబై ట్రాఫిక్‌ పోలీసుల వాట్సప్‌ నంబర్‌కు అక్టోబర్‌ 17 రాత్రి మెసేజ్‌ చేశారు.

దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ నంబర్‌ ఎవరిది, మెసేజ్‌ ఎక్కడి నుంచి వచ్చిందని కనుక్కొనే పనిలో పడ్డారు. ఈ కేసులో జంషెడ్‌పూర్‌కు 24 ఏళ్ల కూరగాయల అమ్మకం దారుడు షేక్‌ హుస్సేన్‌ షేక్‌ మౌసిన్‌ను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. జీషన్‌ సిద్ధిక్‌ అజిత్‌ పవార్‌కు చెందిన నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీలో ఇటీవలే చేరారు.

కాంగ్రెస్‌ పార్టీ ఆగస్టులో జీషన్‌ను వెలివేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ నేపథ్యంలో ఆ చర్య తీసుకున్నది. ఇక త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బాంద్రా ఈస్ట్‌ నుంచి జీషన్‌ ఎన్సీపీ టికెట్‌పై పోటీ చేయనున్నారు. 2019 ఎన్నికల్లో ఆ స్థానం నుంచి వరుణ్‌ సర్దేశాయ్‌పై పోటీ చేసి గెలిచారు. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్‌ థాక్రే మేనేల్లుడు వరుణ్‌పై ఆయన విజయం సాధించారు.

దమ్మున్న మొగోనివైతే రా భై || Padi Kaushik Reddy Strong WARNING To CM Revanth Reddy || TR