కాంతార ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. రిలీజ్ ఎప్పుడంటే…?

కన్నడ సినీ పరిశ్రమలో ఇటీవల విడుదలైన కాంతార సినిమా ఘనవిజయం అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో అతని దర్శకత్వంలోనే విడుదలైన ఈ సినిమా సెప్టెంబర్ 30వ తేదీన కన్నడ భాషలో విడుదల అయింది. అక్కడ ఈ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఇతర భాషలలో కూడా ఈ సినిమాని డబ్ చేసి విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషలలో విడుదలై దూసుకుపోతోంది.

మొదట చిన్న సినిమాగా విడుదలయిన ఈ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషలలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి నిర్మాతలకు వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇక అక్టోబర్ 15వ తేదీ అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా తెలుగులో కూడా విడుదలైంది. ఇక్కడ కూడా ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

నవంబర్ 4వ తేదీ కాంతార సినిమా ఓటీటీలో విడుదల కానుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా ఓటిటి విడుదలపై సినిమా నిర్మాత స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో నిర్మాత కార్తీక్ గౌడ స్పందిస్తూ.. కాంతార ఓటిటీ గురించి వస్తున్న వార్తలో నిజం లేదు. ఇప్పుడప్పుడే ఈ సినిమా ఓటిటీలో రాదు. ఈ సినిమా ఓటిటి విడుదల గురించి మేమే అధికారికంగా ప్రకటిస్తాం అంటూ వెల్లడించాడు. దీంతో కాంతారా సినిమాని ఓటీటీలో చూడాలని ఆశ పడుతున్న అభిమానులకు నిరాశ ఎదురయింది.