Thalapathy Vijay: తమిళనాడులో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి పరందూరు గ్రామ రైతులు చేస్తున్న ఉద్యమానికి ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగమ్ పార్టీ అధినేత విజయ్ పూర్తి మద్దతు ప్రకటించారు. ఇవాళ రైతుల నిరసన శిబిరాన్ని సందర్శించిన విజయ్, వారికి తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. రైతులు దేశానికి వెన్నెముక అని పేర్కొన్న విజయ్, వారి హక్కుల కోసం తాను చివరి వరకు వెనక్కు తగ్గబోనని స్పష్టం చేశారు.
అభివృద్ధి ముసుగులో రైతులను దెబ్బతీస్తే, అది ఆమోదయోగ్యం కాదని అన్నారు. తన రాజకీయ ప్రస్థానం ఈ ఉద్యమం నుంచే ప్రారంభమవుతుందని విజయ్ అన్నారు. రైతుల సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూ, సారవంతమైన భూములను నాశనం చేయకుండా మరో ప్రదేశాన్ని ఎంచుకుని ఎయిర్‌పోర్టు నిర్మించాలని సూచించారు. అభివృద్ధి అవసరం ఉన్నప్పటికీ, అది ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా ఉండాలని అన్నారు.
ఎయిర్‌పోర్టు నిర్మాణానికి వ్యతిరేకం కాదని, కానీ, ప్రస్తుత ప్రదేశం రైతుల పండించే భూమి కాబట్టి ఇది సబబు కాదని వివరించారు. ఈ పోరాటంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి తాము రైతులకు అండగా ఉంటామని విజయ్ తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే ఈ అంశంపై సమీక్ష చేపట్టాలని డిమాండ్ చేశారు. విజయ్ సమర్థంగా రైతుల సమస్యలపై మాట్లాడిన తీరు అక్కడి ప్రజల్ని కదిలించింది. ఆయన మద్దతు ఉద్యమానికి నూతన శక్తిని ఇచ్చింది. మరి విజయ్ పొలిటికల్ ఇమేజ్ కు ఇది ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.