తమిళనాట రాజకీయ అరంగేట్రం చేసిన కొద్ది నెలలకే సూపర్ స్టార్ విజయ్‌కు కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఫోర్స్ లో వై కేటగిరీ భద్రత కేటాయించడం సంచలనంగా మారింది. ఇప్పటివరకు సినిమాల్లో మాత్రమే సందడి చేసిన విజయ్, తమిళగ వెట్రి కజగమ్ పార్టీ స్థాపనతో రాజకీయాలకు అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026లో జరగనున్న నేపథ్యంలో విజయ్ రాజకీయ ప్రస్థానం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
సినీ జీవితంలో ఎలాంటి పెద్దగా బెదిరింపులు ఎదురుకాని విజయ్, రాజకీయాల్లోకి రాగానే అటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ వర్గాల నివేదిక ప్రకారం, విజయ్‌పై ఇటీవల బెదిరింపులు పెరుగుతుండటంతో, కేంద్ర హోంశాఖ అతనికి ప్రత్యేక భద్రతను కేటాయించాల్సిన అవసరం ఉందని భావించింది. దీనితో, కేంద్రం విజయ్‌కు 8 మంది భద్రతా సిబ్బందితో కూడిన వై కేటగిరీ భద్రతను ఆమోదించింది.
ఈ భద్రత కింద ఇద్దరు కమెండోలు, మిగిలిన స్థానిక పోలీసులు విజయ్ భద్రతను చూడనున్నారు. అయితే, కేంద్రం ఒక షరతు కూడా విధించింది. విజయ్ తమిళనాడులో ఉన్నప్పుడే ఈ భద్రత వర్తించనుండగా, రాష్ట్రం దాటి ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఈ భద్రత ఇక వర్తించదని స్పష్టం చేసింది.
విజయ్‌కు ఇంత త్వరగా కేంద్ర భద్రత కేటాయించడంపై ఆయన అభిమానులు సంబరపడిపోతుండగా, రాజకీయ విశ్లేషకులు దీనిని భిన్న కోణంలో చూస్తున్నారు. ఎన్నికల ముందు ఈ రక్షణ అతనికి మరింత ఇమేజ్ పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. విజయ్ భవిష్యత్తు రాజకీయాల్లో మరింత ముందుకు వెళ్తారా? లేదా సినిమా, రాజకీయాలను సమతూకంగా కొనసాగిస్తారా? అన్నది ఆసక్తిగా మారింది.