హైదరాబాద్ నగరం రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్‌తో బాధపడుతోంది. ప్రతి చిన్న వర్షానికే మార్గాలు నిలిచిపోవడం, సమయానికి ప్రయాణాలు పూర్తి చేయలేక ప్రజలు ఇబ్బందులు పడటం ఎప్పటినుంచో కొనసాగుతోంది. ఈ పరిస్థితులనుంచి విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం కొత్త మార్గం ఎంచుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిజ్రాలను ట్రాఫిక్ వలంటీర్లుగా నియమించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.
ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే 3,000 మంది హిజ్రాలను గుర్తించారు. వారిలో కొన్ని కఠినమైన అర్హత పరీక్షల ఆధారంగా 44 మందిని ఎంపిక చేశారు. వీరు గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్నారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రవాణా సౌకర్యం మెరుగుపరచడంలో ఈ హిజ్రాల పాత్ర కీలకంగా ఉండేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీరికి ప్రత్యేక యూనిఫాం సమకూర్చడం, డ్యూటీ సమయంలో ఇన్సూరెన్స్ అందించడం వంటి చర్యలతో ప్రభుత్వం వారికి భరోసా కల్పిస్తోంది.
వీరు వలంటీర్లు మాత్రమే కావడంతో వారికి పోలీస్ అధికారాలు ఉండవు. కానీ, నిర్దేశిత జీతం, ప్రమాదాలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ట్రాఫిక్ సమస్యలను తక్కువ చేయడంలో హిజ్రాల సహకారం కీలకంగా మారుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది తొలి బ్యాచ్ మాత్రమే, మరింత మంది హిజ్రాలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేందుకు పోలీసులు ప్రోత్సహిస్తున్నారు. 18 ఏళ్లు పైబడి, అవసరమైన సర్టిఫికెట్లు కలిగిన హిజ్రాలను ఇందులో భాగం కావాలని పిలుపునిస్తున్నారు. ఈ వినూత్న నిర్ణయం నగరంలో ట్రాఫిక్ సమస్యల్ని పరిష్కరించడంలో ఎంతవరకు సఫలమవుతుందో చూడాలి.