సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ కంటే అతని జీతం ఎక్కువట!

Vaibhav Taneja: ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లాలో భారతీయుడు వైభవ్ తనేజా అందుకున్న వార్షిక వేతనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)గా ఉన్న ఆయన, 2024 సంవత్సరానికి గాను రూ.1,150 కోట్ల (139 మిలియన్ డాలర్లు) వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. ప్రాథమిక జీతం కేవలం $400,000 అయినా, స్టాక్ ఆప్షన్లు, ఈక్విటీ అవార్డుల వల్ల ఇది ఈ రేంజ్‌కి చేరింది.

ఈ మొత్తం జీతం టెక్ ప్రపంచంలోనే అత్యధికంగా ఉండటమే కాకుండా, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ($79 మిలియన్), గూగుల్ అధినేత సుందర్ పిచాయ్ ($10 మిలియన్) వేతనాలను మించినదిగా ‘ది టెలిగ్రాఫ్’ నివేదిక చెబుతోంది. కంపెనీ అమ్మకాలు తగ్గుతుండగా, సీఎఫ్‌ఓకి ఈ స్థాయి వేతనం అందడం కొంతమంది నిపుణులను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఎలాన్ మస్క్ మాత్రం జీతం తీసుకోవడం లేదనే విషయం దీన్ని సమర్థించనిదిగా నిలుస్తోంది.

వైభవ్ తనేజా ప్రస్థానం సాధారణం కాదు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన ఆయన, చైటర్డ్ అకౌంటెంట్‌గా ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ సంస్థలో అనుభవాన్ని సంపాదించారు. తర్వాత సోలార్‌సిటీ ద్వారా టెస్లాలోకి ప్రవేశించి, క్రమంగా కార్పొరేట్ కంట్రోలర్, చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్ హోదాల్లో పనిచేశారు.

ఇప్పుడు టెస్లాలోనే కాదు, టెస్లా ఇండియా విభాగంలోనూ డైరెక్టర్‌గా ఉన్న వైభవ్, భారత్‌లో టెస్లా ఎంట్రీకి దోహదం చేస్తున్న కీలక బాధ్యుల్లో ఒకరు. ఇలాంటి వ్యక్తికి ఈ స్థాయి వేతనం రావడం ఆశ్చర్యకరం అయినా, ఆయన ప్రొఫెషనల్ మార్గంలో సాధించిన స్థాయి మాత్రం మెచ్చుకోతగ్గదే అని విశ్లేషకులు భావిస్తున్నారు.