Elon Musk: హెచ్-1బీ వీసా.. ఎలాన్ మస్క్ షాకింగ్ కామెంట్

టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ హెచ్-1బీ వీసా విధానంపై మరోసారి తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. అమెరికాలో నైపుణ్యమున్న విదేశీ ఉద్యోగులను తీసుకురావడంలో హెచ్-1బీ వీసా కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, ఈ విధానం ప్రస్తుతం పూర్తిగా దుర్వినియోగానికి గురవుతోందని, దీన్ని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఈ సందర్బంగా, కనిష్ఠ వేతనాలను పెంచడం, వీసా నిర్వహణకు అధిక వ్యయాలను అమలు చేయడం వంటి మార్పులు తేవడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చని మస్క్ పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల దేశీయ ఉద్యోగులకు మద్దతు అందించేలా చర్యలు తీసుకోవచ్చని అన్నారు. అలాగే, ప్రపంచంలో అత్యుత్తమ ప్రతిభావంతుల కోసం అమెరికా గమ్యస్థానంగా ఉండాలని, అయితే హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ అందుకు సరైన మార్గం కాదని స్పష్టం చేశారు.

హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ రక్షణకు యుద్ధానికి సిద్ధమంటూ గతంలో చేసిన వ్యాఖ్యలతో మస్క్ సంచలనం సృష్టించారు. ఈ విషయంలో మస్క్ డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులతో మాటల యుద్ధానికి దిగారు. ట్రంప్ ప్రభుత్వం ఆధ్వర్యంలో భాగస్వామిగా పనిచేయనున్న మస్క్, ఈ విధానంలో భారీ సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని మరొకసారి నొక్కి చెప్పారు.

గతంలో హెచ్-1బీ వీసా ద్వారా దక్షిణాఫ్రికా నుంచి అమెరికాకు వలస వచ్చిన ఎలాన్ మస్క్, తన అనుభవాలను పంచుకుంటూ, ఈ ప్రోగ్రామ్‌ను మరింత పారదర్శకంగా మార్చడానికి చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. అమెరికా టెక్ ఇండస్ట్రీకి ఇది కీలకమైన అంశమని ఆయన చెప్పిన ఈ వ్యాఖ్యలు, ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.