టాలీవుడ్ సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి ఆకస్మిక మరణం టాలీవుడ్ ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటని పలువురు సినీ సెలబ్రిటీలు వాపోయారు. సినిమా ఇండస్ట్రీ గొప్ప నటుడిని కోల్పోయిందని వెల్లడించారు.
జయప్రకాశ్ రెడ్డి ప్రస్తుతం గుంటూరులో ఉంటున్నారు. అక్కడ తన కొడుకుతో కలిసి జీవిస్తున్నారు. మంగళవారం ఉదయం స్నానం చేయడానికని బాత్ రూంకు వెళ్లిన జయప్రకాశ్ రెడ్డి.. గుండెపోటుతో బాత్ రూంలోనే కుప్పకూలిపోయారు.
జయప్రకాశ్ రెడ్డి కొడుకు, కోడలుకు కరోనా సోకడంతో వాళ్లు హోం క్వారంటైన్ లో ఉండి ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. అయితే.. జయప్రకాశ్ రెడ్డికి మాత్రం పరీక్షల్లో కరోనా నెగెటివ్ వచ్చిందట.
జయప్రకాశ్ రెడ్డి సినిమాల్లోకి రావడానికి ముందు గుంటూరు జిల్లాలో టీచర్ గా పనిచేశారు. ఆ తర్వాత సినీరంగంలోకి ప్రవేశించారు. ఆయన కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా ప్రేమించుకుందాం రా. అంతకు ముందు ఆయన చిత్రం భళారే విచిత్రం, జంబలకడిపంబ లాంటి సినిమాల్లో కనిపించినా.. ఆయనకు అంత పాపులారిటీ రాలేదు. కానీ.. ప్రేమించుకుందాం రా సినిమా ఆయన కెరీర్ ను మలుపు తిప్పింది.
సాధారణంగా ఏ నటుడైనా ఏదో ఒక పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాడు. ఏదో ఒక పాత్రలో నటిస్తాడు. కానీ.. జయప్రకాశ్ రెడ్డి.. విలక్షణ నటుడు. ఆయన చేయని పాత్రలు లేవు. తండ్రిగా, స్నేహితుడిగా, విలన్ గా, కమెడియన్ గా.. ఇలా అనేక పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
జయప్రకాశ్ రెడ్డి తెలుగుతో పాటు కన్నడ, తమిళంలో వందకు పైగా సినిమాల్లో నటించారు. నాటకాలంటే జయప్రకాశ్ రెడ్డికి చిన్నప్పటి నుంచి ప్రేమ. ఆ ఇష్టంతోనే ఆయన సినీరంగంలోకి వచ్చారు. జయప్రకాశ్ రెడ్డిది కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ.
ఆయనది రాయలసీమ కావడం.. అదే రాయలసీమ మాండలికంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన చివరగా నటించిన సినిమా సరిలేరు నీకెవ్వరూ.
ప్రేమించుకుందాం రా సినిమా సూపర్ సక్సెస్ అవడం.. విలన్ గా జయప్రకాశ్ రెడ్డి అద్భుతంగా నటించడంతో ఇక జయప్రకాశ్ రెడ్డి వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా ఆయన్ను విలన్ అవకాశాలు వరించాయి. ఫ్యాక్షన్ సినిమా అంటే జేపీ విలన్ గా ఉండాల్సిందే.