తమిళ చిత్రపరిశ్రమలో మరోసారి డ్రగ్స్ వ్యవహారం సంచలనం రేపింది. ప్రముఖ నటుడు మన్సూర్ అలీ ఖాన్ కుటుంబం తాజాగా ఈ వివాదంలో చిక్కుకుంది. మన్సూర్ కుమారుడు అలీ ఖాన్ తుగ్లక్ డ్రగ్స్ కేసులో అరెస్టవడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఇది సినీ వర్గాలను మరోసారి తలవంచేలా చేసింది. గత నెలలో చెన్నై జె జె నగర్ పోలీసులు ఓ ప్రైవేట్ కాలేజీ విద్యార్థులను డ్రగ్స్ విక్రయాల కేసులో అరెస్టు చేశారు.
వీరి విచారణలో అలీ ఖాన్ తుగ్లక్ పేరు బయటకు రావడంతో, పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో తుగ్లక్, అతని స్నేహితులు గంజాయి, మెథాంఫెటమిన్ వంటి మాదక ద్రవ్యాలను విక్రయించారని తేలింది. వీటిని సెల్ ఫోన్ కాంటాక్ట్ ద్వారా విద్యార్థులకు అమ్మినట్లు ఆధారాలు లభించాయి. తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల మధ్య గంజాయి సరఫరా చేయడంలో ఈ ముఠా ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
చెన్నైలోని కటంగొళత్తూరులో ఉన్న విద్యార్థులు ఈ డ్రగ్స్‌ను పెద్ద ఎత్తున కొనుగోలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తుగ్లక్‌ను 12 గంటల పాటు విచారించిన అనంతరం మరో ఏడుగురిని కూడా అరెస్టు చేశారు. అరెస్టుల అనంతరం వీరందరిపై హై గ్రేడ్ గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల విక్రయాల కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వీరిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి సినీ పరిశ్రమలో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా తుగ్లక్ డ్రగ్స్ విక్రయాల్లో ఇరుక్కోవడంతో మరింత హాట్ టాపిక్ గా మారింది.